Share News

Nitish Kumar: ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన నితీష్

ABN , Publish Date - Mar 05 , 2024 | 02:33 PM

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు పోటీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన నామినేషన్ పత్రాలను మంగళవారంనాడు ఆయన దాఖలు చేశారు. ఎన్డీయే‌కు చెందిన పలువురు సీనియర్ నేతలు నితీష్ వెంట ఆ కార్యక్రమానికి హాజరయ్యారు.

Nitish Kumar: ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన నితీష్

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) మరోసారి రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌(Lesislative coucil)కు పోటీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన నామినేషన్ పత్రాలను మంగళవారంనాడు ఆయన దాఖలు చేశారు. ఉప ముఖ్యమంత్రులు సమ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, రాజీవ్ సింగ్ లలన్ సహా పలువురు అధికార ఎన్డీయే‌కు చెందిన సీనియర్ నేతలు నితీష్ వెంట ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. నితీష్ కుమార్‌తో పాటు జేడీయూకు చెందిన ఖలీద్ అన్వర్, జితిన్ రామ్ మాంఝీ (హెచ్ఏఎం) కుమారుడు సంతోష్ సుమన్‌ సైతం శాసనమండలికి నామినేషన్లు దాఖలు చేశారు. జితిన్ రామ్ మాంఝీ సైతం ఈ నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి హాజరయ్యరు.


నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి 2006లో శాసన మండలికి ఎన్నికయ్యారు. అప్పట్నించి ఆయన వరుసగా శాసనమండలికి పోటీ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన నాలుగోసారి ఎన్నికల బరిలో ఉన్నారు. శాసన మండలికి ఆయన తాజా సభ్యత్వం మేతో ముగియనుంది. ఈ క్రమంలో బీహార్ విధాన పరిషత్‌కు చెందిన 11 స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలను ఎన్నికల కమిషన్ ప్రకటించింది.


బీజేపీ 4 సీట్లలో...

ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 11 స్థానాల్లో నాలుగు సీట్లు బీజేపీకి కేటాయించగా, భాగస్వామ్య పార్టీ హిందుస్థానీ అవామీ మోర్చాకు ఒక సీటు కేటాయించారు. రెండు స్థానాల్లో జేడీయూ పోటీ చేస్తోంది. ఎన్డీయే కనీసం 7 సీట్లలో పోటీ చేస్తోందని, అవసరమైతే మరిన్ని సీట్లలో పోటీ చేస్తుందని ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి తెలిపారు. ఆర్జేడీ, కాంగ్రెస్ నుంచి పలువురు బీజేపీలో చేరవచ్చనే ఊహాగానాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల గడువు మార్చి 11న ముగియనుండగా, నామినేషన్ల ఉపసంహరణ గడువు 14వ తేదీతో ముగుస్తుంది. మార్చి 21న ఓటింగ్ జరుగుతుంది.

Updated Date - Mar 05 , 2024 | 02:36 PM