PM Modi: కుటుంబ పాలనలో రాజ్యాంగ దుర్వినియోగం
ABN, Publish Date - Dec 15 , 2024 | 05:05 AM
దేశాన్ని 55 ఏళ్లు పాలించిన నెహ్రూ-గాంధీ కుటుంబమే రాజ్యాంగాన్ని అత్యధికంగా దుర్వినియోగం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
నెహ్రూ నుంచి నాలుగో తరం వరకూ అదేతీరు
ఎమర్జెన్సీతో ఇందిర హక్కులనూ ఉల్లంఘించారు
కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం రక్తం రుచి మరిగింది
బీజేపీ తెచ్చిన సవరణలన్నీ మంచి కోసమే
రాజ్యాంగంపై లోక్‌సభ చర్చలో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, డిసెంబరు 14: దేశాన్ని 55 ఏళ్లు పాలించిన నెహ్రూ-గాంధీ కుటుంబమే రాజ్యాంగాన్ని అత్యధికంగా దుర్వినియోగం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తొలి ప్రధాని నెహ్రూ స్వయంగా రాజ్యాంగ దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆయన బాటలోనే తనయ ఇందిరాగాంధీ నడిచిందని వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా లోక్‌సభలో చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన సుదీర్ఘంగా రెండు గంటలు మాట్లాడారు. అంబేడ్కర్ నేతృత్వంలో రాజ్యాంగకర్తలు అద్భుత రాజ్యాంగాన్ని రచించారని, దాన్ని నెహ్రూ-గాంధీ కుటుంబం ఇష్టం వచ్చినట్లు మార్చేసిందని వ్యాఖ్యానించారు. 1951లో తొలి సవరణతో నెహ్రూ రాజ్యాంగ దుర్వినియోగానికి తెర తీశారని చెప్పారు. రాజ్యాంగం అడ్డొస్తే మార్చేద్దామని స్వయంగా నెహ్రూ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారని ప్రస్తావించారు. 1975లో ప్రజల రాజ్యాంగ హక్కులన్నీ ఉల్లంఘిస్తూ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినపుడు రాజ్యాంఽగానికి కేవలం 25 ఏళ్లు మాత్రమేనన్నారు. రాజ్యాంగాన్ని ఎడాపెడా మార్చే సంప్రదాయానికి తొలి ప్రధానిగా నెహ్రూయే తెర తీశారన్నారు. తండ్రి అడుగు జాడల్లో ఇందిరాగాంధీ సుప్రీంకోర్టు తీర్పులను కూడా తోసిరాజని 1971లో రాజ్యాంగాన్ని అడ్డగోలుగా మార్చేశారని చెప్పారు. ఇందిర న్యాయ వ్యవస్థను తన చెప్పుచేతల్లోకి తెచ్చుకొనే ప్రయత్నాల్లో భాగంగా వాటి రెక్కలు కత్తిరిస్తూ రాజ్యాంగ సవరణలు చేశారన్నారు. రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రి అయ్యాక ఆ కుటుంబం తీరులో మార్పేమీ లేదని చెప్పారు.
షాబానో కేసులో మహిళల హక్కులను గౌరవిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఓటుబ్యాంకును కాపాడుకొనే ప్రయత్నాల్లో భాగంగా రాజీవ్‌గాంధీ సంబంధిత చట్టాల సవరణ ద్వారా నిర్వీర్యం చేశారన్నారు. రాజ్యాంగం రక్తం రుచి మరిగిన కాంగ్రెస్ కుటుంబం నుంచి నాలుగో తరం కూడా రాజ్యాంగం మీదదాడిని కొనసాగిస్తూనే ఉందని వ్యాఖ్యానించారు. ఆ కుటుంబ పాలనలో 75 సార్లు రాజ్యాంగాన్ని సవరించారన్నారు. ఆ పార్టీ రాజ్యాంగం ప్రకారం భారతదేశ తొలి ప్రధాని పటేల్ కావాలని అన్నారు. కాంగ్రెస్ కమిటీలు ప్రధానిగా వల్లభాయ్ పేరును ప్రతిపాదించినా, నెహ్రూ పేరును ఒక్క పీసీసీ ప్రతిపాదించకపోయినా ఆయన్నే ప్రధానిని చేశారని గుర్తు చేశారు. వెనుకబడిన కులాల నుంచి సీతారాం కేసరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైతే ఆయన్ను బాత్రూంలో బంధించి, పార్టీని కుటుంబం లాగేసుకుందని ఆరోపించారు. 1998లో వాజ్‌పేయి ఎంపీలను కొనుక్కొని ప్రభుత్వాన్ని బతికించుకొనే అవకాశం ఉన్నా రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి అధికారాన్ని వదులుకున్నారని ప్రస్తావించారు. కాంగ్రెస్ పాలనలో ఎంపీలను కొనడానికి ఉపయోగించిన కరెన్సీ కట్టలను పార్లమెంటులో ప్రదర్శించిన విషయాన్ని ప్రస్తావించారు. రాజ్యాంగాన్ని బీజేపీ కూడా సవరించిందని, అయితే, మంచి పనుల కోసమే చేశామని చెప్పారు.
11 సంకల్పాలు
2047 కల్లా అభివృద్ధి చెందిన భారత్‌ను సాధ్యం చేయడానికి ప్రధాని మోదీ 11 సంకల్పాలను ప్రకటించారు.
1) అందరికీ తోడు... అందరి అభివృద్ధి.
2) అవినీతిపై ఉపేక్ష లేదు.
3) చట్టాన్ని పాటించడాన్ని గర్వంగా భావించాలి.
4) వలస పాలన మనస్తత్వం నుంచి విముక్తి.
5) వారసత్వ రాజకీయాలకు దూరం.
6) రాజ్యాంగం పట్ల గౌరవం. దాన్ని రాజకీయాలకు వాడుకోక పోవడం.
7) రిజర్వేషన్లు ఎత్తేయకపోవడం.
8) మత రిజర్వేషన్లను ఆపేయడం.
9) మహిళా ఆధార అభివృద్ధికి భారత్‌ను ఉదాహరణగా మార్చడం
10) రాష్ట్రం నుంచి దేశం వరకు అభివృద్ధి
11) ఒకే భారత్ శ్రేష్ఠ భారత్
Updated Date - Dec 15 , 2024 | 05:05 AM