Rahul Gandhi: సివిల్స్ ఆశావహులు మృతి.. మూల్యం చెల్లించుకుంటున్న సామాన్యుడు
ABN, Publish Date - Jul 28 , 2024 | 02:05 PM
న్యూఢిల్లీలోని సివిల్స్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లోని వరద నీటిలో చిక్కుకుని ముగ్గురు సివిల్స్ ఆశావాహులు మృతి చెందారు. ఈ ఘటనపై ప్రతిపక్షనేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రభుత్వ సంస్థల్లో ప్రతి స్థాయిల్లో బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు.
న్యూఢిల్లీ, జులై 28: న్యూఢిల్లీలోని సివిల్స్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లోని వరద నీటిలో చిక్కుకుని ముగ్గురు సివిల్స్ ఆశావాహులు మృతి చెందారు. ఈ ఘటనపై ప్రతిపక్షనేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రభుత్వ సంస్థల్లో ప్రతి స్థాయిల్లో బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. దీంతో సామాన్య ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఢిల్లీలోని కోచింగ్ సెంటర్ బెస్‌మెంట్‌లో పోటీ పరీక్షల కోసం సిద్దమవుతున్న విద్యార్థులు ఇలా వరద నీటిలో చిక్కుకుని చనిపోవడం బాధాకరమన్నారు. సురక్షితమై, సౌకర్యవంతమైన జీవితాన్ని ప్రతి పౌరుడికి అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపై ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. కొద్ది రోజులు క్రితం న్యూఢిల్లీలో వర్షాల కారణంగా.. ఓ విద్యార్థి మరణించిన విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తు చేశారు.
శనివారం సాయంత్రం..
శనివారం సాయంత్రం న్యూడిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఆ క్రమంలో వివిధ ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. అలాంటి వేళ.. ఢిల్లీలోని పాత రాజేందర్ నగర్ ప్రాంతంలోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈ నీటిలో చిక్కుకుని ముగ్గురు సివిల్స్ ఆశావహులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు యువతలు కాగా ఒక యువకుడు ఉన్నారు.
స్పందించిన ఢిల్లీ పోలీసులు..
ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఈ సివిల్స్ కోచింగ్ సెంటర్ యజమానితోపాటు కో ఆర్డినేటర్‌ను ఆదివారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక ఈ ఘటనపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో వారు రహదారులపైకి వచ్చి.. ఆందోళన చేపట్టారు. అందులోభాగంగా న్యూఢిల్లీ నగర పాలక సంస్థకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు.
ఎక్కడికక్కడ నిలిచి పోయిన ట్రాఫిక్..
మరోవైపు ఈ భారీ వర్షాల కారణంగా దేశ రాజధాని న్యూఢిల్లీలో నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. అలాగే వివిధ ప్రాంతాల్లో భారీ వృక్షాలు సైతం నెలకొరిగాయి. దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి వేళ ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకోవాలని వాహనదారులకు ఢిల్లీ పోలీసులు సూచించారు. నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షాల కారణంగా ఢిల్లీలోని వివిధ ప్రాంతాల నుంచి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌కు 27 ఫిర్యాదులు అందాయి. అయితే ఆదివారం సైతం న్యూఢిల్లీలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Read More National News and Latest Telugu News
Updated Date - Jul 28 , 2024 | 02:07 PM