Lawrence Bishnoi: పోలీస్ స్టేషన్‌నే స్టూడియోగా వాడుకున్న లారెన్స్ బిష్ణోయ్
ABN, Publish Date - Oct 31 , 2024 | 05:20 AM
పోలీస్ స్టేషన్‌లో సీనియర్ అధికారి కార్యాలయాన్ని ఓ టీవీ ఇంటర్వ్యూ కోసం గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ స్టూడియోగా వాడుకోవడంపై పంజాబ్ హరియాణా హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది.
పోలీసులపై పంజాబ్ హరియాణా కోర్టు ఫైర్
చండీగఢ్, అక్టోబరు 30: పోలీస్ స్టేషన్‌లో సీనియర్ అధికారి కార్యాలయాన్ని ఓ టీవీ ఇంటర్వ్యూ కోసం గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ స్టూడియోగా వాడుకోవడంపై పంజాబ్ హరియాణా హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ విషయంలో పోలీసు అధికారులు, లారెన్స్ బిష్ణోయ్ మధ్య కుమ్మక్కు, కుట్రపై విచారణ జరిపేందుకు ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేయాలని జస్టిస్ అనుపిందర్ సింగ్ గ్రేవాల్, జస్టిస్ లాపితా బెనర్జీలతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది. జైల్లో ఖైదీలు సెల్‌ఫోన్లు వాడుతున్నారనే కేసులో కోర్టు విచారణ సందర్భంగా బిష్ణోయ్ ఇంటర్వ్యూ విషయాన్ని కోర్టు గుర్తించింది.
సెల్‌ఫోన్లు వినియోగించుకునే అవకాశం ఇవ్వడమే కాకుండా, పోలీసు అధికారి కార్యాలయాన్నే స్టూడియోగా వాడుకునేలా అనుమతించడం వల్ల నేరాలు మరింత పెరిగే అవకాశం ఉందని కోర్టు హెచ్చరించింది. కాగా, పంజాబ్‌లోని ఖరార్‌లో ఉన్న సీఐఏ ఆఫీస్ ప్రాంగణంలో సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యకేసు నిందితుడైన బిష్ణోయ్ ఓ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చినట్లు ప్రబోద్ కుమార్ నేతృత్వంలోని సిట్ తన రిపోర్టులో స్పష్టం చేసింది. అలాగే ఈ సంఘటనలో పోలీసు అధికారుల నిర్లక్ష్యాన్ని దుష్టప్రవర్తనను గుర్తించింది. ఇక్కడి వైఫైను కూడా వాడుకున్నట్లు పేర్కొంది.
Updated Date - Oct 31 , 2024 | 05:20 AM