Flooding: సహారా ఎడారిలో వరదలు
ABN, Publish Date - Oct 10 , 2024 | 03:58 AM
ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి సహారాలో అత్యంత అరుదైన దృశ్యం కనిపించింది. ఉత్తర ఆఫ్రికాలోని మొరాకోలో ఆగస్టు, సెప్టెంబరులో కురిసిన భారీ వర్షాలకు సహారా ఎడారిలో వరద నీరు ప్రవహించింది.
మొరాకోలో భారీ వర్షం
ఎడారిలో ప్రవహించిన వరద
గత 50 ఏళ్లలో ఇదే తొలిసారి
కరువు ప్రాంత ప్రజలకు ఊరట
అరుదైన దృశ్యాలు
సోషల్ మీడియాలో వైరల్
మొరాకో, అక్టోబరు 9: ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి సహారాలో అత్యంత అరుదైన దృశ్యం కనిపించింది. ఉత్తర ఆఫ్రికాలోని మొరాకోలో ఆగస్టు, సెప్టెంబరులో కురిసిన భారీ వర్షాలకు సహారా ఎడారిలో వరద నీరు ప్రవహించింది. ఆగ్నేయ మొరాకోలోని ఎడారి ప్రాంతంలో వర్షం పడడమంటే చాలా అరుదైన ఘటన. మొరాకో ప్రభుత్వ సమాచారం మేరకు సెప్టెంబరులో రెండురోజుల పాటు కురిసిన వర్షం.. చాలా ప్రాంతాల్లో ఏడాది సగటును మించిపోయింది.
ఇక్కడ ఏటా 250 మి.మీ. కంటే తక్కువగా సగటు వర్షపాతం నమోదవుతుంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాజధాని రబత్‌కు 450 కి.మీ. దూరంలోని ఓ గ్రామంలో 24 గంటల్లోనే 100 మి.మీ. వర్షం కురిసిందని.. ఇది అత్యంత అరుదైన పరిణామమని పేర్కొన్నాయి. భారీ వర్షాలతో సహారాలో వరదలు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ దృశ్యాలను చాలా మంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా, ఇంతటి భారీ వర్షాలు కురవడం గడిచిన 30-50 ఏళ్లలో ఇదే తొలిసారని మొరాకో వాతావరణ శాఖ తెలిపింది.
Updated Date - Oct 10 , 2024 | 03:58 AM