INDIA Bloc: రాంలీలా మైదాన్‌లో ఇండియా కూటమి మహార్యాలీ.. కేజ్రీవాల్‌కు మద్దతుగా నిలవనున్న నేతలు
ABN , Publish Date - Mar 24 , 2024 | 03:01 PM
లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల ఐక్యత, బలాన్ని ప్రదర్శించే లక్ష్యంతో ఇండియా కూటమి(INDIA Bloc) మార్చి 31న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో 'మహా ర్యాలీ' నిర్వహించనుందని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ ఆదివారం తెలిపారు.
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల ఐక్యత, బలాన్ని ప్రదర్శించే లక్ష్యంతో ఇండియా కూటమి(INDIA Bloc) మార్చి 31న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో 'మహా ర్యాలీ' నిర్వహించనుందని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ ఆదివారం తెలిపారు. లిక్కర్ స్కాంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.
బీజేపీ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని.. మార్చి 31 ఉదయం 10 గంటలకు జరిపే ర్యాలీలో పాల్గొనాలని రాయ్ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినయోగం చేస్తున్నారని ఆరోపించారు.
'కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన తీరును దేశ వ్యాప్తంగా రాజ్యాంగాన్ని ప్రేమించే, గౌరవించే వారందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇది కేవలం కేజ్రీవాల్ గురించి మాత్రమే కాదు. మొత్తం ప్రతిపక్షాన్ని తుడిచిపెట్టడానికి మోదీ కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు. అమ్ముడుపోవడానికి, తలవంచడానికి సిద్ధంగా లేని వారిపై కేసులు నమోదు చేసి.. జైళ్లో వేస్తున్నారు. ఈ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేయడానికి, విస్తరించడానికి రాంలీలా మైదాన్‌లో ర్యాలీ నిర్వహించనున్నాం. ఇది ఇండియా కూటమి మహా ర్యాలీ అవుతుంది. ఢిల్లీ ప్రజలే కాదు దేశ ప్రజలందరూ.. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే వారు రాంలీలా మైదానానికి రావాలని విన్నవిస్తున్నాం”అని రాయ్ అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ర్యాలీ: అతిషి
'మహా ర్యాలీ' కేజ్రీవాల్‌ను రక్షించడానికి కాదు, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి అని ఢిల్లీ మంత్రి అతిషి అన్నారు. “ఇండియా కూటమి రాంలీలా మైదానంలో 'మహా ర్యాలీ'ని నిర్వహిస్తోంది. ఇది అరవింద్ కేజ్రీవాల్‌ను రక్షించడానికి కాదు, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి. బీజేపీ ప్రతిపక్షంపై ఏకపక్ష దాడులు చేస్తోంది” అని ఆమె అన్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి