National : ఢిల్లీకి వడదెబ్బ
ABN, Publish Date - Jun 20 , 2024 | 04:23 AM
మండే ఎండలు, భీకరమైన వడగాలులు, తీవ్రమైన నీటి కొరత ఢిల్లీ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఎండలు, వడగాలులతో ఢిల్లీలో గడిచిన వారం రోజుల్లో 20 మంది చనిపోయారు.
గడిచిన వారంలో 20 మంది మృత్యువాత
నోయిడాలో ఒక్కరోజే 10 మంది మృతి!
ఆస్పత్రుల్లో పదుల సంఖ్యలో బాధితులు
నీటి కొరతతో సమస్య మరింత తీవ్రం
2 రోజుల్లో పరిష్కరించకపోతే నిరసన
ప్రధానికి ఢిల్లీ నీటి మంత్రి అతిశీ లేఖ
న్యూఢిల్లీ, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): మండే ఎండలు, భీకరమైన వడగాలులు, తీవ్రమైన నీటి కొరత ఢిల్లీ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఎండలు, వడగాలులతో ఢిల్లీలో గడిచిన వారం రోజుల్లో 20 మంది చనిపోయారు. ఢిల్లీ పక్కనే ఉన్న నోయిడాలో ఒక్కరోజులోనే 10మంది మృత్యువాత పడ్డారు. వడదెబ్బతో ఢిల్లీలోని రామ్‌మనోహర్ లోహియా ఆస్పత్రిలో మే 27 నుంచి 45 మంది చేరారు. ఇక్కడ రెండు రోజుల్లోనే 9 మంది చనిపోయారు. సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలో బుధవారం ఒక్కరోజే ఐదుగురు చనిపోయారు. ఈ హాస్పిటల్‌లో మొత్తంగా తొమ్మిది మంది చనిపోయారు. ఎల్‌ఎన్‌జే ఆస్పత్రిలో ఏడు రోజుల్లో ఇద్దరు మృతిచెందారు. ఆస్పత్రుల్లో చేరకుండా చనిపోతున్న వృద్ధుల సంఖ్య ఇంతకంటే ఎక్కువగా ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఢిల్లీ రాజధాని ప్రాంతంలో వడదెబ్బతో పదుల సంఖ్యలో బాధితులు చికిత్స పొందుతున్నారు.
మరణాల రేటు ఎక్కువగా..
ఢిల్లీలో వడగాలుల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆస్పత్రులకు మార్గదర్శకాలను జారీ చేసింది. వడదెబ్బతో వచ్చే రోగులకు త్వరగా చికిత్స అందించాలని సూచించింది. ఆస్పత్రుల సన్నద్ధతపై కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డా కూడా బుధవారం సమీక్ష నిర్వహించారు. వడదెబ్బ బాధితుల కోసం ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా విభాగాలు ఏర్పాటు చేయాలన్నారు.
వడదెబ్బతో ఆస్పత్రిలో చేరుతున్నవారిలో మరణాల రేటు అధికంగా ఉందని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ అజయ్ శుక్లా చెప్పారు. పరిస్థితి విషమించాక బాధితులను ఆస్పత్రులకు తీసుకువస్తున్నారని, వడదెబ్బపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు బయటకు రావొద్దని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సూచించింది. నెల రోజులగా ఢిల్లీని వడగాలులు భయపెడుతున్నాయి. ఇక్కడ రోజువారీ కనిష్ఠ ఉష్ణోగ్రతలే 35 డిగ్రీల దాకా నమోదు అవుతున్నాయి. ఇది సాధారణం కంటే చాల ఎక్కువ. గరిష్ఠ ఉష్ణోగ్రతలు రోజూ 45డిగ్రీలు దాటి నమోదు అవుతున్నాయి. రాత్రిపూట కూడా వేడిగాలులు వస్తుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
హజ్ యాత్రలో 550 మంది మృత్యువాత!
ఎడారి దేశం సౌదీ అరేబియాల్లో మండే ఎండలు ఈ ఏడాది హజ్ యాత్రికుల్లో వందలాది మందిని బలిగొన్నాయి. యాత్రకు వచ్చి ఎండల కారణంగా 550 మంది చనిపోయారని సౌదీలోని అధికార వర్గాలు వెల్లడించాయి. వారి పేర్లతో కూడిన ఓ జాబితా ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతోంది. అయితే, దీనిపై సౌదీ అరేబియా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు, యాత్రికుల్లో 645 మంది మరణించారని అందులో 68 మంది భారతీయులు ఉన్నారని సౌదీ అరేబియాకు చెందిన దౌత్యవేత్త ఒకరు వెల్లడించారు. కాగా, ఈ ఏడాది ఐదు రోజుల హజ్ యాత్ర బుధవారంతో ముగిసింది.
Updated Date - Jun 20 , 2024 | 04:23 AM