Manifesto : పాంచ్ న్యాయ్.. పచ్చీస్ గ్యారెంటీ
ABN , Publish Date - Apr 06 , 2024 | 04:07 AM
కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే గత పదేళ్ల అన్యాయ కాలాన్ని సరిదిద్దే విధంగా సమగ్ర సామాజిక, ఆర్థిక, సంక్షేమ పథకాలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మోదీ హయాంలో పదేళ్లుగా కొనసాగుతున్న ఏక వ్యక్తి, ఏక పార్టీ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడి, దేశ
యువత, మహిళ, రైతు, శ్రామిక వర్గాలకు
న్యాయం.. అభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం
25 గ్యారెంటీల ద్వారా ఐదు న్యాయాల అమలు
కొలువుల్లో మహిళలకు 50ు.. పేద మహిళకు ఏటా లక్ష
50ు రిజర్వేషన్ల పరిమితిని తొలగించేలా సవరణ
ఎమ్మెస్పీకి చట్టబద్ధత, ఉపాధి కూలి రూ.400
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ‘న్యాయ పత్రం’ విడుదల
ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం కోటా.. ఈబీసీలకు 10 శాతం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే గత పదేళ్ల అన్యాయ కాలాన్ని సరిదిద్దే విధంగా సమగ్ర సామాజిక, ఆర్థిక, సంక్షేమ పథకాలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మోదీ హయాంలో పదేళ్లుగా కొనసాగుతున్న ఏక వ్యక్తి, ఏక పార్టీ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడి, దేశ ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక న్యాయం కల్పించడం, స్వేచ్చాస్వాతంత్ర్యాలను పునరుద్ధరిస్తామని తెలిపింది. ఈ మేరకు సమాజంలోని అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని ప్రధాన ప్రతిపక్షపార్టీ కాంగ్రెస్ శుక్రవారం ‘న్యాయ పత్రం’ పేరుతో 45 పేజీల ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మేనిఫెస్టో కమిటీ చైర్‌పర్సన్ చిదంబరం, సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ విలేకరుల సమక్షంలో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ‘పాంచ్ న్యాయ్.. పచ్చీస్ గ్యారెంటీ’ కింద 25 గ్యారంటీలను మేనిఫెస్టోలో ప్రకటించింది. 2025 నుంచి చేపట్టే కేంద్రప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు 50ు రిజర్వేషన్, 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ, విద్య, ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనకబడిన అన్ని కులాల వారికి (ఈబీసీలకు) 10ు రిజర్వేషన్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రస్తుతం ఉన్న 50ు పరిమితిని తొలగించేలా రాజ్యాంగ సవరణ, కులాల వారీగా జనగణన వంటి కీలక హామీలను న్యాయపత్రంలో కాంగ్రెస్ ప్రకటించింది. డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసిన 25 ఏళ్లలోపు యువతలో ప్రతీ ఒక్కరికీ ఏడాదిపాటు అప్రెంటిషిప్ (ఉద్యోగ శిక్షణ) హక్కును కల్పించటంతోపాటు ఆ సమయంలో రూ.లక్ష చెల్లిస్తామని కీలక హామీని ఇచ్చింది. రైతులు దీర్ఘకాలికంగా డిమాండ్ చేస్తున్న పంటలకు కనీస మద్దతు ధరకు (ఎమ్మెస్పీకి) చట్టబద్ధమైన గ్యారెంటీ కల్పించడంతోపాటు వ్యవసాయ వ్యయాల కమిషన్‌ను చట్టబద్ధమైన సంస్థగా ప్రకటిస్తామని తెలిపింది. ఉపాధి హామీ పథకం కింద రోజువారీ వేతనాన్ని రూ.400కు పెంచుతామని వెల్లడించింది. మహాలక్ష్మి పథకం కింద పేద కుటుంబాల మహిళలకు ఏడాదికి రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందిస్తామని హామీ ఇచ్చింది. ఏపీకి ప్రత్యేకహోదాను కల్పిస్తామని ప్రకటించింది.
రవీంద్రుడు కలలుగన్న సమాజమా ఇది?
కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో గత పదేళ్ల మోదీ హయాంలో ధ్వంసమైన ప్రజాస్వామిక విలువలను, దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను సవివరంగా ప్రస్తావించింది. 2014కు ముందుకంటే మీ జీవితం ఇప్పుడు మెరుగ్గా ఉందా? రవీంద్రుడు కలలు కన్న భయం లేని సమాజంలో జీవిస్తున్నారా? అని దేశ ప్రజానీకాన్ని కాంగ్రెస్ ప్రశ్నించింది. గత పదేళ్ల అన్యాయ కాలం నుంచి ప్రజలు విముక్తి పొందేందుకు 2024 సార్వత్రిక ఎన్నికలు ఒక అవకాశమని, మతం, భాష, కులం తదితర అంశాలకు అతీతంగా ఆలోచించి ప్రజలందరి కోసం పనిచేసే ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడేందుకు తోడ్పడాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిర్భయంగా జీవించే పరిస్థితులు కల్పిస్తామని.. వాక్‌స్వాతంత్య్రం, మీడియాకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుందని తెలిపింది.
మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు. వ్యవసాయ పరికరాలు, యంత్రాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు. రైల్వే ప్రైవేటీకరణ నిలిపివేత.
అగ్నివీర్ పథకం రద్దు. ఇంతకుముందులాగా పూర్తికాలం పాటు సైనికుల నియామకం.
పెద్దనోట్ల రద్దు, పెగాసస్, రాఫెల్, ఎన్నికల బాండ్లు తదితర వివాదాస్పద నిర్ణయాలు, ఒప్పందాలు, అవినీతిపై దర్యాప్తు.
విద్యాసంస్థల్లో కుల వివక్ష లేకుండా చూసేందుకు రోహిత్ వేముల చట్టం.
ఏపీకి ప్రత్యేక హోదా. జమ్ము కశ్మీర్‌కు, పుదుచ్చేరిలకు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా.
రాజస్థాన్‌లో గత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన తరహాలో ఆరోగ్య సంరక్షణకు రూ.25 లక్షల మేర నగదు రహిత బీమా.
రెగ్యులర్ ప్రభుత్వోద్యోగాల్లో కాంట్రాక్టు పద్ధతి నియామకాల రద్దు.
ఉన్నత విద్య చదివే, పీహెచ్‌డీ చేసే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు స్కాలర్‌షిప్ రెట్టింపు. క్రీడల్లో మంచి ఫలితాలు సాధించే 21 ఏళ్లలోపు విద్యార్థులకు నెలకు రూ.10 వేలు.
జమిలి ఎన్నికల ప్రతిపాదనను తిరస్కరిస్తాం.
ఈవీఎంలతో వీవీపాట్ స్లిప్‌ల లెక్కింపు జరిగేలా చర్యలు. ఎంపీ, ఎమ్మెల్యే ఫిరాయిస్తే వెంటనే చట్టసభ సభ్యత్వం రద్దయ్యేలా పదో షెడ్యూలులో సవరణ.
పోలీసులు, దర్యాప్తు, నిఘా సంస్థలు నిర్దేశిత చట్టాలకు అనుగుణంగా పని చేసేలా చర్యలు. ఆయా సంస్థలు పార్లమెంటు పర్యవేక్షణలో పని చేసేలా విధానపరమైన నిర్ణయం. సమగ్రంగా జైళ్ల సంస్కరణల అమలు.