India-Canada: అమిత్‌షాపై అసంబద్ధ ఆరోపణలు.. కెనడా హైకమిషన్ ప్రతినిధికి భారత్ సమన్లు
ABN, Publish Date - Nov 02 , 2024 | 06:19 PM
కెనడా గడ్డపై ఖలిస్థానీ సానుభుతిపరులపై దాడుల వెనుక భారత్ పాత్ర ఉందంటూ ఆ దేశ మంత్రి డేవిడ్ మోరిసన్ ఆరోపణలు చేయడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది.
న్యూఢిల్లీ: జస్టిన్ ట్రుడో నాయకత్వంలోని కెనడా (Candada) ప్రభుత్వం భారత్ పట్ల మరోసారి విషం చిమ్మింది. కెనడా గడ్డపై ఖలిస్థానీ సానుభుతిపరులపై దాడుల వెనుక భారత్ పాత్ర ఉందంటూ ఆ దేశ మంత్రి డేవిడ్ మోరిసన్ ఆరోపణలు చేయడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఆ ఆరోపణలు పూర్తిగా అసంబద్ధమైనవని కొట్టిపారేసింది. న్యూఢిల్లీలో కెనడా హైకమిషన్ ప్రతినిధిని పిలిపించి మందలించినట్టు భారత విదేశాంగ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ శనివారంనాడు వెల్లడించారు.
''కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై అక్టోబర్ 29న అట్టావాలో జరిగిన పబ్లిక్ సేఫ్టీ అండ్ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన స్టాండింగ్ కమిటీ ముందు డేవిడ్ మోరిసన్ నిరాధార ఆరోపణలు చేశారు. దీనిపై న్యూఢిల్లీలోని కెనడా హై కమిషన్ ప్రతినిధిని పిలిపించి నిరసన తెలిపాం. మోరిసన్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని, అసంబద్ధమైనవని పేర్కొంటూ డిప్లమాటిక్ నోట్ ఆయనకు ఇచ్చాం'' అని రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు.
భారత్‌ను అప్రతిష్టపాలు చేయాలని వ్యూహంలో భాగంగానే నిరాధారమైన సమాచారాన్ని కెనడా ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగా అంతర్జాతీయ మీడియాకు లీక్ చేస్తున్నారని, కెనడా ప్రఙుత్వ రాజకీయ అజెండా, ప్రవర్తనా విధానమే ఇందుకు కారణమని జైశ్వాల్ తప్పుపట్టారు. ఏమాత్రం బాధ్యత లేని ఇలాంటి చర్యల వల్ల ఇరుదేశాల దౌపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఖలిస్థాన్ అనుకూలవాది నిజ్జర్ హత్య వెనుక భారత్ కుట్ర ఉందంటూ గత ఏడాది కెనడా ప్రభుత్వం ఆరోపించినప్పటికీ నుంచి భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడం మొదలైంది. కెనడా అభియోగాన్ని భారత్ తీవ్రంగా ఖండించడంతో పాటు ఆధారాలు అడిగినప్పటికీ ట్రుడో సర్కార్ ముఖం చాటేస్తూ వచ్చింది. ఇటీవల తిరిగి నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును కెనడా చేర్చడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. వర్మతో సహా పలువురు దౌత్యవేత్తలను భారత్ వెనక్కి రప్పించింది. ఢిల్లీలోని పలువురు కెనడా దౌత్యవేత్తలను దేశం నుంచి బహిష్కరించింది.
ఇవి కూడా చదవండి:
Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఎన్నికల సలహాలకు ఎంత తీసుకుంటారో తెలుసా..
Kedarnath Temple: కేదార్‌నాథ్ ఆలయం రేపటి నుంచి 6 నెలలు బంద్.. కారణమిదే..
Read More National News and Latest Telugu News
Updated Date - Nov 02 , 2024 | 06:19 PM