Maharashtra Election Results: ‘మహా’యుతి విజయానికి ఐదు మెట్లు
ABN, Publish Date - Nov 24 , 2024 | 04:26 AM
ఆర్నెల్ల క్రితం లోక్‌సభ ఎన్నికల్లో తమకు వచ్చిన వ్యతిరేక ఫలితాల నైరాశ్యం నుంచి తేరుకుని మహారాష్ట్రలో ‘మహాయుతి’ సాధించిన విజయం అద్భుతమే! అయితే ఆ అద్భుతం దానంతట అదే జరగలేదు.
సంక్షేమ పథకాలు, అభివృద్ధి, కుల సమీకరణ, హిందూ ఓటు ఏకీకృతం, విదర్భపై ప్రత్యేక దృష్టి
ముంబై: ఆర్నెల్ల క్రితం లోక్‌సభ ఎన్నికల్లో తమకు వచ్చిన వ్యతిరేక ఫలితాల నైరాశ్యం నుంచి తేరుకుని మహారాష్ట్రలో ‘మహాయుతి’ సాధించిన విజయం అద్భుతమే! అయితే ఆ అద్భుతం దానంతట అదే జరగలేదు. ప్రజల్లో కోల్పోయిన పట్టును, విశ్వాసాన్ని తిరిగి సాధించడానికి ఈ ఎన్నికల్లో గెలవడానికి.. అధికార మహాయుతి కూటమి ఒక పద్ధతి ప్రకారం పావులు కదిపింది. తప్పులు, లోపాలు చూసుకుని సరిచేసుకుంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి, కులాల సమీకరణ, మతపరంగా ఏకీకరణ.. అనే పదునైన అస్త్రాలను ప్రయోగించి విజయపీఠాన్ని అధివసించింది!! గెలుపు కోసం మహాయుతి ప్రయోగించిన అస్త్రాలను పరిశీలిస్తే..
సంక్షేమం
ప్రతిపక్షాలను విమర్శించే క్రమంలో ప్రధాని మోదీ పదేపదే ప్రస్తావించే అంశం.. ‘రేవ్‌డీ కల్చర్’. అంటే తాయిలాల సంస్కృతి. కానీ.. లోక్‌సభ ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాల దెబ్బకు అప్రమత్తమైన శిందే సర్కారు ఆ ‘తాయిలాల సంస్కృతి’నే ఆశ్రయించింది! మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ‘మాఝీ లాడ్కీ బహిణ్ యోజనను జూన్ 28న ప్రకటించింది. ఈ పథకం కింద వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలలోపు ఉండి, 21-60ఏళ్ల మధ్య వయసు మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తోంది. తాము మళ్లీ గెలిస్తే ఆ మొత్తాన్ని రూ.2,100 చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. అంగన్వాడీ, ఆశావర్కర్ల వేతనాలను నెలకు రూ.15 వేలు చేసింది. యువకుల ఓట్లను ఆకర్షించడానికి శిందే సర్కారు ఈఏడాది జూలైలో ‘లాడ్లా భాయ్ (లడ్కా భావు) యోజన’ను ప్రకటించింది. దీని కింద 12వ తరగతి, డిప్లొమా, డిగ్రీ పూర్తిచేసినవారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ, శిక్షణ సమయంలో స్టైపెండ్ ఇస్తామ ని శిందే ప్రకటించారు. పేద కుటుంబాలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే ‘అన్నపూర్ణ యోజన’ను జూలై నెలాఖరులో ప్రకటించారు.
అభివృద్ధి
నగరాలు, పట్టణాలకే పరిమితమైన అభివృద్ధి, మౌలిక వసతు ల కల్పనను గ్రామీణ ప్రాంతాల్లో కల్పించడంపై మహాయుతి సర్కారు దృష్టిపెట్టింది. రైతులు పం టను అమ్ముకునేందుకు మార్కెట్లకు వెళ్లడానికి గ్రామీణ ప్రాంతాల్లో 45వేల రోడ్లను నిర్మించింది! ఇవి ఓట్ల రూపంలో ఫలసాయం అందించాయి!!
కులం
రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న మరాఠాల ఓటు తమవైపే ఉంటుందని మహావికాస్ అఘాడీ భావిస్తున్న నేపథ్యంలో హరియాణాలో జాటేతర ఓట్లను ఏకంచేసి విజయం సాధించినట్టుగానే మహారాష్ట్రలోనూ చేయాలని బీజేపీ భావించింది. రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తు న్న మరాఠాలకు ఓబీసీ కేటగిరీలో రిజర్వేషన్ కల్పిస్తే తమ వాటా తగ్గుతుందన్న ఆందోళన ఓబీసీల్లో ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న ఓబీసీల ఓట్లను సంఘటితం చేసే దిశగా వ్యూహాలు రచించింది. ఇందుకోసం 1980ల్లో తనకు కలిసి వచ్చిన మా-ధ-వ మంత్రాన్ని మరోసారి జపించింది. మా-ధ-వ అంటే మాలి, ధన్‌గార్, వంజారీ (ఓబీసీలు). అప్పట్లో మహారాష్ట్రలో మరాఠాలు, దళితులు, కున్బీలు, గిరిజనులు, ముస్లిం ల ఓట్లన్నీ ఎక్కువగా కాంగ్రెస్‌కు పడేవి. దీంతో ఆరెస్సెస్ అప్పట్లో ఓబీసీల ఓట్లపై దృష్టిసారించింది. దాని ఫలితంగానే మహారాష్ట్రలో తొలితరం బీజేపీ నాయకులు ఎన్‌ఎ్‌స ఫరాండే(మాలి), అన్నా డాంగే (ధన్‌గార్), గోపీనాథ్ ముండే (వంజారీ) ఆ కులాల నుంచి వచ్చారు. మరాఠా రిజర్వేషన్ల ఉద్యమాల నేపథ్యంలో ఓబీసీల ఓట్లను తమకనుకూలంగా సంఘటితం చేయడానికి రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒకటి.. మహారాష్ట్రకు చెందిన ఏడు ఓబీసీ కులాలను కేంద్ర జాబితాలో చేర్చాలని, రెండు.. ఓబీసీ క్రీమీలేయర్ వార్షిక ఆదాయ పరిమితిని రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచాలని కేంద్రానికి ప్రతిపాదించింది. దీంతో ఓబీసీల ఓట్లు గణనీయంగా ఆ కూటమికే పడ్డాయి.
