Kangana with Abu Salem: గ్యాంగ్‌స్టర్ అబూ సలేంతో కంగనా.. అసలు నిజం ఏమిటి?
ABN, Publish Date - May 27 , 2024 | 09:12 PM
గ్యాంగ్‌స్టర్ అబూ సలేంతో నటి కంగనా రౌనౌత్ ఒక పార్టీలో పాల్గొన్నట్టు చెబుతున్న ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీనిపై ఎట్టకేలకు కంగన తన 'ఇన్‌స్టా గ్రామ్' స్టోరీస్‌లో సోమవారంనాడు స్పందించారు. తనతో ఉన్న వ్యక్తి ఒక మాజీ జర్నలిస్టు అని పేర్కొంటూ ఆ ఫోటో స్కీన్‌షాట్‌ను షేర్ చేశారు.
మండి: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) రాజకీయాల్లోనూ తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లోని తన స్వగ్రామమైన 'మండి' నుంచి బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా ఆమె పోటీలో ఉన్నారు. జూన్ 1న జరిగే చివరి విడత లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మండిలో పోలింగ్ జరుగనుంది. కొద్దిరోజులుగా విస్తృత ప్రచారంలో పాల్గొంటుండటం, ఈనెల 24న మండి నియోజకవర్గంలో ఆమె తరఫున ప్రధాన మంత్రి నరేందర్ మోదీ సైతం ప్రచారం చేయడం ఆ నియోజకవర్గంలో కంగన గెలుపుపై ఆశలను పెంచాయి. ఈ క్రమంలోనే గ్యాంగ్‌స్టర్ అబూ సలేం (Abu Salem)తో ఆమె ఒక పార్టీలో పాల్గొన్నట్టు చెబుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీనిపై ఎట్టకేలకు కంగన తన 'ఇన్‌స్టా గ్రామ్' స్టోరీస్‌లో సోమవారంనాడు స్పందించారు. తనతో ఉన్న వ్యక్తి ఒక మాజీ జర్నలిస్టు అని పేర్కొంటూ ఆ ఫోటో స్కీన్‌షాట్‌ను షేర్ చేశారు.
"నిస్సహాయ స్థితిలో ఉన్న కాంగ్రెస్ నేతలు గ్యాంగ్‌స్టర్ అబూసలేంతో నేను పార్టీలో పాల్గొన్నట్టు ఒక ఫోటోను ప్రచారంలోకి తెచ్చారు. ఇది కచ్చితంగా ప్రముఖ జర్నలిస్ట్ మార్క్ మాన్యుయెల్‌ను అగౌరపరచడమే అవుతుంది. ఆయన 'టైమ్స్ ఆఫ్ ఇండియా' మాజీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎడిటర్‌గా పనిచేశారు.. ఆయన అబూ సలేం కాదు. ఒక చిత్రం ప్రమోషన్ ఈవెంట్ పార్టీలో మార్క్ మాన్యుయెల్‌తో కలిసి దిగిన ఫోటో" అని కంగనా రనౌత్ వివరించారు.
Updated Date - May 27 , 2024 | 09:17 PM