ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీజేఐగా జస్టిస్‌ ఖన్నా

ABN, Publish Date - Nov 12 , 2024 | 03:51 AM

భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని అశోకా హాల్లో ద్రౌపది ముర్ము, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాతో ప్రమాణం చేయించారు.

  • ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ముర్ము

  • శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, ఖర్గే

  • వచ్చే ఏడాది మే 13వరకు పదవిలో ఖన్నా

  • తొలిరోజే 45 కేసుల విచారణ

న్యూఢిల్లీ, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని అశోకా హాల్లో ద్రౌపది ముర్ము, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాతో ప్రమాణం చేయించారు. సంజీవ్‌ ఖన్నా ఆంగ్లంలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అర్జున్‌ రాం మేఘ్వాల్‌ , మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, కిరెన్‌ రిజిజు, హర్దీప్‌ సింగ్‌ పూరి, ఏపీ గవర్నర్‌, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అబ్దుల్‌ నజీర్‌ తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. జస్టిస్‌ ఖన్నా వయసు 64 ఏళ్లు. 1960 మే 14న ఆయన జన్మించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ వయసు 65 ఏళ్లు. అంటే ఆయన 2025 మే 13 వరకు పదవిలో కొనసాగుతారు. 2019 జనవరి 18న జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి పదవి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

ఎన్నికల బాండ్లు రాజ్యాంగ వ్యతిరేకమని, ఆర్టికల్‌ 370 రద్దు సహేతుకమేనని, ఈవీఎంలలో లోపాలేమీ లేవని ప్రకటించిన వివిధ ధర్మాసనాల్లో ఆయన ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఆయన బెయిల్‌ ఇచ్చారు. ఢిల్లీ యూనివర్సిటీలో లా చదివిన ఖన్నా హైకోర్టు న్యాయమూర్తి కాకముందు అనేక సంవత్సరాలు న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. ఆయన ప్రఖ్యాత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి హెచ్‌ఆర్‌ ఖన్నా సోదరుడి కుమారుడు. ప్రాథమిక హక్కులను రద్దు చేయడం రాజ్యాంగ వ్యతిరేకమని హెచ్‌ఆర్‌ ఖన్నా ప్రకటించిన విషయం తెలిసిందే.


జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా తండ్రి దేవ్‌రాజ్‌ ఖన్నా గతంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, నూతన సీజేఐ సంజీవ్‌ ఖన్నాకు ‘ఎక్స్‌’ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. కాగా ప్రమాణస్వీకార కార్యక్రమానికి విపక్షనేత రాహుల్‌ గాంధీ గైర్హాజరయ్యారు.

  • 50 ఏళ్ల క్రితం ఖన్నా పెద్దనాన్నకు

ఇందిర ఆగ్రహంతో సీజేఐ పదవి దూరం

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌ఆర్‌ ఖన్నా ప్రస్తుత సీజేఐ సంజీవ్‌ ఖన్నాకు పెద్దనాన్న. ఓ కేసులో తనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారని అప్పటి ప్రధాని ఇందిర.. హెచ్‌ఆర్‌ ఖన్నాకు సీజేఐ పదవి ఇవ్వరాదని పట్టుబట్టి అనుకున్నది సాధించారు. 1975లో ఎమర్జెన్సీ సమయంలో ప్రాథమిక హక్కులపై నాటి ప్రధాని ఇందిర ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఏడీఎం జబల్పూర్‌ వర్సెస్‌ శివకాంత్‌ సుక్లా వాజ్యం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ‘ఎమర్జెన్సీ సమయంలో ప్రాథమిక హక్కులను హరించివేయడం సబబేనా?’ అన్నది ఈ వ్యాజ్యం సారాంశం. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ హెచ్‌ఆర్‌ ఖన్నా.. ఇందిర నిర్ణయాన్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. మైనారిటీ తీర్పునే వెలువరించినా.. ఎక్కడా ఎలాంటి జంకు లేకుండా ఆయన నిర్భయంగా వ్యవహరించారు. ఇది ఇందిరకు ఆగ్రహం తెప్పించింది. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్‌గా ఉన్న ఆయనకు సీజేఐ పదవిని దూరం చేసింది. ఖన్నా కంటే జూనియర్‌ను ఇందిర సీజేఐ సీట్లో కూర్చోబెట్టారు.

Updated Date - Nov 12 , 2024 | 03:51 AM