పుదుచ్చేరిలో తుఫాన్ బీభత్సం కుండపోత వర్షాలతో అతలాకుతలం
ABN, Publish Date - Dec 02 , 2024 | 03:35 AM
ఫెంగల్ తుఫాను ప్రభావంతో కురిసిన కుండపోత వర్షాలకు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అతలాకుతలమైంది.
24 గంటల్లో 51 సెం.మీ. వాన.. నీటమునిగిన గ్రామాలు
విద్యాసంస్థలకు నేడు సెలవు.. తేరుకుంటున్న చెన్నై
చెన్నై, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): ఫెంగల్ తుఫాను ప్రభావంతో కురిసిన కుండపోత వర్షాలకు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అతలాకుతలమైంది. శనివారం పుదుచ్చేరి వద్ద తుఫాను తీరం దాటడంతో పెనుగాలులతో భారీగా వర్షాలు కురిసి జలదిగ్బంధంలో చిక్కుకుంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం వేకువజాము 5.30 గంటల వరకు 51 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పుదుచ్చేరి నగరంతోపాటు చుట్టూ ఉన్న గ్రామాలు సైతం నీటమునిగాయి. దీంతో పాఠశాలలు, కళాశాలలకు సోమవారం సెలవు ప్రకటించినట్లు పుదుచ్చేరి విద్యాశాఖ మంత్రి నమశ్శివాయం తెలిపారు. పలు ప్రాంతాల్లో ఇళ్ల చుట్లూ రెండడుగుల ఎత్తున నీరు నిలిచి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉప్పారు వాగు సమీపంలోని గోవిందారోడ్డు, శాంతినగర్ తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బందులు పడ్డారు. వాహనాల రాకపోకలకూ అంతరాయం ఏర్పడింది. ముఖ్యమంత్రి రంగసామి అధికారులతో కలిసి పర్యటించి సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
తమిళనాడు రాజధాని చెన్నైలోనూ సుమారు 350 ప్రాంతాలు జలమయమై వాహనాల రాకపోకలు స్తంభించాయి. విల్లుపురం, కడలూరు జిల్లాలపై తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. ఆ రెండు జిల్లాల్లో జనావాస ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పంటపొలాలు నీట మునిగాయి. రాష్ట్రమంత్రులు ఆ జిల్లాల్లో అధికారులతో కలిసి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఫెంగల్ తుఫాను నత్తనడకన ఆదివారం మధ్యాహ్నానికి పూర్తిగా తీరాన్ని దాటిందని భారత వాతావరణ పరిశోధన సంస్థ దక్షిణ మండల అధికారి బాలచంద్రన్ తెలిపారు. శనివారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో తీరం దాటే ప్రక్రియ మొదలైందని పుదుచ్చేరి వద్దే ఆరుగంటలపాటు స్థిరంగా నిలిచి, తర్వాత గంటకు 7 కి.మీల వేగంతో విల్లుపురం, కడలూరు జిల్లాల వైపు కదిలిందని, దీంతో ఆ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయన్నారు.
Updated Date - Dec 02 , 2024 | 03:36 AM