Mallikarjun Kharge: దుర్బుద్ధితో వ్యవహరించొద్దు
ABN, Publish Date - Jun 04 , 2024 | 03:11 AM
లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా రాజ్యాంగాన్ని పాటించాలని కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోమవారం అధికార యంత్రాంగానికి బహిరంగ లేఖ రాశారు. ఎలాంటి భయం, పక్షపాతం లేకుండా దేశానికి సేవ చేయాలని, ఎవరిపట్లా దుర్బుద్ధితో వ్యవహరించకూడదని కోరారు
ఓట్ల లెక్కింపు రోజు ఎవరికీ భయపడవద్దు
కౌంటింగ్ సందర్భంగా అధికార యంత్రాంగానికి ఖర్గే లేఖ
న్యూఢిల్లీ, జూన్ 3: లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా రాజ్యాంగాన్ని పాటించాలని కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోమవారం అధికార యంత్రాంగానికి బహిరంగ లేఖ రాశారు. ఎలాంటి భయం, పక్షపాతం లేకుండా దేశానికి సేవ చేయాలని, ఎవరిపట్లా దుర్బుద్ధితో వ్యవహరించకూడదని కోరారు. జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగానే కాకుండా, రాజ్యసభలో ప్రతిపక్ష నేత హోదాలో ఈ లేఖ రాస్తున్నట్టు తెలిపారు. ‘‘ఓట్ల లెక్కింపు రోజున ఎవరికీ భయపడకండి.
ఎలాంటి రాజ్యాంగేతర శక్తులకూ తలవంచకండి. మెరిట్ అధారంగా నిర్ణయాలు తీసుకోండి. మనం భవిష్యత్తు తరాలకు సచేతనమైన ప్రజాస్వామ్యాన్ని, సుస్థిరమైన రాజ్యాంగాన్ని అందించాల్సి ఉంది. భారత్ నిజమైన ప్రజాస్వామ్య దేశంగా ఉండాలన్నా, రాజ్యాంగంలో పొందుపరిచిన ఉన్నత విలువులను కాపాడాలన్నా అది అధికార యంత్రాంగం ద్వారా సాధ్యమ’’ని తెలిపారు. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించినందుకు ఎలక్షన్ కమిషన్, సివిల్ సర్వెంట్లు, పోలీసులు, జిల్లా కలెక్టర్లు, ఇతర సిబ్బందిని అభినందించారు.
సివిల్ సర్వెంట్లు భారత దేశ ఉక్కు చట్రంలాంటి వారని ప్రథమ హోం మంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాజ్యాంగానికి అనుగుణంగా వివిధ సంస్థలను ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీయేనన్న విషయం దేశ ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. ‘‘సంస్థలు స్వతంత్రంగా వ్యవహరించడం చాలా ముఖ్యమైన విషయం. ప్రతి సివిల్ సర్వెంట్ కూడా రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకుంటామని ప్రమాణం చేస్తారు. అందువల్ల కింది నుంచి పై స్థాయి వరకు ఉన్న అధికారులంతా తమ విధి నిర్వహణలో ఈ స్ఫూర్తిని ప్రదర్శించాలి.
ఈ విషయంలో అధికార కూటమి నుంచి గానీ, విపక్ష కూటమి నుంచిగానీ ఎలాంటి బెదిరింపులు వచ్చినా లొంగకండి’’ అని కోరారు. ‘‘గత దశాబ్ద కాలంగా సంస్థల స్వయంప్రతిపత్తిని అధికార పక్షం ఒక పద్ధతి ప్రకారం అణగదొక్కింది. దాని ప్రభావంగా ప్రజాస్వామ్య విలువలు దెబ్బతిన్నాయి. దేశాన్ని నియంతృత్వం వైపుగా తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
సంస్థలు కూడా తమ స్వయంప్రతిపత్తిని విస్మరించి అధికార పక్ష హుకుంలను అమలు చేస్తున్నాయి. కొందరితే అధికార పార్టీ మాదిరిగా మాట్లాడుతుండడంతో పాటు, వాటి వ్యవహార శైలినే అనుసరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వారి రాజకీయ భావజాలాన్నే చెబుతున్నారు’’ అని వ్యాఖ్యానించారు.
ఇందుకు ఆ సంస్థలను తప్పుపట్టలేమని ఖర్గే అభిప్రాయపడ్డారు. ‘‘మందబలం, బెదిరింపులు, వివిధ వ్యవస్థలను దుర్వినియోగం చేసి భయపెట్టడం, తమ అధికారం ముందు అందరూ తలవంచాలనే మనస్తత్వం కలిగిన ప్రభుత్వ పక్ష వైఖరితో ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ కారణంగా చివరకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి నష్టం కలుగుతోంది’’ అని వివరించారు.
Updated Date - Jun 04 , 2024 | 03:11 AM