Share News

Kumbh Mela 2025: మహా కుంభమేళాకు.. రూ.7,500 కోట్లు

ABN , Publish Date - Dec 30 , 2024 | 04:19 AM

పన్నెండేళ్లకోసారి జరిగే మహా కుంభమేళాకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ సిద్ధమవుతోంది.

Kumbh Mela 2025: మహా కుంభమేళాకు.. రూ.7,500 కోట్లు

న్యూఢిల్లీ/హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి) డిసెంబరు 29: పన్నెండేళ్లకోసారి జరిగే మహా కుంభమేళాకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ సిద్ధమవుతోంది. 45 రోజులపాటు ఉత్సవంలా సాగే ఈ కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల మందికిపైగా వస్తారని ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీన్ని ఘనంగా నిర్వహించేందుకు భారీ ప్రణాళికతో సిద్ధమవుతోంది. భద్రత విషయంలో రాజీ పడకుండా 50 వేల మంది సిబ్బందిని మోహరించనుంది. నిరంతర నిఘా కోసం తొలిసారిగా నీటిలోపల 100 మీటర్ల లోతులోని వస్తువులను సైతం గుర్తించే సామర్థ్యం కలిగిన అండర్‌ వాటర్‌ (జలాంతర) డ్రోన్లను ఉపయోగించనున్నారు. కుంభమేళా కోసం కృత్రిమ మేధ (ఏఐ)తో కూడిన 2,700 సీసీ కెమెరాలతో 24 గంటలూ రియల్‌టైమ్‌ మానిటరింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరిగినా వెంటనే స్పందించేలా అత్యాధునిక మల్టీ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ వాహనాలను అందుబాటులో ఉంచనున్నారు. మరోవైపు, ‘నేత్ర కుంభ్‌’ శిబిరం ద్వారా 5 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 3 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేసి గిన్నిస్‌ రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మహా కుంభమేళాకు విచ్చేసే భక్తులకు ప్రత్యేక అనుభూతిని అందించేందుకు యూపీ ప్రభుత్వం 2వేలకు పైగా డ్రోన్లతో భారీ డ్రోన్‌ షోను కూడా ఏర్పాటు చేస్తోంది. మరోవైపు, కుంభమేళా యాత్రికుల కోసం మరో 12 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది. 2025 జనవరి 18, ఫిబ్రవరి 8, 15, 22 తేదీల్లో తిరుపతి- బనారస్‌ (07107), ఫిబ్రవరి 20, 10, 17, 24 తేదీల్లో బనారస్‌- విజయవాడ (07108) రైళ్లను నడుపనున్నారు. ’

142 ఏళ్లలో ఎంత మార్పు..!

మహా కుంభమేళాను ఘనంగా నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం రూ.7,500 కోట్లు ఖర్చుచేసి విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ కుంభమేళాకు 40 కోట్ల మందికిపైగా వస్తారని అంచనా వేస్తోంది. 1882లో భారతదేశ జనాభా 22.5 కోట్లు. అప్పట్లోనే మాఘ అమావాస్య నాడు 8 లక్షల మంది పవిత్ర సంగమంలో స్నానమాచరించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అప్పట్లో ఈ ఏర్పాట్ల కోసం ఖర్చు చేసింది రూ 20,288 మాత్రమే. ఇప్పుడు ఏకంగా రూ.7,500 కోట్లతో ఏర్పాట్లు చేస్తుండడం గమనార్హం.

Updated Date - Dec 30 , 2024 | 04:45 AM