రాజకీయాల్లో పిల్లాడినే.. బరిలో భయపడేదే లేదు
ABN, Publish Date - Oct 28 , 2024 | 02:55 AM
‘రాజకీయాలు పాములాంటివి. నేను రాజకీయాల్లో చిన్న పిల్లాడినే కావచ్చు. నాకు అనుభవం కూడా లేకపోవచ్చు. అయి నా బరిలోకి దిగిన తర్వాత ఎవ్వరికీ భయపడేదే లేదు’
బీజేపీ సైద్ధాంతిక ప్రత్యర్థి.. డీఎంకే రాజకీయ ప్రత్యర్థి
ద్రవిడ, తమిళ జాతీయవాద సిద్ధాంతాలు పాటిస్తాం
పెరియార్, కామరాజ్‌ల వారసత్వాన్ని కొనసాగిస్తాం..
ప్రజలపై విశ్వాసంతో కెరీర్‌ను పీక్స్‌లో వదిలేసి వచ్చా
విల్లుపురం మహానాడులో టీవీకే అధినేత విజయ్
పార్టీ తొలి బహిరంగ సభకు భారీగా జనం హాజరు
చెన్నై, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): ‘రాజకీయాలు పాములాంటివి. నేను రాజకీయాల్లో చిన్న పిల్లాడినే కావచ్చు. నాకు అనుభవం కూడా లేకపోవచ్చు. అయి నా బరిలోకి దిగిన తర్వాత ఎవ్వరికీ భయపడేదే లేదు’ అని తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధినేత, సినీనటుడు విజయ్ వ్యాఖ్యానించారు. తమ పార్టీకి బీజేపీ సైద్ధాంతిక ప్రత్యర్థి అయితే డీఎంకే రాజకీయ ప్రత్యర్థిగా ఆయన అభివర్ణించారు. తమిళనాడులోని విల్లుపురం జిల్లా విక్రవాండి వద్ద ఆదివారం సాయంత్రం భారీఎత్తున నిర్వహించిన టీవీకే తొలి మహానాడులో లక్షలాది మంది కార్యకర్తల సమక్షంలో విజయ్ ప్రసంగించారు. ఇప్పటి వరకూ ఆడియో లాంచ్ ప్రోగ్రామ్‌లలో ప్రసంగించిన తాను తొలిసారిగా ఇంతమంది ప్రజల ముందు, వారి సంక్షేమమే ధ్యేయంగా ప్రసంగించడం ఎంతో గర్వంగా ఉందని చెప్పారు.
‘‘ఈవీఆర్ పెరియార్, కె.కామరాజ్, బీఆర్ అంబేడ్కర్, రాణి వేలు నాచియార్, అంజలి అమ్మాళ్ వారసత్వాన్ని కొనసాగిస్తాం. వారి ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తాం. లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాల ప్రాతిపదికగా పనిచేస్తాం. నీట్ నిర్వహణకు మా పార్టీ వ్యతిరేకం. జాతీయ స్థాయిలో మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష అవసరం లేదు. సమాజంలో విభేదాలు సృష్టించేవారు, అనినీతిపరులు మనకు మొదటి శత్రువులు. ద్రావిడ భావజాలాన్ని కాపాడుతున్నామని చెప్పుకొంటూ రాష్ట్రాన్ని కుటుంబ సంస్థలా వాడుకుంటున్న వారు తదుపరి శత్రువులు’ అని విజయ్ పేర్కొన్నారు.
ద్రవిడ, తమిళ జాతీయవాద సిద్ధాంతాలు పాటిస్తామని, పుట్టుకతో అందరూ సమానులే అన్నది తమ పార్టీ సిద్ధాంతమని అన్నారు. కెరీర్‌ను పీక్స్‌లో వదిలేసి, తమిళనాడు ప్రజలపై తిరుగులేని విశ్వాసం, నమ్మకంతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తమిళనాడు రాజకీయ ముఖచిత్రంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని, రాజీపడే ప్రసక్తే లేదని, సర్దుబాటు రాజకీయాలుండబోవని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి రాలేదని, సామాజిక నిబద్ధతతో వచ్చానని చెప్పారు.
ఈ ప్రభుత్వం ఉంటే ఏంటి.. ఊడితే ఏంటి?
తమిళనాట ద్రావిడ తరహా సుపరిపాలన అందిస్తున్నామంటూ ఓ కుటుంబ పరిపాలన కొనసాగుతోందని, దాన్ని అంతమొందించడమే తన కర్తవ్యమని విజయ్ ధ్వజమెత్తారు. పెరియార్, అన్నాదురై పేర్లు చెప్పుకుని రాష్ట్రంలో ఓ గుంపు కుటుంబ పాలన కొనసాగిస్తోందని పరోక్షంగా డీఎంకేపై విరుచుకుపడ్డారు. పేదలకు ఇల్లు, ఆహారం, ఉపాధి కల్పించడంలో విఫలమైన ఈ ప్రభుత్వం ఉంటే ఏంటి, ఊడితే ఏమిటంటూ అంటూ విరుచుకుపడ్డారు. తమ పార్టీకి ద్రవిడ ఉద్యమ నేత పెరియార్ ఆదర్శమని, అయితే దేవుడు లేడంటూ ఆయన బలపరచిన నాస్తికవాదాన్ని మాత్రం తమ పార్టీ అంగీకరించే ప్రసక్తేలేదని విజయ్ స్పష్టం చేశారు.
Updated Date - Oct 28 , 2024 | 02:55 AM