Delhi: కొత్త మార్గదర్శకాల ప్రకారమే.. బెదిరింపులు ఒట్టివని తేల్చారు!
ABN, Publish Date - Oct 31 , 2024 | 05:17 AM
గత కొన్ని రోజులుగా వందలాది విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ‘బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్’ (బీసీఏఎస్) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
బెదిరింపులపై పలు కోణాల్లో పరిశీలన
అత్యధికం ఒకే సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి వచ్చినట్లు గుర్తింపు
ప్రమాదం లేదని నిర్ధారణ
న్యూఢిల్లీ, అక్టోబరు 30: గత కొన్ని రోజులుగా వందలాది విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ‘బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్’ (బీసీఏఎస్) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ఆధారంగానే బాంబు బెదిరింపులను ఒట్టివేనని తేల్చి, సదరు విమానాల ప్రయాణానికి అనుమతిస్తోంది. ఫలితంగా, ప్రయాణికులు, విమానయానసంస్థలు, ఎయిర్‌పోర్టులు, భద్రతాసిబ్బంది తదితరులకు అనవసరమైన ఇబ్బందులు, శ్రమ తప్పుతున్నాయి. ఈ మార్గదర్శకాలను బీసీఏఎస్ ఈ నెల 19నే విడుదల చేసినప్పటికీ.. వాటి వివరాలు బుధవారం వెల్లడయ్యాయి. సాధారణంగా బాంబు బెదిరింపులు వచ్చినప్పుడు.. బీసీఏఎస్, సీఐఎ్‌సఎఫ్, స్థానిక పోలీసులు, ఎయిర్‌పోర్టు నిర్వహణ సంస్థ, విమానయాన సంస్థ సిబ్బందితో కూడిన ఓ కమిటీ (బీటీఏసీ) దానిపై నిర్ణయం తీసుకుంటుంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ఈ కమిటీ సదరు బెదిరింపులు నిజమైనవేనా? నకిలీవా? వాటిలో ఉన్న విశ్వసనీయత ఎంత? అన్నది పరిశీలిస్తోంది.
దీంట్లో భాగంగా, బెదిరింపులు చేసిన వ్యక్తి లేదా సంస్థ నేపథ్యం ఏమిటి? ఉగ్రవాదంతోగానీ ఏదైనా నిషేధిత సంస్థతోగానీ సంబంధం ఉన్నవాళ్లా? దుండగుల పేర్లు, వివరాలు నిజమైనవేనా? మారుపేర్లు పెట్టుకున్నవారుగానీ, అజ్ఞాతవ్యక్తులుగానీ వీటిని పంపించారా? ఒకే సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి పలుసార్లు బెదిరింపులు వస్తున్నాయా? వంటి పలు కోణాల్లో ఈ కమిటీ పరిశీలన జరుపుతోంది. బెదిరింపులు వచ్చిన విమానంలో ప్రయాణిస్తున్న వారిలో వీఐపీలు ఉన్నారా అన్నది కూడా పరిగణలోకి తీసుకుంటోంది. వీటి ఆధారంగానే.. వచ్చిన బాంబు బెదిరింపుల తీవ్రతను కమిటీ అంచనా వేసి విమానాన్ని దారి మళ్లించటం, జనసమ్మర్థం లేని ప్రాంతంలో దించటం, తాజాగా మళ్లీ ప్రయాణికుల లగేజీతోపాటు విమానంలో తనిఖీలు జరపటం మొదలైన చర్యలపై నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే, గత కొన్ని వారాలుగా వస్తున్న బెదిరింపులన్నీ కూడా ఒట్టివేనని ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారమే బీటీఏసీ నిర్ణయించిందని వైమానిక రంగానికి చెందిన ఓ సీనియర్ సెక్యూరిటీ అధికారి తెలిపారు. గతంలో బాంబు బెదిరింపులు వచ్చినప్పుడు వాటిని తీవ్రమైనవిగా పరిగణించి పలు జాగ్రత్త చర్యలు చేపట్టేవారమని పేర్కొన్నారు. ప్రస్తుత బెదిరింపుల్లో అత్యధికం ఒకే సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి వస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు.
సల్మాన్ ఖాన్‌కు మళ్లీ బెదిరింపు
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు మళ్లీ బెదిరింపు వచ్చింది. రూ. 2 కోట్లు చెల్లించకపోతే చంపుతామని గుర్తుతెలియని వ్యక్తి ముంబయి ట్రాఫిక్ పోలీసులకు మెసేజ్ పంపాడు. ముంబయి పోలీసుల ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నెంబరుకు గుర్తుతెలియని వ్యక్తి ఈ మెసేజ్ పంపాడు. దీనిపై వర్లి పోలీసులు కేసు నమోదు చేసి ఆ వ్యక్తిని గుర్తించే పనిలో పడ్డారు. సల్మాన్‌ఖాన్, ఎన్‌సీపీ లీడర్ జీషన్ సిద్దిఖీలను చంపుతామని బెదిరించిన యూపీలోని నోయిడాకు చెందిన 20 ఏళ్ల యువకుడిని ముంబయి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. తర్వాత రెండు రోజులకు ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. అంతకుముందు లారెన్స్ బిష్ణోయ్ పేరు చెప్పి రూ.5 కోట్లు చెల్లించాలని సల్మాన్‌ఖాన్‌ను డిమాండ్ చేసిన జమ్‌షెడ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
Updated Date - Oct 31 , 2024 | 05:17 AM