Akhilesh Yadav: ఇండియా కూటమి ఐక్యత కొత్త చరిత్ర సృష్టిస్తుంది: అఖిలేష్
ABN, Publish Date - Sep 07 , 2024 | 08:10 AM
హరియాణా ఎన్నికల్లో ఇండియా కూటమి ఐక్యత కొత్త చరిత్రను లిఖింస్తుందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) పేర్కొన్నారు.
చండీగఢ్: హరియాణా ఎన్నికల్లో ఇండియా కూటమి ఐక్యత కొత్త చరిత్రను లిఖింస్తుందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) పేర్కొన్నారు. బీజేపీ స్వార్థపూరిత రాజకీయాలను ఓడించేందుకు ఇదే సరైన సమయమని అన్నారు. హరియాణాలో BJP ప్రతికూల, మతపరమైన, విభజన రాజకీయాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఆ పార్టీ అభ్యర్థులను ఓడించే ఇండియా కూటమి నేతలకు తమ పార్టీ మద్దతునిస్తుందని స్పష్టం చేశారు.
మరోవైపు హరియాణా అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్, ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ) మధ్య సీట్ల భాగస్వామ్య చర్చలు జరుగుతుండగా అఖిలేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించి ఆయన ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. "ప్రజా సంక్షేమం బాటలో స్వార్థానికి తావు లేదు. కుటిల, స్వార్థపరులు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఇలాంటి రాజకీయాలను ఓడించేందుకు ఈ తరుణం ఓ చారిత్రాత్మక అవకాశం. మేం విశాల దృక్పథంతో సిద్ధంగా ఉన్నాం. హర్యానా ప్రయోజనాల కోసం ఏ త్యాగానికైనా మేం సిద్ధమే" అని అఖిలేష్ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
బయటపడ్డ విబేధాలు..
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఓ పక్క చర్చలు జరుగుతుండగానే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కాంగ్రె్‌సలోకి జంప్ చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ సీమాపురి నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ క్యాబినెట్ మంత్రి, దళిత నేత రాజేంద్ర పాల్ గౌతం కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, దేవేందర్ యాదవ్, పవన్ ఖేరా సమక్షంలో గౌతం హస్తం పార్టీలో చేరారు. వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో గౌతం చేరికకు ప్రాధాన్యత ఏర్పడింది.
ఆప్ నుంచి వలసలు పార్టీకి లాభించే అవకాశాలున్నాయని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు దళిత హక్కుల కోసం గట్టిగా పోరాడే నేతగా పేరున్న గౌతం పార్టీని వీడటం పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లేనని ఆమ్ ఆద్మీ నేతలంటున్నారు. హరియాణాలోని 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 5న పోలింగ్ జరగనుండగా.. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు ఉండనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించి, జననాయక్ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, హరియాణాలోని10 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక్కొక్కటి ఐదు స్థానాలను గెలుచుకున్నాయి.
For Latest News click here
Updated Date - Sep 07 , 2024 | 08:11 AM