Suresh Gopi: వయనాడ్ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటిస్తారా.. కేంద్ర మంత్రి ఏమన్నారంటే?
ABN, Publish Date - Aug 04 , 2024 | 05:00 PM
కేరళ రాష్ట్రం వయనాడ్‌లో(Wayanad Landslides) కొండ చరియలు విరిగిపడటంతో 350 మందికిపైగా ప్రజలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇంకా 200 మంది ఆచూకీ లభించలేదు.
వయనాడ్: కేరళ రాష్ట్రం వయనాడ్‌లో(Wayanad Landslides) కొండ చరియలు విరిగిపడటంతో 350 మందికిపైగా ప్రజలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇంకా 200 మంది ఆచూకీ లభించలేదు. ఘటనా ప్రాంతాలను కేంద్ర మంత్రి సురేష్ గోపి(Suresh Gopi) ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా బాధితులకు భరోసా ఇచ్చారు. వయనాడ్‌లోని సహాయక శిబిరాలు, క్షతగాత్రులతో నిండిపోయిన విమ్స్ ఆసుపత్రిని కూడా గోపీ సందర్శించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. "కొండచరియలు విరిగిపడిన ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించేందుకు న్యాయపర అంశాలను పరిశీలిస్తున్నాం. జాతీయ విపత్తుగా ప్రకటించేందుకు కేంద్రం సుముఖంగా ఉంది. జాతీయ విపత్తుగా ప్రకటించాలంటే, చట్టపరమైన అంశాలను ముందుగా విశ్లేషించాలి. ప్రస్తుతం మా దృష్టంతా బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి, మెరుగైన వైద్య చికిత్స అందించడంపై ఉంది. కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని అంచనా వేస్తోంది. సర్చ్ ఆపరేషన్ కోసం మరిన్ని బలగాలు అవసరమైతే కేరళ సర్కార్ కేంద్రాన్ని సంప్రదించాలి" అని గోపి సూచించారు.
విపక్షాల డిమాండ్..
కేరళ ఘటనలో వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు తనను తీవ్రంగా కలిచివేశాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల వ్యాఖ్యానించారు. ఆగస్టు 1న ఆయన తన సోదరి, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీతో కలిసి వయనాడ్‌లోని ముండక్కై, చురాల్‌మల, అట్టమల, మెప్పాడి గ్రామాల్లో పర్యటించారు. బాధితులను పునరావాసలకు తరలిస్తున్న ప్రక్రియతోపాటు, వారికి అందుతున్న చికిత్సపై కూడా రాహుల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
‘వయనాడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఆ దృశ్యాలు హృదయాన్ని తీవ్రంగా గాయపరుస్తున్నాయి. నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు. మా నాన్న చనిపోయినప్పుడు ఎలా ఉండేదో.. ఇప్పుడు అలాంటి బాధనే ఎదుర్కొంటున్నాను. నా దృష్టిలో ఇది జాతీయ విపత్తే’’ అని రాహుల్ భావోద్వేగంతో అన్నారు. ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాల్లో, ఆస్పత్రుల్లో బాధితులతో మాట్లాడారు. ‘‘దేశం మీ వెన్నంటే ఉంది..’’ అంటూ వారికి ధైర్యం చెప్పారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇది బాధాకరమైన పరిస్థితి అని.. పినరయి ప్రభుత్వం బాధితులకు అన్ని విధాలా సాయం చేయడానికి కట్టుబడి ఉందని చెప్పారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఈ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరారు.
జాతీయ విపత్తు గురించి..
2005, మే 30న కార్యనిర్వహక ఉత్తర్వుల ద్వారా ప్రధాని ఛైర్మన్‌గా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థను ఏర్పాటుచేశారు. దీన్ని అప్పటి యూపీఏ ప్రభుత్వం 'ప్రకృతి వైపరీత్యాల నష్ట నివారణ' పేరుతో పార్లమెంటులో ప్రవేశపెట్టింది. 2005, డిసెంబరు 23న దీనికి ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. 2006, జనవరి 9న దీనిపై రాష్ట్రపతి సంతకం చేశారు.
2006, సెప్టెంబరు 27న చైర్మన్, తొమ్మిది మంది సభ్యులతో కూడిన జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) అమల్లోకి వచ్చింది. అయితే ఓ ఘటనను జాతీయ విపత్తుగా పరిగణించాలంటే దానికి కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి.
For Latest News and National News click here
Updated Date - Aug 04 , 2024 | 05:01 PM