Maharashtra: ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధం.. గవర్నర్‌ను కలిసిన 'మహాయుతి' నేతలు
ABN, Publish Date - Dec 04 , 2024 | 03:55 PM
బుధవారం ఉదయం విధాన్ భవన్‌లో జరిగిన మహారాష్ట్ర బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతగా దేవేంద్ర ఫడ్నవిస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను గుజరాత్ మాజీ మంత్రి, బీజేపీ కేంద్ర పరిశీలకులు విజయ్ రూపాని అధికారికంగా ప్రకటించారు.
ముంబై: మహారాష్ట్రలో 'మహాయుతి' కూటమి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నికైన దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) కూటమి భాగస్వాములైన ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde), అజిత్ పవార్ (Ajit Pawar)తో కలిసి గవర్నర్ రాధాకృష్ణన్‌ను రాజ్‌భవన్‌లో బుధవారం మధ్యాహ్నం కలుసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు.
Maharashtra Elections: కొలువుదీరనున్న మహా ప్రభుత్వం.. సీఎం అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ..
దీనికి ముందు, బుధవారం ఉదయం విధాన్ భవన్‌లో జరిగిన మహారాష్ట్ర బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతగా దేవేంద్ర ఫడ్నవిస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను గుజరాత్ మాజీ మంత్రి, బీజేపీ కేంద్ర పరిశీలకులు విజయ్ రూపాని అధికారికంగా ప్రకటించారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కేంద్ర పరిశీలకులుగా హాజరయ్యారు. బీజేపీ ఎల్‌పీ నేతగా ఫడ్నవిస్ ఎన్నికతో మూడోసారి ముఖ్యమంత్రిగా ఆయన పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగగమైంది. గురువారంనాడు ముంబైలోని ఆజాద్ గ్రౌండ్స్‌లో ప్రమాణస్వీకారం కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రులుగా ఏక్‌నాథ్ షిండే, ఎన్పీపీ నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ వర్గాల సమాచారం.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరుగగా, ఫలితాలు నవంబర్ 23న వెలువడ్డాయి. 'మహాయుతి' కూటమి అత్యధిక సీట్లతో ఘనవిజయం సాధించింది. కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పార్టీ అయిన బీజేపీ 132 సీట్లతో ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. దీంతో ఈసారి సీఎం పదవిని తమ పార్టీనే చేపట్టాలని, తద్వారా మహారాష్ట్రలో బీజేపీని మరింత బలోపేతం చేయాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. బీజేపీ పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటామని షిండే ప్రకటించడంతో ప్రభుత్వం ఏర్పాటులో తలెత్తిన ప్రతిష్టంభనకు తెరపడింది.
ఇవి కూడా చదవండి
Sukhbir Singh Badal: సుఖ్‌బీర్‌పై కాల్పులు జరిపిందెవరంటే
Uttarakhand: ఆ గంగాజలం స్నానానికి తప్ప తాగడానికి పనికిరాదు: పీసీబీ
Rahul Gandhi: ఘాజీపూర్ సరిహద్దుకు చేరుకున్న రాహుల్, ప్రియాంక గాంధీ
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.
Updated Date - Dec 04 , 2024 | 03:55 PM