Kanwar guidelines: ఎక్కడ తినాలో, ఎక్కడ వద్దో యాత్రికులకు తెలుసు... కపిల్ సిబల్ మండిపాటు
ABN, Publish Date - Jul 20 , 2024 | 03:44 PM
ఉత్తరప్రదేశ్‌లో కన్వర్ యాత్ర సాగే మార్గంలో అన్ని తినుబండారాల దుకాణాలపై యజమానుల పేర్లు తప్పనిసరిగా ఉండాల్సిందేనంటూ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఇచ్చిన ఆదేశాలపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ తీవ్ర విమర్శలు చేశారు. ఎక్కడ తినాలో ఎక్కడ తినకూడదో యాత్రికులకు బాగా తెలుసునని అన్నారు.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో కన్వర్ యాత్ర (Kanwar Yatra) సాగే మార్గంలో అన్ని తినుబండారాల దుకాణాలపై యజమానుల పేర్లు తప్పనిసరిగా ఉండాల్సిందేనంటూ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఇచ్చిన ఆదేశాలపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ (Kapil Sibal) తీవ్ర విమర్శలు చేశారు. ఎక్కడ తినాలో ఎక్కడ తినకూడదో యాత్రికులకు బాగా తెలుసునని అన్నారు. ప్రభుత్వాలు విభజన అంశాల జోలికి పోకుండా అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. యాత్ర చుట్టూ ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఇండియా ప్రగతికి అవరోధమవుతుందని, ఇలాంటి అంశాలను ప్రధాన మంత్రి, హోం మంత్రి, ముఖ్యమంత్రులు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోరాదని అన్నారు.
''కన్వర్ యాత్రలో చోటుచేసుకుంటున్న రాజకీయాలతో వికసిత్ భారత్ దిశగా ఇండియాను ముందుకు తీసుకువెళ్లలేం. ప్రధాని, హోం మంత్రి, ముఖ్యమంత్రులు ఇలాంటి అంశాలను లేవనెత్తకూడదు. సామాన్య ప్రజానీకానికి ఇలాంటి అంశాలేవీ పట్టవు. ఆ అంశాలను పార్లమెంటులో తర్వాత లేవనెత్తవచ్చు. ఆర్థిక, రాజకీయ సవాళ్లను అసలు పార్లమెంటులో చర్చించడమే లేదు'' అని శనివారంనాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమేశంలో కపిల్ సిబల్ అన్నారు.
CM Yogi Adityanath : కావడి యాత్ర మార్గంలో హోటళ్లపై యజమాని పేరు ఉండాల్సిందే
కన్వరియా యాత్రలు గతంలోనూ జరిగాయని, యాత్రలో పాల్గొనే వారికి ఎక్కడ తినాలో, ఎక్కడ తినకూడదో బాగా తెలుసునని ఆయన అన్నారు. తినుబండాల దుకాణాల వద్ద యజమానుల పేర్లు ప్రదర్శించాలంటూ మార్గదర్శకాలు జారీ చేయడం యూపీ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులకు తగదని, వెంటనే ఆ ఆదేశాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే దేశంలో నిరుద్యోగ పరిస్థితి సైతం దారుణంగా ఉందని కపిల్ సిబల్ విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల 60,000 పోస్టుల భర్తీకి ఆహ్వానిస్తే 47 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు.
తప్పేముందని ప్రశ్నించిన బీజేపీ ఎంపీ
కాగా, తినుబండారాల దుకాణాల వద్ద యజమానుల పేర్లు ప్రదర్శించాలంటూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను బీజేపీ ఎంపీ నిషికాంత్ డూబే సమర్ధించారు. యూపీలో అఖిలేష్, మాయవతి ప్రభుత్వం ఉన్నప్పుడే మొదటిసారి ఇలాంటి చట్టాలు చేశారని గుర్తుచేశారు. చట్టం ముందు అందరూ సమానులేనని ఆయన వివరించారు. ''ఈ అంశంలో రాజ్యాంగవిరుద్ధం ఏముంది? హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు అంతా తమ దుకాణాల ముందు నేమ్‌ప్లేట్లు ప్రదర్శిస్తారు. చట్టాన్ని బీజేపీ గౌరవిస్తుంది'' అని ఆయన వివరణ ఇచ్చారు.
సుమోటోగా స్వీకరించాలి: అఖిలేష్
కన్వర్ యాత్రకు వెళ్లే మార్గంలో తినుబండారాల దుకాణాలకు యజమానుల పేర్లు తగిలించాలంటూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తప్పుపట్టారు. ఈ అంశాన్ని కోర్టు సుమోటాగా విచారణకు చేపట్టాలని కోరారు. ప్రభుత్వ ఆదేశాలను సామాజిక నేరంతో ఆయన పోల్చారు. ఇలాంటి ఆదేశాల వల్ల ఈ ప్రాంతంలోని శాంతియుత వాతావరణం క్షీణిస్తుందన్నారు.
For More National News and Telugu News..
Updated Date - Jul 20 , 2024 | 03:44 PM