Bharat Jodo Nyay Yatra: జార్ఖాండ్‌లో రాహుల్ యాత్ర రద్దు.. బీహార్ నుంచి 15న తిరిగి ప్రారంభం
ABN, Publish Date - Feb 14 , 2024 | 08:03 PM
రాహుల్ గాంధీ బుధవారంనాడు జార్ఖాండ్‌లో రెండో విడత చేపట్టాల్సిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' రద్దయింది. ఢిల్లీలో రైతులు జరుపుతున్న ఆందోళనలో పాలుపంచుకునేందుకు ఆయన వెళ్లడంతో ఈ కార్యక్రమం రద్దయినట్టు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. గురువారం బీహార్‌లోని ఔరంగాబాద్ నుంచి యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని ప్రకటించింది.
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ (Rahul Gandhi) బుధవారంనాడు జార్ఖాండ్‌లో రెండో విడత చేపట్టాల్సిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' (Bharat Jodo Nyay Yatra) రద్దయింది. ఢిల్లీలో రైతులు జరుపుతున్న ఆందోళనలో పాలుపంచుకునేందుకు ఆయన వెళ్లడంతో ఈ కార్యక్రమం రద్దయినట్టు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. గురువారం బీహార్‌లోని ఔరంగాబాద్ నుంచి యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని ప్రకటించింది.
రాహుల్ గాంధీ ఢిల్లీకి వెళ్లడంతో జార్ఖాండ్‌లోని గఢవా జిల్లాలో ఎంజీఎన్ఆర్ఈజీఏ వర్కర్లతో కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ముఖాముఖీ జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీహార్‌లోని ఔరంగాబాద్‌లో గురువారం తిరిగి భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం 2 గంటలకు జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ పాల్గొంటారని చెప్పారు. కాగా, జార్ఖాండ్‌లో తొలివిడత యాత్రలో రాహుల్ 650 కిలోమీటర్లు పర్యటించారని, అనుకోని కారణాల వల్ల మరో 150 కిలోమీటర్ల పాదయాత్ర కుదరలేదని జార్ఖాండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్ తెలిపారు. యాత్ర పూర్తయిన తర్వాత మరోసారి పాలము డివిజన్‌లో పర్యటించాల్సిందిగా రాహుల్‌ను కోరుతామని చెప్పారు. జార్ఖాండ్‌లో రాహుల్ యాత్ర విజయవంతమైందని, పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్తేజం వచ్చిందని చెప్పారు. జనవరి 14న మణిపూర్‌లో ప్రారంభమైన భారత్ జోడో న్యాయ్ యాత్ర షెడ్యూల్ ప్రకారం 68 రోజుల్లో 6,713 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల గుండా ప్రయాణిస్తూ మార్చి 20న ముంబైకి చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.
Updated Date - Feb 14 , 2024 | 08:03 PM