Bhubaneswar: ఫిర్యాదుకు వెళ్తే అరెస్టు చేసి లైంగికంగా వేధించారు
ABN, Publish Date - Sep 21 , 2024 | 05:33 AM
ఫిర్యాదు చేయడానికి పోలీసుస్టేషనుకు వెళితే పోలీసులు అరెస్టు చేసి, తనపై దాడి చేసి, లైంగికంగా వేధించారని ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఓ సైనికాధికారి స్నేహితురాలు వాపోయింది.
భువనేశ్వర్, సెప్టెంబరు 20: ఫిర్యాదు చేయడానికి పోలీసుస్టేషనుకు వెళితే పోలీసులు అరెస్టు చేసి, తనపై దాడి చేసి, లైంగికంగా వేధించారని ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఓ సైనికాధికారి స్నేహితురాలు వాపోయింది. ఈ ఘటన సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించి ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసినట్లు ఒడిశా పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. సస్పెండయినవారిలో ఒకరు ఇన్‌స్పెక్టర్. కాగా భువనేశ్వర్‌లోని భరత్‌పూర్ పోలీసులు సెప్టెంబరు 15న ఆమెను అరెస్టు చేయగా... హైకోర్టు బెయిలు ఇవ్వడంతో గురువారం విడుదల చేశారు.
భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లో ఆమె చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై ఆమె విలేకరులతో మాట్లాడుతూ... సెప్టెంబరు 15న తమ రెస్టారెంటును మూసివేశాక అర్ధరాత్రి తన స్నేహితుడైన సైనికాధికారితో కలిసి ఇంటికి వెళుతుండగా కొందరు వ్యక్తులు తమపై దాడి చేశారని చెప్పింది. దీంతో భరత్‌పూర్ పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయబోగా.. పోలీసులు తమను దూషించి, తన స్నేహితుడిని లాక్‌పలో పెట్టారని వాపోయింది. తన కాళ్లు చేతులు కట్టివేసి ఒక రూమ్‌లో పడేశారని, తర్వాత ఒక పోలీసు అధికారి వచ్చి తనను కొట్టి, లైంగికంగా వేధించినట్లు వాపోయింది. ఈ కేసును సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్(ఎన్‌సీడబ్ల్యూ) ఒడిశా డీజీపీ నుంచి నివేదిక కోరింది.
Updated Date - Sep 21 , 2024 | 05:33 AM