New Criminal Laws: జులై 1 నుంచే కొత్త క్రిమినల్ చట్టాల అమలు.. పోలీస్ స్టేషన్లలో అవగాహన సదస్సులు
ABN, Publish Date - Jun 28 , 2024 | 09:48 PM
ప్రధాని మోదీ(PM Modi) ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త క్రిమినల్ చట్టాలు(New Criminal Laws) జులై 1నుంచి అమలు కాబోతున్నాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 17 వేల 500 పోలీస్ స్టేషనల్లో అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు.
ఢిల్లీ: ప్రధాని మోదీ(PM Modi) ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త క్రిమినల్ చట్టాలు(New Criminal Laws) జులై 1నుంచి అమలు కాబోతున్నాయి. ఈ సందర్భంగా ఆ తేదీన దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 17 వేల 500 పోలీస్ స్టేషనల్లో అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. ఇందులో మహిళలు, యువత, విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, ప్రముఖులు పాల్గొంటారు. బ్రిటిష్ కాలం నాటి వలసపాలన చట్టాలను మార్చాలని మోదీ సర్కార్ నిర్ణయించిన విషయం విదితమే.
ఈ మూడు క్రిమినల్ చట్టాల అమలుకు అనుగుణంగా, జులై 1న అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రతి పోలీసు స్టేషన్‌లో అవగాహన సదస్సులకు సంబంధించి అధికారిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందులో చట్టాల ముఖ్య ఉద్దేశం, ప్రాముఖ్యతలు, నిబంధనలు అతిక్రమించే వారిపై తీసుకునే చర్యలు తదితర అంశాలను వివరించనున్నారు.
భారతీయ న్యాయ సంహిత-2023, భారతీయ సాక్ష్య బిల్లు-2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత- 2023 చట్టాలు 1860 నాటి భారతీయ శిక్షాస్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ (CrPC) కోడ్ -1973, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్- 1872 స్థానాలను భర్తీ చేయనున్నాయి. వీటికి 2023లో పార్లమెంట్ ఆమోదం తెలిపింది. డిసెంబర్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తర్వాత చట్టాలుగా మారాయి. జాతీయ భద్రతకు ప్రమాదకరమైన టెర్రరిజం, కొట్టిచంపడం వంటి నేరాలకు కఠిన శిక్షలను ఈ చట్టాలు నిర్దేశిస్తున్నాయి.
ఏడేళ్లు, అంతకు పైబడి శిక్ష పడిన నేరాల్లో ఫోరెన్సిక్ తప్పనిసరని ఈ చట్టాలు చెబుతున్నారు. భారతీయ న్యాయ సంహితలో 20 కొత్త నేరాలు చేర్చగా, IPCలో ఉన్న 19 నిబంధనలను తొలగించారు. 33 నేరాల్లో జైలు శిక్షను పెంచారు. 83 నిబంధనలలో జరిమానా పెంచగా.. 23 నేరాలలో తప్పనిసరి కనీస శిక్షను ప్రవేశపెట్టారు. ఆరు నేరాల్లో సమాజసేవను శిక్షగా మార్చారు. కొత్త చట్టాలు భారతీయత, భారత రాజ్యాంగం, ప్రజల శ్రేయస్సుకు ప్రాధాన్యతనిస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గతంలో చెప్పారు. మూడు చట్టాల పరిధిలోని అన్ని వ్యవస్థలు అమల్లోకి వస్తే ఐదేళ్లలో భారత నేర న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత అధునాతనంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
For Latest News and Tech News click here..
Updated Date - Jun 28 , 2024 | 09:48 PM