Maharashtra Cabinet Expansion: నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మహా కేబినెట్
ABN, Publish Date - Dec 15 , 2024 | 08:49 AM
మహారాష్ట్ర కేబినెట్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనుంది. నాగపూర్‌లోని రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్.. మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
ముంబయి, ఆదివారం 15: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలోని కేబినెట్ మంత్రులుగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నాగపూర్‌లోని రాజ్‌భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణ.. ఎమ్మెల్యేల చేత మంత్రులుగా ప్రమాణం చేయించనున్నారు. అయితే దేవేంద్ర కేబినెట్‌లో 30 నుంచి 32 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారని సమాచారం.
కేబినెట్ కూర్పుపై..
ఇక మంత్రి వర్గ కూర్పులో భాగంగా ఎవరికి మంత్రి పదవులు కట్టబెట్టాలనే అంశంపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలు అజిత్ పవార్, ఏకనాథ్ శిండేలతో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ భావన్‌కులే ఇప్పటికే వేర్వేరుగా సమావేశమై చర్చించారు. దీంతో 21 మంది బీజేపీ, 12 మంది శివసేన, 9 మంది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కేబినెట్‌లో చోటు దక్కే అవకాశముందని తెలుస్తోంది.
డిసెంబర్ 16 నుంచి..
మహారాష్ట్ర కేబినెట్‌లో గరిష్టంగా 43 మంది.. అది కూడా ముఖ్యమంత్రితో కలిపి కొనసాగేందుకు వెసులుబాటు ఉంది. మరోవైపు రేపటి నుంచి అంటే.. డిసెంబర్ 16వ తేదీ నుంచి నాగపూర్‌లో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
ఒకే దశలో జరిగిన ఎన్నికలు..
288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20వ తేదీన ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మహాయుతి కూటమి 230 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో మహారాష్ట్ర ఓటరు.. మహాయుతికి పట్టం కట్టినట్లు అయింది.
ఓటరు స్పష్టమైన తీర్పు ఇచ్చినా..
ఈ ఎన్నికల్లో మహారాష్ట్ర ఓటరు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే అంశంపై మహాయుతిలో తీవ్ర తర్జన భర్జన జరిగింది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే అంశంపై పెద్ద సస్పెన్సే కొనసాగింది. చివరకు ముఖ్యమంత్రి పదవి దేవేంద్ర ఫడ్నవీస్‌ను వరించింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 5వ తేదీన ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు అజిత్ పవార్, ఏకనాథ్ శిండేలు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేశారు.
ఎన్ని విమర్శలు చేసినా..
ఇంకోవైపు.. ఈ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీలో భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్), శివసేన (యూబీటీ)కి.. మహాయుతి కూటమిలోని బీజేపీ, శివసేన (శిండే), ఎన్సీపీ (అజిత్ పవార్) మధ్య గట్టి పోరు జరిగింది. ఆ క్రమంలో గత ప్రభుత్వంపై మహావికాస్ అఘాడీలోని ఆయా పార్టీల నేతలు గత శిండే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు సైతం గుప్పించారు. కానీ మహారాష్ట్ర ప్రజలు మాత్రం..మహాయుతికే ఓటు వేసి తమ మద్దతు ప్రకటించడం గమనార్హం.
For National News And Telugu News
Updated Date - Dec 15 , 2024 | 08:58 AM