Maharashtra: ఎన్నికల ప్రచారంలో నవనీత్ కౌర్‌పై దాడి
ABN, Publish Date - Nov 17 , 2024 | 03:33 PM
మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలున్నాయి. నవంబర్ 20వ తేదీన ఒకే విడతలో ఎన్నికల జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్ 23వ తేదీన వెలువడనున్నాయి.
ముంబయి, నవంబర్ 17: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రేపటితో.. అంటే సోమవారం సాయంత్రంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని మరింత ఉధృతం చేశాయి. అలాంటి వేళ.. ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న బీజేపీ నేత, మాజీ ఎంపీ నవనీత్ రాణాపై పలువురు వ్యక్తులు దాడికి తెగబడ్డారు. అమరావతిలో దరియాపూర్ సమీపంలోని ఖల్లార్ గ్రామంలో ఆదివారం ఈ దాడి ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యర్థికి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్బంగా నవనీత్ రాణా ప్రసంగిస్తు్న్న సమయంలో పలువురు వ్యక్తులు ఆమె ప్రసంగానికి అడ్డు పడే ప్రయత్నం చేశారు. ఆమె అవేమీ పట్టించుకోకుండా.. తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. అనంతరం సభ వేదికపై నుంచి ఆమె దిగుతున్న సమయంలో.. పలువురు వ్యక్తులు ఆమెతోపాటు వెంట ఉన్న పార్టీ మద్దతుదారులపై కూర్చిలు విసిరారు. దీంతో ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తనపై దాడి చేసిన వారిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆమె.. తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై దాడి జరిగిన తీరును ఈ సందర్భంగా ఆమె తన ఫిర్యాదులో వివరించారు. నిందితులను పట్టుకొకుంటే హిందూ సంఘాలు ఆందోళనకు దిగుతాయని ఆమె స్పష్టం చేశారు. ఈ దాడి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ దాడి ఘటన నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనే రాజకీయ నాయకులకు రక్షణ కల్పించేలా చర్యలు చేపట్టాలనే డిమాండ్ సైతం సర్వత్ర వినిపిస్తుంది. మరోవైపు ఈ కేసు దర్యాప్తును పోలీసులు చేపట్టారు. అందులోభాగంగా ఈ దాడి ఘటనలో నిందితులను గుర్తించేందుకు పోలీసులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలున్నాయి. నవంబర్ 20వ తేదీన ఒకే విడతలో ఎన్నికల జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్ 23వ తేదీన వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ, మహాయుతి కూటమిల మధ్య ప్రధాన పోరు నడుస్తుంది. మహాయుతి కూటమి మరోసారి పాలన పగ్గాలు చేపట్టాలని భావిస్తున్నాయి. అయితే మహాయుతి పాలనకు చరమ గీతం పాడాలని మహా వికాస్ అఘాడీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది.
ఇంకోవైపు ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ భాగస్వామ్య పక్షాలు శివసేన (ఉద్దవ్ ఠాక్రే), కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ (శరద్ పవార్) నేతలు సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి బ్యాగులను ఎన్నికల సంఘం అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాంతో ఎన్నికల సంఘం తమను లక్ష్యంగా చేసుకుని సోదాలు నిర్వహిస్తున్నారంటూ మహా వికాస్ అఘాడీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయతే మహాయుతి కూటమిలోని నేతల పట్ల సైతం ఇదే తరహా సోదాలు నిర్వహించాలంటూ మహా వికాస్ అఘాడీ నేతలు.. ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
For National news And Telugu News
Updated Date - Nov 17 , 2024 | 03:34 PM