Modi-Putin Meet: చిన్న పిల్లలు చనిపోతున్నారు.. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా: ప్రధాని మోదీ
ABN, Publish Date - Jul 09 , 2024 | 05:29 PM
తన రష్యా పర్యటనలో భాగంగా.. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తీవ్రవాదంపై నిప్పులు చెరిగారు.
తన రష్యా పర్యటనలో భాగంగా.. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) మంగళవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో (Vladimir Putin) సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తీవ్రవాదంపై నిప్పులు చెరిగారు. గత 40-50 సంవత్సరాల నుంచి భారతదేశం ఈ క్రూరత్వాన్ని ఎదుర్కొంటోందని అన్నారు. ఉగ్రవాదం అనేది ఎంతో భయంకరమైందని చెప్పారు. అందుకే.. మాస్కోలో (Moscow) గానీ, డాగేస్తాన్‌లో (Dagestan) గానీ ఉగ్ర సంఘటనలు జరిగినప్పుడు.. ఆ బాధ ఎంత తీవ్రమైందో తాను అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు.
యుద్ధమైనా, ఘర్షణలైనా, ఉగ్రదాడులైనా.. మానవత్వంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికి ప్రాణనష్టం జరిగినప్పుడు ఎంతో బాధ కలుగుతుందని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా.. అమాయక పిల్లలు చనిపోవడం చూస్తే గుండె తరుక్కుపోతుందని, ఆ బాధ మాటల్లో వర్ణించలేనిదని తెలిపారు. దీనిపై ఇదివరకే మీతో (పుతిన్‌ని ఉద్దేశిస్తూ) చర్చించానని ఆయన గుర్తు చేశారు. తాను అన్ని రకాల ఉగ్రవాదాన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నానని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. ఇదే సమయంలో ఉక్రెయిన్‌తో యుద్ధం అంశాన్ని తెరమీదకి తీసుకొచ్చారు. ఎలాంటి సమస్యలైనా పరస్పర దాడులతో, యుద్ధంతో పరిష్కరించలేమని.. చర్యలు, దౌత్యమే మార్గాలని సూచించారు.
ఉక్రెయిన్‌తో యుద్ధంపై మోదీ
‘‘ఉక్రెయిన్ యుద్ధంపై ఓపెన్ మైండ్‌తో చర్చించడం సంతోషంగా ఉంది. యుద్ధంపై ఒకరి ఆలోచనలు మరొకరు గౌరవంగా విన్నాం. శాంతి పునరుద్ధరణ కోసం అన్ని విధాల సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉంది. ఇందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రపంచానికి హామీ ఇస్తున్నాను’’ అని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో.. గత ఐదేళ్లలో ప్రపంచం ఆహారం, ఇంధనం, ఎరువల సంక్షోభాన్ని ఎదుర్కొంటే.. భారత్-రష్యా స్నేహం, ఇరుదేశాల మధ్య సహకారం వల్ల భారత్‌లోని రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని అన్నారు. భారత్-రష్యా మధ్య ఇంధన ఒప్పందం.. ప్రపంచ మార్కెట్ స్థిరత్వాన్ని అందించిందని తెలిపారు.
Read Latest National News and Telugu News
Updated Date - Jul 09 , 2024 | 05:46 PM