మతం
మహారాష్ట్రలోని మైనారిటీల ఓట్లు గంపగుత్తగా మహా వికాస్ అఘాడీకి పడడంతో లోక్‌సభ ఎన్నికల్లో పలు సీట్లను కోల్పోయినట్టు గుర్తించిన మహాయుతి.. దానికి ప్రతిగా హిందువుల ఓట్లను సంఘటితం చేసేందుకు రెండు నినాదాలను రూపొందించింది. ఆ నినాదాలు.. ‘బటేంగేతో కటేంగే (విడిపోతే పడిపోతాం)’.. ‘ఏక్ హైతో సేఫ్ హై (ఐక్యంగా ఉంటే క్షేమంగా ఉంటాం)’. ఈ వ్యూహం పట్టణ, నగర ప్రాంతాల్లో బాగా పనిచేసింది.
విదర్భ
మహారాష్ట్రలో అధికారం సాధించాలంటే కరువు ప్రాంతమైన విదర్భలో ఎక్కువ సీట్లు సాధించాల్సి ఉంటుంది. అయితే.. లోక్‌సభ ఎన్నికల్లో అక్కడ ఘోరంగా దెబ్బతిన్న మహాయుతి ఈ ఎన్నికల్లో ఆ ప్రాంతంపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. గ్రామీణ విదర్భ ప్రాంతంలో బీజేపీకి వ్యతిరేకంగా దళిత, ముస్లిం, ఓబీసీ ఓటర్లను మహావికాస్ అఘాడీ ఏకీకృతం చేసినట్టు గుర్తించి దానికి ప్రతిగా హిందువుల ఐక్యత, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలను విస్తృతంగా ప్రచారం చేసింది. ముఖ్యంగా ఆరెస్సెస్ కార్యకర్తలు ఈ ప్రచారంలో కీలకపాత్ర పోషించారు. దీంతోపాటు ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని కేంద్రంలోని ఎన్డీయే సర్కారు ఎత్తివేసింది.
గ్రామీణంలో మళ్లీ హవా
లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాలతో పాటు విదర్భలో నష్టపోయిన మహాయుతి కూటమి.. ఇప్పుడు అదే ప్రాంతాల్లో గణనీయమైన ఓట్లను తన ఖాతాలో వేసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో మహాయుతి కూటమి 49.3 శాతం ఓట్లను సాధించింది. లోక్‌సభ ఎన్నికల్లో కంటే ఈసారి 9.8 శాతం ఓట్లు పెరిగాయి. మరోవైపు, మారుమూల ప్రాంతాల్లో మహా వికాస్ అఘాడీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ కూటమి లోక్‌సభ ఎన్నికల్లో కంటే 10 శాతం ఓట్లను కోల్పోయి 34.4 శాతం ఓట్లకు పడిపోయింది. మొత్తంగా లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే విదర్భతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మహాయుతి కూటమి 15 శాతానికిపైగా ఓట్ల వృద్ధిని నమోదు చేసింది. మొత్తంగా చూస్తే కొంకణ్, ఉత్తర, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాల్లో మహాయుతి కూటమికి 50 శాతం ఓట్లు వచ్చాయి.
డేటా ఆధారంగా.. ఫోన్లు చేసి మరీ..
ఎన్నికలను ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికాబద్ధంగా ఎదుర్కొనే బీజేపీ.. ఈసారి కూడా అదే వ్యూహాన్ని అవలంబించింది. అత్యంత అధునాతనమైన సాఫ్ట్‌వేర్ ద్వారా ఓటర్ డేటాబే స్‌ను రూపొందించుకుంది. కచ్చితంగా మహాయుతికి ఓటేసే వారి వివరాలు, వారి ఫోన్ నంబర్లు అన్నీ ఆ డేటాబే్‌సలో ఉన్నాయి. కార్యకర్తలందరికీ పార్టీ ఆ డేటాను అందుబాటులో ఉంచింది. దీంతో వారంతా ఎప్పటికప్పుడు ఎవరెవరు ఓటు వేశారు, ఇంకా ఎవరు తమ ఓటుహక్కును వినియోగించుకోలేదు.. అనే సమాచారాన్ని తెలుసుకుని, మధ్యాహ్నం దాకా ఓటు వేయనివారికి ఫోన్ కాల్స్ చేశారు. వారిని పోలింగ్ బూత్‌ల దాకా తీసుకొచ్చేవరకూ పట్టు వదల్లేదు.
Updated Date - Nov 24 , 2024 | 08:03 AM