PM Modi : ప్రజల సమ్మతితోనే 370 రద్దు
ABN, Publish Date - Aug 06 , 2024 | 05:27 AM
భారత దేశ చరిత్రలో ఆర్టికల్ 370 రద్దు కీలక మలుపు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నాటి నిర్ణయం ప్రజల సమ్మతితోనే జరగాలని భావించానని ఆయన తెలిపారు. ఐదేళ్ల క్రితం తాము తీసుకున్న నిర్ణయం జమ్మూ, కశ్మీర్, లఢఖ్‌లలో కొత్త శకానికి నాంది అని మోదీ వ్యాఖ్యానించారు.
ఆ నిర్ణయంతో కశ్మీర్‌లో నవ శకం
రద్దుకు ఐదేళ్లు పూర్తైన సందర్భంగా మోదీ
న్యూఢిల్లీ, ఆగస్టు 5: భారత దేశ చరిత్రలో ఆర్టికల్ 370 రద్దు కీలక మలుపు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నాటి నిర్ణయం ప్రజల సమ్మతితోనే జరగాలని భావించానని ఆయన తెలిపారు. ఐదేళ్ల క్రితం తాము తీసుకున్న నిర్ణయం జమ్మూ, కశ్మీర్, లఢఖ్‌లలో కొత్త శకానికి నాంది అని మోదీ వ్యాఖ్యానించారు. ‘ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో తమ ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పని చేస్తుంది. ఈ మేరకు కశ్మీర్ వాసులకు హామీ ఇస్తున్నా’ అని మోదీ తన ఎక్స్ సందేశంలో పేర్కొన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ స్పందించారు.
ఆర్టికల్ 370 రద్దుతో భద్రత, భరోసా, మెరుగైన అవకాశాలు ఇక్కడి యువత, మహిళలు, వెనుకబడిన వర్గాలు, గిరిజనులకు చేరువయ్యాయని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి ఫలాలను అందుకోలేని వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం ఐదేళ్ల క్రితం నాడు తీసుకున్న నిర్ణయం ఎంతో ఉపయుక్తంగా మారిందని తెలిపారు. 2019, ఆగస్టు ఐదున మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ, కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే. ఇక, ఆగస్టు ఐదును కాంగ్రెస్, పీడీపీలు బ్లాక్ డేగా పాటించాయి. జమ్మూ, కశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, రాష్ట్రంలో పూర్వస్థితిని తేవాలని డిమాండ్ చేస్తూ ఈ పార్టీలు వేర్వేరుగా నిరసన ర్యాలీలు నిర్వహించాయి. ఆగస్టు 5 భారత ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని ముఫ్తి ధ్వజమెత్తారు.
తక్షణం ఎన్నికలు పెట్టండి: కాంగ్రెస్
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నిర్దేశించిన సమయంలోపు జమ్మూ, కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. తమను పాలించే వారిని ఎన్నుకునే అవకాశం కశ్మీర్ ప్రజలకు కల్పించాలని, తద్వారా కొన్నేళ్లుగా కొనసాగుతున్న అధికారుల పాలనకు ముగింపు పలకాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే డిమాండ్ చేశారు. ఈ ఏడాది సెప్టెంబరు 30 లోపు జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని గత ఏడాది డిసెంబరులో సుప్రీం కోర్టు ఆదేశించింది.
Updated Date - Aug 06 , 2024 | 05:27 AM