Maharashtra: ఆవును 'రాజ్యమాత'గా ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం
ABN, Publish Date - Sep 30 , 2024 | 02:58 PM
దేశ ఆధ్మాత్మిక, శాస్త్రీయ, మిలటరీ చరిత్రను తీసుకున్నప్పటికీ గోమాతకు కీలక పాత్ర ఉందని, పురాతన కాలం నుండి గోవును పూజిస్తున్నామని మహారాష్ట్ర సర్కరార్ ఒక ప్రకటనలో తెలిపింది.
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆవు (Cow)ను 'రాజ్యమాత' (Rajya Mata)గా ప్రకటించింది. భారతీయ సంప్రదాయంలో ఆవుకున్న ప్రాధాన్యతకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశ ఆధ్మాత్మిక, శాస్త్రీయ, మిలటరీ చరిత్రను తీసుకున్నప్పటికీ గోమాతకు కీలక పాత్ర ఉందని, పురాతన కాలం నుండి గోవును పూజిస్తున్నామని ఆ ప్రకటన పేర్కొంది. దేశవాళీ ఆవుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతుండటంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. వ్యవసాయంలో ఆవు పేడ ప్రాధాన్యతను కూడా ఆ ప్రకటనలో వివరించింది. ఆవు పాలు మానవ శరీరానికి ఎంతో మేలు చేస్తుందని, ఆవు మూత్రం కూడా అనేక వ్యాధులను నయం చేస్తుందని, గోమాత ఉత్పత్తులతో మానవులు పౌష్టికాహారాన్ని తీసుకుంటున్నట్టు వివరించారు.
పశువుల పెంపకందార్ల సామాజిక ఆర్ధిక అంశాలను పరిగణనలోకి తీసుకుని వారిని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఆ ప్రకటన తెలిపింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ త్వరలో ప్రకటించనున్న నేపథ్యంలో ఆవును రాజ్యమాతగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుత మహారాష్ట్ర అసెంబ్లీ గడువు 2024 నవంబర్ 26వ తేదీతో ముగియనున్నందున దీనికి ముందే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. నవంబర్‌లో దీపావళి పండుగ తర్వాత ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి.
ఇది కూడా చదవండి..
BJP : జమిలిపై ముందుకే!
Updated Date - Sep 30 , 2024 | 02:58 PM