Mumbai : అంబానీ ఇంట్లో పెళ్లంటే ఆ మాత్రం ఉండాలి!
ABN, Publish Date - Jul 15 , 2024 | 05:27 AM
అత్యంత వైభవోపేతంగా, అట్టహాసంగా జరుగుతున్న అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో.. కొత్త ‘టాక్ ఆఫ్ ది టౌన్’.. తన గ్రూమ్స్‌మెన్‌కు అంబానీ ఇచ్చిన ఖరీదైన వాచీలు! ‘గ్రూమ్స్‌మెన్’ అంటే.. పెళ్లికొడుకు
స్నేహితులకు కానుకగా రూ.2 కోట్ల వాచీలు
షారుక్‌ఖాన్, రణ్‌వీర్‌సింగ్ సహా పదిమందికి
మండపంలోకి వెళ్లడానికి క్యూఆర్‌కోడ్
ఒక్కో జోన్‌లో ప్రవేశానికీ ఒక్కో రంగు చేతి బ్యాండ్
అత్యవసర చికిత్సకు ప్రత్యేక వైద్య బృందాలు
అనంత్, రాధిక వివాహ విశేషాలు
ముంబై, జూలై 14: అత్యంత వైభవోపేతంగా, అట్టహాసంగా జరుగుతున్న అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో.. కొత్త ‘టాక్ ఆఫ్ ది టౌన్’.. తన గ్రూమ్స్‌మెన్‌కు అంబానీ ఇచ్చిన ఖరీదైన వాచీలు! ‘గ్రూమ్స్‌మెన్’ అంటే.. పెళ్లికొడుకు ఎంచుకునే అత్యంత ఆప్తమిత్రులు. అర్థమయ్యేలా చెప్పాలంటే.. మన తెలుగింటి పెళి వేడుకల్లో తోడుపెళ్లికొడుకులాగా అన్నమాట. కాకపోతే కొద్దిగా ఎక్కువ మంది ఉంటారు. వేడుక అంతా వాళ్లు పెళ్లికొడుకుతోనే ఉంటారు.
అనంత్ అలా తన గ్రూమ్స్‌మెన్‌గా.. బాలీవుడ్ హీరోలు షారుక్‌ఖాన్, రణ్‌వీర్‌సింగ్, శిఖర్ పహారియా(జాన్వీకపూర్ బాయ్‌ఫ్రెండ్), వీర్‌పహారియా సహా పదిమందిని ఎంచుకున్నాడు. వారందరికీ.. ‘ఔడెమాజ్ పిగే’ అనే స్విస్ కంపెనీ తయారుచేసిన ‘రాయల్ ఓక్ పర్‌పెచ్యువల్ క్యాలెండర్’ వాచీలను బహుమతిగా ఇచ్చాడు. అవి కూడా ప్రీమియర్ లిమిటెడ్ ఎడిషన్. అనంత్ అంబానీ ఇచ్చిన ఆర్డర్ మేరకు ప్రత్యేకంగా ఆ కంపెనీ 25 వాచీలు తయారుచేసి ఇచ్చింది.
వాటివిలువ అక్షరాలా రూ.2,08,79,000. 41 మిల్లీమీటర్ల డయల్‌తో ఉండే ఈ వాచీలకు 18 క్యారెట్ల పింక్ గోల్డ్ కేస్‌లు, బ్రేస్‌లెట్లు ఉంటాయి. ఈ వాచీలు టైముతో పాటు వారం, తేదీ, నెల, లీప్ సంవత్సరం ఇలా చాలా వివరాలే చెప్పగలవు. 20 మీటర్లలోతు (అంటే దాదాపు 65 అడుగుల లోతు) నీటిలో పడ్డా ఈ వాచీలు బాగానే పనిచేస్తాయి.
కాగా..మూడురోజులపాటు అత్యంత వైభవోపేతంగా జరిగిన ఈ పెళ్లి గురించి రకరకాల కొత్త విశేషాలు బయటికొస్తున్నాయి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు, వ్యాపార దిగ్గజాలు, ప్రధాని మోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు పెళ్లికి వస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సందట్లో సడేమియాలో ఎవరు పడితే వారు పందిట్లోకి దూరకుండా..
పెళ్లికి ఆహ్వానించినవారి మొబైల్ ఫోన్లకు ముహూర్తానికి ఆరు గంటల ముందు క్యూఆర్ కోడ్ మెసేజ్‌లు పంపించారు. అమితాబ్ బచ్చన్ అయినా.. షారుక్‌ఖాన్ అయినా.. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లోపలికి రావాల్సిందేనన్నమాట. అలాగే, పెళ్లి జరిగే చోట రకరకాల జోన్లు ఏర్పాటు చేశారు. అన్ని జోన్లలోకీ అందరికీ ప్రవేశం ఉండదు. అలా ప్రవేశించకుండా.. అతిథులకు, సెక్యూరిటీవారికి, రిలయన్స్ ఉద్యోగులకు ఒక్కో రంగు చేతి బ్యాండ్ వేశారు. వైద్యపరంగా అత్యవసరస్థితి ఏర్పడితే అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచారు.
Updated Date - Jul 15 , 2024 | 05:27 AM