సరిహద్దు గస్తీపై భారత్, చైనా ఒప్పందం
ABN, Publish Date - Oct 22 , 2024 | 03:01 AM
గాల్వన్ లోయలో ఉద్రిక్తతలు ఏర్పడటానికి(2020 మే) ముందు సరిహద్దులో భారత్, చైనా సైన్యం ఏ విధంగానైతే గస్తీ నిర్వహించేవారో తిరిగి అదే విధంగా గస్తీ నిర్వహించుకునేందుకు అవకాశం ఏర్పడిందని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చెప్పారు.
న్యూఢిల్లీ, అక్టోబరు 21: గాల్వన్ లోయలో ఉద్రిక్తతలు ఏర్పడటానికి(2020 మే) ముందు సరిహద్దులో భారత్, చైనా సైన్యం ఏ విధంగానైతే గస్తీ నిర్వహించేవారో తిరిగి అదే విధంగా గస్తీ నిర్వహించుకునేందుకు అవకాశం ఏర్పడిందని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చెప్పారు. సోమవారం ఢిల్లీలో ఒక ఆంగ్ల టీవీ చానల్ సదస్సులో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘గస్తీపై ఒక ఒప్పందానికి వచ్చాం. 2020 నాటి పరిస్థితికి తిరిగి వెళ్లనున్నాం. తద్వారా చైనాతో ఉద్రిక్తతలు ముగిశాయనుకోవచ్చు. 2020 తర్వాత వివిధ కారణాలతో వారు మనల్ని దూరం పెడితే, మనం వారిని దూరం పెట్టాం. ఇప్పుడు ఇరుపక్షాలూ ఒక అవగాహనకు వచ్చాం.
దీంతో 2020 వరకు ఏ విధంగా గస్తీ నిర్వహించామో మళ్లీ అదే విధంగా గస్తీ నిర్వహించుకునేందుకు అవకాశం ఏర్పడింది’ అన్నారు. ‘2020 సెప్టెంబరు నుంచి చర్చలు జరుపుతూనే ఉన్నాం. మరింత సంక్లిష్టంగా ఉన్నప్పటికీ ఇది చాలా సహనంతో కొనసాగిన ప్రక్రియ’ అన్నారు. కాగా, ప్రధాని మోదీ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనే నిమిత్తం చేపట్టనున్న రష్యా పర్యటన వివరాలను సోమవారం మీడియాకు వెల్లడించిన విదేశాంగశాఖ కార్యదర్శి విక్రం మిశ్రీ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి గస్తీ విషయంలో భారత్, చైనా ఒక ఒప్పందానికి వచ్చాయని చెప్పారు. ఇరుదేశాల నుంచి చర్చల్లో పాల్గొనేవారు కొన్ని వారాలుగా పరస్పరం అందుబాటులో ఉన్నారన్నారు. ‘ఎల్‌ఏసీ వెంబడి గస్తీపై భారత్, చైనా ఒక ఒప్పందానికి వచ్చాయి. 2020లో తలెత్తిన అంశాలపై ఒక పరిష్కారానికి వచ్చాయి’ అన్నారు.
Updated Date - Oct 22 , 2024 | 03:01 AM