PM Modi : అంతిమ ఘడియల్లో కశ్మీర్ ఉగ్రవాదం
ABN, Publish Date - Sep 15 , 2024 | 02:50 AM
కలయా? నిజమా? అన్నంతగా జమ్మూకశ్మీర్‌లో పదేళ్లలో అద్భుత ప్రగతిని సాధించామని.. దీంతో ఈ ప్రాంతంలో ఉగ్రవాదం అంతిమ ఘడియల్లో ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
వారసత్వ రాజకీయాలు సుందర కశ్మీర్‌ను దెబ్బతీశాయి
ఈ ప్రాంతానికి రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తాం
మేమొచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు జరిపాం
అభివృద్ధికి పాటుపడిన యువతకు నా సెల్యూట్
కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు
జమ్మూ, సెప్టెంబరు 14: కలయా? నిజమా? అన్నంతగా జమ్మూకశ్మీర్‌లో పదేళ్లలో అద్భుత ప్రగతిని సాధించామని.. దీంతో ఈ ప్రాంతంలో ఉగ్రవాదం అంతిమ ఘడియల్లో ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. గతంలో సైన్యం, పోలీసులపైకి విసిరిన రాళ్లు ఇప్పుడు నయా కశ్మీర్ నిర్మాణంలో పునాదిరాళ్లుగా మారాయని పేర్కొన్నారు. దీని వెనుక ఉన్నది తాను కాదని, కశ్మీర్ ప్రజలేనని కొనియాడారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రె్‌స-ఎన్సీ-పీడీపీ, కశ్మీర్ యువతకు మధ్య పోరాటమని.. ఓవైపు కుటుంబ పార్టీలు, మరోవైపు కలలను నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉన్న తన చెల్లెళ్లు, కుమార్తెలు ఉన్నారని ప్రధాని అన్నారు. ఉగ్రవాదం, వారసత్వ రాజకీయాలు సుందర కశ్మీర్‌ను దారుణంగా దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం దోడా జిల్లాలో మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
గత 42 ఏళ్లలో ఇక్కడ పర్యటించిన తొలి ప్రధానిగా ఆయన ప్రత్యేకంగా నిలిచారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో కశ్మీరీ భాషలో ప్రసంగాన్ని ప్రారంభించారు. రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికలు భవిష్యత్‌ను నిర్దేశించేవని పేర్కొన్నారు. ఇకపై ఈ ప్రాంతంలో కర్ఫ్యూలు ఉండవన్నారు.
స్వాతంత్య్రం వస్తూనే కశ్మీర్‌పై విదేశీ శక్తులు కన్నేశాయని, తర్వాత కుటుంబ పార్టీలు ప్రజలను వంచించాయని విమర్శించారు. వెనుకబాటు పాపం ఆ మూడు పార్టీలదేనని, అవినీతి, భూకబ్జాలను ప్రోత్సహించి ప్రజల హక్కులను హరించాయని ధ్వజమెత్తారు. 2000 సంవత్సరం నుంచి నిలిచిపోయిన పంచాయతీ, బ్లాక్, జిల్లా డెవల్‌పమెంట్ కౌన్సిల్స్ ఎన్నికలు నిర్వహించి కొత్త తరాన్ని ప్రోత్సహించామని, తద్వారా 35 వేలమంది యువత పదవులు చేపట్టారని మోదీ చెప్పారు. కాంగ్రెస్ హయాంలో శ్రీనగర్ లాల్‌చౌక్ వద్దకు కేంద్ర హోమంత్రి కూడా వెళ్లలేకపోయారన్నారు.
విదేశీ గడ్డపై భారత్‌ను అవమానించారు..
కాంగ్రెస్ రాజ కుటుంబం దేశంలోనే అత్యంత అవినీతి రాజ కుటుంబం అని, అత్యంత అవినీతి పార్టీ కాంగ్రెస్ అని, అధికారం కోసం అవసరమైతే ఎన్నికలను తారుమారు చేస్తుందని ప్రధాని ధ్వజమెత్తారు. సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెడుతోందని తాను హెచ్చరిస్తే.. తప్పుబట్టారని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న హిమాచల్‌లో ఏం జరుగుతోందో గమనించాలని సూచించారు. రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉండగా, ఆయన పాల్గొన్న కార్యక్రమంలో భారత జర్నలిస్టుపై దాడి జరిగిందని ఆరోపించారు. మొహబ్బత్ కా దుకాణ్, వాక్ స్వాతంత్య్రం గురించి మాట్లాడేవారు.. విదేశీ గడ్డ మీద భారత్‌ను అవమానించారని మండిపడ్డారు. తాము గనుక 20 సీట్లు అదనంగా గెలిస్తే బీజేపీ వాళ్లను జైలుకు పంపేవారమన్న ఖర్గే వ్యాఖ్యలను మోదీ ప్రస్తావిస్తూ.. అధికారం కావలనుకుంటోంది ప్రజల అభివృద్ధికా? వారిని జైలుకు పంపేందుకా? అని నిలదీశారు. కాగా, కశ్మీర్‌లో కిష్త్‌వాడ్, దోడా, రాంబన్, దక్షిణ కశ్మీర్ జిల్లాల్లోని 24 నియోజకవర్గాల్లో ఈ నెల 18వ తేదీన తొలి విడత పోలింగ్ జరగనుంది.
Updated Date - Sep 15 , 2024 | 02:50 AM