బంగ్లా చొరబాటుదారులకు జేఎంఎం, కాంగ్రెస్ మద్దతు
ABN, Publish Date - Nov 05 , 2024 | 03:56 AM
ఝార్ఖండ్‌లోని హేమంత్ సోరెన్ ప్రభుత్వం రాష్ట్రమంతటా బంగ్లాదేశ్ చొరబాటుదారులకు నివాసం కల్పిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. వారికి పాలక కూటమి జేఎంఎం-కాంగ్రె్‌స-ఆర్‌జేడీ పార్టీలు అండగా ఉన్నాయన్నారు.
ఓట్ల కోసం ఝార్ఖండ్ వ్యాప్తంగా వారికి నివాసం కల్పిస్తున్నారు
ఇలాగైతే ఆదివాసీలు తగ్గిపోతారు
ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఫైర్
గర్వా, నవంబరు 4: ఝార్ఖండ్‌లోని హేమంత్ సోరెన్ ప్రభుత్వం రాష్ట్రమంతటా బంగ్లాదేశ్ చొరబాటుదారులకు నివాసం కల్పిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. వారికి పాలక కూటమి జేఎంఎం-కాంగ్రె్‌స-ఆర్‌జేడీ పార్టీలు అండగా ఉన్నాయన్నారు. బుజ్జగింపు రాజకీయాలే వాటి ప్రధాన ఎజెండా మారిందని ధ్వజమెత్తారు, ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన గర్వా, చాయీబాసాల్లో జరిగిన ర్యాలీల్లో ప్రసంగించారు. ‘బుజ్జగింపులు పతాకస్థాయికి చేరాయి. ఈ మూడు పార్టీలూ సామాజిక సామరస్యాన్ని నాశనం చేస్తున్నాయి. చొరబాటుదార్ల ఓట్ల కోసం వారికి రాష్ట్రవ్యాప్తంగా నివాసం కల్పిస్తున్నారు. పాఠశాలల్లో సరస్వతీ వందనాన్నే అనుమతించడం లేదంటే ఎంత ప్రమాదకర పరిస్థితో ఊహించండి. పండుగల సందర్భంగా రాళ్ల దాడులు చేస్తున్నారు. ఇది చూపి అమ్మవారి వేడుకలు ఆపేస్తున్నారు. కర్ఫ్యూ విధిస్తున్నారు. చొరబాట్ల వ్యవహారం కోర్టుకెళ్తే.. అధికార యంత్రాంగం అదేమీ లేదని చెబుతోంది. ప్రభుత్వ యంత్రాంగంలోకి కూడా వారు చొరబడ్డారు. ప్రజల రోటీ, బేటీ, మాటీలను తీసుకెళ్లిపోతున్నారు. ఈ మూడు పార్టీల చెడు విధానాల వల్ల ఆదివాసీ జనాభా తగ్గిపోతుంది. నకిలీ సర్టిఫికెట్లతో చొరబాటుదారులకు అవకాశాలిస్తూ గిరిజనుల గుర్తింపు, గౌరవం, ఉనికినే హేమంత్ సర్కారు ప్రశ్నార్థకం చేసింది.
చొరబాటుదార్లు మీ బిడ్డలను తీసుకెళ్లిపోతున్నారు. భూములు కబ్జా చేస్తున్నారు. మీ ఆహారాన్ని తస్కరిస్తున్నారు. జార్ఖండ్ జనసంఖ్యలో మార్పులకు పెద్దఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీజేపీకి అధికారమిస్తే.. చొరబాటుదార్లు కబ్జాచేసిన భూమిని తిరిగి తీసుకునేందుకు కఠిన చట్టం తెస్తాం’ అని ప్రకటించారు. గిరిజనుల రిజర్వేషన్‌ను కాంగ్రెస్ గుంజుకుంటుందని హెచ్చరించారు. దానిని తన ఓటుబ్యాంకైన ముస్లింలకు ఇస్తుందని చెప్పారు. గిరిజనులను గౌరవించే పార్టీ బీజేపీయేనని.. పలు రాష్ట్రాల్లో సీఎంలు, గవర్నర్లుగా నియమించిందని గుర్తుచేశారు. పార్టీ అధ్యక్ష పదవి గానీ, రాష్ట్రపతి పదవి గానీ కాంగ్రెస్ ఎప్పుడూ గిరిజనులకు ఇవ్వలేదని.. రాష్ట్రపతిగా తొలి గిరిజన మహిళ ఎన్నికనూ వ్యతిరేకించిందని చెప్పారు. ఆదివాసీల ముద్దుబిడ్డయిన మాజీ సీఎం చంపై సోరెన్‌ను అవమానించారని.. తనకు బెయిల్ రాగానే హేమంత్ ఆయన్ను ముఖ్యమంత్రిగా తొలగించి తాను గద్దెనెక్కారని, హేమంత్‌కు తన కుటుంబం కంటే ఎవరూ ఎక్కువ కాదన్నారు.
14 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల తేదీ మార్పు
ఉత్తరప్రదేశ్(9), పంజాబ్(4), కేరళ(1) రాష్ట్రాల్లోని 14 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల పోలింగ్ తేదీ మారింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ మేరకు ఆయా స్థానాలకు ఈనెల 13న పోలింగ్ జరగాల్సి ఉండగా.. వివిధ పండుగల నేపథ్యంలో 20వ తేదీకి మార్పు చేసినట్లు ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. అఖండ్ పథ్, కల్పతి రస్తోల్, కార్తీక పూర్ణిమ పండుగల నేపథ్యంలో పోలింగ్ తేదీని మార్చాలంటూ కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీ సహా పలు పార్టీలు అంతకుముందు ఈసీని కోరాయి.
Updated Date - Nov 05 , 2024 | 03:56 AM