Pune Car Crash: పూణె కారు ప్రమాదం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్.. ఆ మాస్టర్ ప్లాన్‌లో తల్లి కూడా!
ABN, Publish Date - May 30 , 2024 | 05:02 PM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణె కారు ప్రమాదం కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. ఇప్పుడు ఈ కేసులో అందరి ఫ్యూజులు ఎగిరిపోయే మరో కోణం వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందితుడైన...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణె కారు ప్రమాదం (Pune Car Crash) కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. ఇప్పుడు ఈ కేసులో అందరి ఫ్యూజులు ఎగిరిపోయే మరో కోణం వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందితుడైన మైనర్ రక్త నమూనాని మార్చే మాస్టర్ ప్లాన్‌లో.. తల్లి కూడా భాగమై ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు నుంచి నిందితుడ్ని తప్పించేందుకు.. తల్లి రక్త నమూనాని కూడా సేకరించి ఉండొచ్చని తెలుస్తోంది.
తల్లి రక్త నమూనా:
ఎప్పుడైతే ప్రభుత్వ ఆధ్వర్యంలోని సాసూన్ ఆసుపత్రిలో ఇద్దరు వైద్యులు నిందితుడి రక్త నమూనాని మార్చారని తేలిందో.. మహారాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు జరిపేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. ఈ కమిటీకి డా. పల్లవి సపాలేని హెడ్‌గా నియమించారు. ఈ క్రమంలోనే ఆ కమిటీ విచారించగా.. ఓ షాకింగ్ విషయం తెరమీదకి వచ్చింది. నిందితుడి రక్త నమూనాను మార్చేందుకు గాను ఒక మహిళతో పాటు మరో ఇద్దరు వ్యక్తుల రక్త నమూనాలను సేకరించినట్లు ప్యానెల్ గుర్తించింది. దీంతో.. ఆ మహిళ మరెవ్వరో కాదు, నిందితుడి తల్లే అయ్యుండొచ్చని, ఆమె రక్త నమూనాని సేకరించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే.. ఇది నిజమా? కాదా? అని తెలుసుకోవడం కోసం పోలీసులు కొందరు అనుమానితుల రక్త నమూనాల్ని సేకరించాలని యోచిస్తున్నట్టు తెలిసింది.
అదృశ్యమైన తల్లి:
ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే.. నిందితుడి తల్లి ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. రక్త నమూనాని సేకరించాలన్న ఉద్దేశంతో పోలీసులు ఇంటికి వెళ్లినప్పుడు, ఆమె అక్కడ కనిపించలేదు. ఎవరినీ అడిగిన సరైన సమాచారం ఇవ్వడం లేదు. దీంతో.. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతకుముందు నిందితుడి తల్లి ఓ వీడియో సందేశంలో కనిపించింది. అందులో.. వైరల్ అవుతున్న తన కొడుకు వీడియో ఫేక్ అని, తన కొడుకుని కాపాడాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది. మరోవైపు.. నిందితుడు అబ్జర్వేషన్ హోమ్‌లో ఉన్నాడు. అలాగే.. తన కుమారుడ్ని ఈ కేసు నుంచి బయటపడేసేందుకు నిందితుడి తండ్రి అక్రమ మార్గాల్లో ప్రయత్నాలు చేయడంతో, ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాదు.. నిందితుడి తాతను కూడా సైతం అరెస్ట్ చేశారు.
Read Latest National News and Telugu News
Updated Date - May 30 , 2024 | 05:02 PM