MP Kanimozhi: కనిమొళి సంచలన కామెంట్స్.. మోదీ వచ్చి రాష్ట్రంలో తిష్ఠ వేసినా బీజేపీకి ఓట్లు రాలవు..
ABN, Publish Date - Mar 07 , 2024 | 01:08 PM
ప్రధాని మోదీ రోజూ రాష్ట్రానికి వచ్చినా, ఇక్కడే ఇల్లు తీసుకొని బస చేసినా బీజేపీకి రాష్ట్రప్రజలు ఓటు వేయ్యరని డీఎంకే ఎంపీ కనిమొళి(MP Kanimozhi) ఎద్దేవా చేశారు.
చెన్నై: ప్రధాని మోదీ రోజూ రాష్ట్రానికి వచ్చినా, ఇక్కడే ఇల్లు తీసుకొని బస చేసినా బీజేపీకి రాష్ట్రప్రజలు ఓటు వేయ్యరని డీఎంకే ఎంపీ కనిమొళి(MP Kanimozhi) ఎద్దేవా చేశారు. విల్లివాక్కంలో డీఎంకే ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో కనిమొళి మాట్లాడుతూ... ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ముఖ్యమంత్రి స్టాలిన్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుపుతున్నారన్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వం రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి వెళ్లిందన్నారు. అలాంటి పరిస్థితుల్లోనూ అన్ని రాష్ట్రాలకు దీటుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, అదే ద్రావిడ పాలన అన్నారు. కానీ, కొందరు పెద్దలకు ఈ పాలన నచ్చడం లేదన్నారు. సాక్షాత్తు గవర్నర్ రాష్ట్రప్రభుత్వ పథకాలను శాసనసభలో మాట్లాడలేని పరిస్థితుల్లో అర్ధంతరంగా వెళ్లిపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తుఫాను, భారీవర్షాలతో నష్టపోయిన జిల్లాలను ఆదుకొనేలా మోదీ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. భారీవర్షాల నష్టాలను చూసేందుకు వచ్చిన కేంద్ర మంత్రి రాజ్‌నాథక్ష సింగ్... రాష్ట్రప్రభుత్వం చేపట్టిన వరద నివారణ, సహాయక చర్యలను ప్రశంసించారని తెలిపారు. కానీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బాధిత ప్రాంతాలను పరిశీలించి వెళ్లినా ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. మెట్రోరైలు పథకానికి కేంద్రప్రభుత్వ ఆర్థిక సాయం ఎదురుచూడకుండా రాష్ట్రప్రభుత్వమే నిధులు అందిస్తోందన్నారు. విపత్తులతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు రాని ప్రధాని... ప్రస్తుతం తరచూ రాష్ట్రానికి వస్తున్నారని, అవసరమైతే ప్రతిరోజు వస్తారేమోనని, అందుకు రానున్న పార్లమెంటు ఎన్నికలే కారణమన్నారు.
Updated Date - Mar 07 , 2024 | 01:08 PM