Lok Sabha Elections : 2024 లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమా.. 2014, 2019 ఎన్నికల్లో ఏం జరిగింది?
ABN, Publish Date - Mar 16 , 2024 | 11:31 AM
2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సమయం ఆసన్నమైంది. ఈరోజు (మార్చి 16న) మరికొన్ని గంటల్లో ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో గతంలో 2014, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల తీరు గురించి ఇక్కడ తెలుసుకుందాం.
2024 లోక్‌సభ ఎన్నికల(Lok Sabha 2024 elections) షెడ్యూల్ విడుదలకు సమయం ఆసన్నమైంది. ఈరోజు (మార్చి 16న) మరికొన్ని గంటల్లో ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం(Election commission) ప్రకటించనుంది. ఈసారి లోక్‌సభ ఎన్నికలతో పాటు జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలను కూడా ఎన్నికల సంఘం ప్రకటించవచ్చని తెలుస్తోంది. మరోవైపు ప్రధాన రాజకీయ పార్టీలు కూడా తమ అభ్యర్థులను ప్రకటించడం ప్రారంభించాయి. అయితే ఈ సందర్భంగా గతంలో జరిగిన 2014, 2019 లోక్‌సభ ఎన్నికల తీరు గురించి ఇప్పుడు చుద్దాం.
2014 లోక్‌సభ ఎన్నికలు
2014లో 16వ లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha elections 2014) 9 దశల్లో జరిగాయి. ఏప్రిల్ 7 నుంచి మే 12 వరకు ఓటింగ్ జరిగింది. మార్చి 5న ఎన్నికలను ప్రకటించిన ఈసీ, మే 16న ఎన్నికల ఫలితాలను ప్రకటించింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగించింది. మొత్తం 31 శాతం ఓట్లతో బీజేపీ 282 సీట్లను సొంతంగా గెలుచుకుంది. దేశవ్యాప్తంగా 38.5 శాతం ఓట్లతో NDA మొత్తం 336 సీట్లు కైవసం చేసుకుంది. దీంతో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కేవలం 59 సీట్లకు పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీకి సొంతంగా కేవలం 44 సీట్లు మాత్రమే రాగా, కాంగ్రెస్‌కు 19.3 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో 16వ లోక్‌సభలో అధికారిక ప్రతిపక్షం లేకుండా పోయింది. ఎందుకంటే దేశంలో అధికారికంగా ప్రతిపక్షంగా ఉండే పార్టీకి తప్పకుండా 55 సీట్లు రావాలి, కానీ అది జరగలేదు.
2019 లోక్‌సభ ఎన్నికలు
2019లో జరిగిన 17వ లోక్‌సభ ఎన్నికల(Lok Sabha elections 2019) తేదీలను మార్చి 10న ప్రకటించారు. ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 11 నుంచి మే 19 మధ్య ఓటింగ్ జరుగగా, ఓట్ల లెక్కింపు మే 23న జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్‌లో 7 దశల్లో ఓటింగ్ జరిగింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 91.2 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఈ ఎన్నికల్లో 67.10 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. ఆ క్రమంలో బీజేపీ ఒంటరిగా 303 సీట్లు గెలుచుకుని కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ సారథ్యంలోని కూటమికి 353 సీట్లు వచ్చాయి. దీంతో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ కాంగ్రెస్‌కు 52 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేతగా ఉండేందుకు 10% సీట్ల దూరంలో ఉంది. మొత్తం మీద కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి 91 ఓట్లు వచ్చాయి. మిగిలిన పార్టీలకు 98 సీట్లు వచ్చాయి.
2014తో పోలిస్తే ఈ ఎన్నికల్లో బీజేపీ(bjp) మొత్తం ఓట్ల శాతం 6.5 శాతం పెరిగింది. 60.37 కోట్ల ఓట్లలో 22.6 కోట్లకు పైగా బీజేపీ ఖాతాలోకి వెళ్లాయి. కాంగ్రెస్(congress) ఓట్ల శాతం 19.3 శాతం నుంచి 19.6 శాతానికి పెరిగింది. 2014 ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో 8.4 కోట్ల మంది ఓటర్లు కూడా పెరిగారు. అయితే ఈసారి వచ్చే ఎంపీ ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మూడోసారి గెలవాలని చూస్తుండగా..కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఎన్నికల్లో కాషాయ పార్టీని గద్దె దించాలని భావిస్తోంది. మరి ప్రజలు ఎవరికీ మెజారిటీ ఓట్లు వేసి పట్టం కడతారో చూడాలి మరి.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Kavitha: కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చనున్న అధికారులు
Updated Date - Mar 16 , 2024 | 11:31 AM