National news: సీఎం, డిప్యూటీ సీఎంకు చేతబడి.. ఏ రాష్ట్రంలో అంటే..?
ABN, Publish Date - May 31 , 2024 | 04:51 PM
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ ప్రత్యర్థులు తనకు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా కేరళలోని ఓ దేవాలయంలో అఘోరాలు, తాంత్రికుల ద్వారా చేతబడి చేయిస్తున్నారని చెప్పడం రాష్ట్రంలో సంచలనంగా మారింది.
బెంగళూరు: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(Karnataka Deputy CM Sivakumar) సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ ప్రత్యర్థులు తనకు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(CM Siddaramaiah)కు వ్యతిరేకంగా కేరళలోని ఓ దేవాలయంలో అఘోరాలు, తాంత్రికుల ద్వారా చేతబడి(Black magic) చేయిస్తున్నారని చెప్పడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఇదంతా తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకే చేస్తున్నారన్నారు. కేరళలోని రాజరాజేశ్వరి ఆలయానికి సమీపంలోని ఏకాంత ప్రదేశంలో అఘోరాలతో ప్రత్యేక యాగం నిర్వహిస్తున్నట్లు తనకు పక్కా సమాచారం అందిందని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే ప్రత్యర్థులు తమపై ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
శత్రువులను నిర్మూలించే 'రాజ కంటక', 'మరణ మోహన స్తంభన' యాగాలు చేయిస్తున్నారని, పూజలో పాల్గొన్న వారే దీని గురించి తమకు తెలిపారని సంచలన విషయాలు వెల్లడించారు. అఘోరాల ద్వారా 21ఎర్ర మేకలు, మూడు గేదెలు, 21నల్లగొర్రెలు, 5పందులను సైతం చేతబడిలో బలి ఇస్తున్నారని తెలిపారు. బీజేపీ, జేడీ-ఎస్ నాయకులు చేతబడి చేయిస్తున్నారా అని పలువురు మీడియా ప్రతినిధిలు అడిగినప్పుడు.. కర్నాటకకు చెందిన రాజకీయ నాయకులే అంటూ శివకుమార్ బదులిచ్చారు. "దీన్ని ఎవరు చేయిస్తున్నారో నాకు తెలుసు, వారు తమ ప్రయత్నాలను కొనసాగించనివ్వండి, నేను ఇబ్బంది పడను, అది వారి విశ్వాసానికే వదిలేస్తున్నా. నేను నమ్మిన శక్తి నన్ను రక్షిస్తుంది" అని శివకుమార్ చెప్పారు. ఎవరు నిర్వహిస్తున్నారో చెప్పమంటూ మీడియా ప్రతినిధులు ఒత్తడి చేయగా అందుకు ఆయన నిరాకరించారు. దీనిపై మీడియానే దర్యాప్తు చేయాలంటూ బదులిచ్చారు.
అనంతరం డిప్యూటీ సీఎం శివకుమార్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పందించారు. జూన్ 2న బెంగళూరులో శాసనసభ్యుల సమావేశం ఉంటుందని ప్రకటించారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలందరినీ ఆహ్వానించామన్నారు. ఈ సమావేశంలో పార్టీ వ్యవహారాలు, ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించనున్నట్లు తెలిపారు. MLC ఎన్నికలకు సంబంధించి "300మంది అభ్యర్థుల్లో 65మందిని షార్ట్‌లిస్ట్ చేశామని వెల్లడించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు డాక్టర్ యతీంద్ర తన తండ్రి కోసం ఎమ్మెల్యే సీటు వదులుకున్నప్పటి నుంచి ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలనే నిబద్ధతతో ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల్లో పరాజయం పాలైన వారితోపాటు ప్రముఖ నేతలు టికెట్లు కోరుతున్నారని, ఎన్నికల్లో సీట్లను త్యాగం చేసిన అభ్యర్థులనూ పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
Telangana: తెలంగాణలో పార్టీ పునఃనిర్మాణానికి చంద్రబాబు చర్యలు ఫలించేనా..?
Lok sabha Elections: ఆ రాష్ట్రాల్లో లోక్‌సభ ఏడో దశ ఎన్నికలు..
For Latest News and National News click here
Updated Date - May 31 , 2024 | 05:06 PM