Maharashtra: 3వ అంతస్తు నుంచి దూకిన డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యేలు
ABN, Publish Date - Oct 05 , 2024 | 04:31 AM
మహారాష్ట్రలో షెడ్యూల్ తెగల (ఎస్టీ) క్యాటగిరీలో ధన్‌గఢ్ సామాజిక వర్గాన్ని చేర్చాలన్న డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్న నేపథ్యంలో.. అధికార వర్గం ప్రజాప్రతినిధుల నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.
మహారాష్ట్ర సచివాలయంలో ఘటన
ధన్‌గఢ్‌లను ఎస్టీల్లో చేర్చొద్దంటూ నిరసన
నేతలందరూ ఆదివాసీ వర్గం వారే
కింద వలలు ఏర్పాటు చేసి ఉండటంతో తప్పిన ముప్పు
ముంబై, అక్టోబరు 4: మహారాష్ట్రలో షెడ్యూల్ తెగల (ఎస్టీ) క్యాటగిరీలో ధన్‌గఢ్ సామాజిక వర్గాన్ని చేర్చాలన్న డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్న నేపథ్యంలో.. అధికార వర్గం ప్రజాప్రతినిధుల నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఆదివాసీ వర్గానికి చెందిన ఎన్సీపీ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ నరహరి ఝిర్వాల్, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ బీజేపీ ఎంపీ శుక్రవారం మంత్రాలయ (సచివాలయం) మూడో అంతస్తు పై నుంచి దూకి తమ నిరసన తెలిపారు. అయితే సచివాలయంలో ఆత్మహత్యలను అడ్డుకునేందుకు గతంలోనే మొదటి అంతస్తుపై వలలు ఏర్పాటు చేసి ఉండటంతో వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.
అనంతరం ఝిర్వాల్‌తో పాటు ఎంపీ హేమంత్ సావ్రా, ఎమ్మెల్యేలు కిరణ్ లహమాటే, హిరమన్ ఖోస్కర్, రాజేశ్ పాటిల్ పోలీసుల సాయంతో వలపై నుంచి నడుస్తూ బయటికొచ్చి బైఠాయించారు. ధన్‌గఢ్ సామాజిక వర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎస్టీల్లో చేర్చవద్దంటూ వారు డిమాండ్ చేశారు. ఈ పరిణామాలతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా, ప్రస్తుతం ధన్‌గఢ్ కులం ఓబీసీ జాబితాలో ఉంది. దీంతో మిగతా రాష్ట్రాల్లో మాదిరి తమను ఎస్టీల్లో చేర్చాలని కొద్దిరోజులుగా ఆ వర్గం ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు.
Updated Date - Oct 05 , 2024 | 04:31 AM