PM Modi : శెభాష్ తెలంగాణ!
ABN, Publish Date - Sep 30 , 2024 | 03:37 AM
లక్ష్యాన్ని మించి మొక్కలు నాటిన తెలంగాణ ప్రజలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ (అమ్మ పేరిట ఒక మొక్క) కార్యక్రమంలో భాగంగా రికార్డు స్థాయిలో మొక్కలు నాటారని పేర్కొంటూ రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలిపారు.
మొక్కలు నాటడంలో రాష్ట్ర ప్రజల చొరవ అభినందనీయం
‘ఏక్ పేడ్.. మా కే నామ్’ లక్ష్యాన్ని మించారు
‘మన్ కీ బాత్’లో ప్రధాని అభినందనలు
నాలుగేళ్లుగా ప్రతిరోజూ ఓ మొక్క నాటిన కేఎన్ రాజశేఖర్‌పై ప్రధాని ప్రశంసలు
పదేళ్ల మన్ కీ బాత్‌పై మోదీ భావోద్వేగం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): లక్ష్యాన్ని మించి మొక్కలు నాటిన తెలంగాణ ప్రజలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ (అమ్మ పేరిట ఒక మొక్క) కార్యక్రమంలో భాగంగా రికార్డు స్థాయిలో మొక్కలు నాటారని పేర్కొంటూ రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలిపారు. దేశ ప్రజల్ని ఉద్దేశించి రేడియోలో మోదీ మాట్లాడే ‘మన్ కీ బాత్’ తాజా ఎపిసోడ్ ఆదివారం ప్రసారమైంది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రారంభించిన ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు. ప్రజల భాగస్వామ్యానికి ఈ కార్యక్రమం చక్కని ఉదాహరణని, ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. తెలంగాణకు చెందిన కేఎన్ రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా ఆయన నాలుగేళ్లుగాప్రతి రోజు ఒక మొక్క నాటారని, రాజశేఖర్‌కు ఉన్న నిబద్ధత తనతోసహా అందరినీ ఆశ్చర్య పరుస్తుందని మోదీ తెలిపారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాజశేఖర్ ఒక ఉద్యమంలాగా, కఠినమైన వ్రతంలా నిర్వహించారని కొనియాడారు. ఈ ఏడాది ప్రమాదానికి గురైన తర్వాత కూడా ఆయన తన దృఢ సంకల్పాన్ని వదలకపోవడం అత్యంత గొప్ప విషయని ప్రశంసించారు. రాజశేఖర్‌కు హదయపూర్వకంగా అభినందనలు తెలిపారు.
తెలంగాణ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు లక్ష్యానికి మించి మొక్కలు నాటి సరికొత్త రికార్డు సష్టించాయని మోదీ తెలిపారు. బుధవారం నాటికి దేశవ్యాప్తంగా 80 కోట్ల మొక్కలు నాటడం ద్వారా లక్ష్యాన్ని సాధించామని కేంద్ర పర్యావరణ శాఖ తెలిపిందని గుర్తు చేశారు. ప్రజలు మసాలా వార్తలు, నెగెటివ్ విషయాల పట్ల మాత్రమే ఎక్కువ ఆసక్తి చూపుతారన్న అభిప్రాయాన్ని మన్ కీ బాత్ తప్పని నిరూపించిందని మోదీ పేర్కొన్నారు. పాజిటివ్ వార్తలు, స్ఫూర్తిదాయక కథనాలనే ప్రజలు ఇష్టపడతారని అది నిరూపించిందన్నారు. మన్ కీ బాత్‌కు పదేళ్లు పూర్తయ్యాయని గుర్తు చేస్తూ.. తాజా ఎపిసోడ్‌తో తాను భావోద్వేగానికి గురవుతున్నానన్నారు. ఇటీవల తన అమెరికా పర్యటనలో ఆ దేశ ప్రభుత్వం భారత్‌కు చెందిన పలు ప్రాచీన కళాఖండాలను తనకు తిరిగి అప్పగించిందని, వీటిలో కొన్ని 4,000 ఏళ్ల కిందటివని మోదీ తెలిపారు.
గత ప్రభుత్వాలకు ఓ ప్రణాళిక లేదు
దేశంలో పట్టణాల అభివృద్ధిపై గత ప్రభుత్వాలకు ఒక ప్రణాళిక ఉండేది కాదని, అందుకే ఆ పాత పని సంస్కృతిని తాను విడిచిపెట్టానని మోదీ తెలిపారు. మహారాష్ట్రలో రూ.11,200 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వాల తాలూకు పని సంస్కృతి కొనసాగి ఉంటే పుణె మెట్రో ఫేజ్-1 వంటి ప్రాజెక్టులు అమలయ్యేవి కావన్నారు.
Updated Date - Sep 30 , 2024 | 03:37 AM