ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Puri: తెరుచుకున్న రత్నభాండాగారం..

ABN, Publish Date - Jul 15 , 2024 | 03:47 AM

పూరీ క్షేత్రంలోని 12వ శతాబ్దానికి చెందిన జగన్నాథుడి ఖజానా రత్నభాండాగారం 46 ఏళ్ల తర్వాత తిరిగి తెరుచుకుంది. గది లోపల ఉన్న విలువైన వస్తువుల లెక్కింపుతో పాటు శిథిలావస్థకు చేరుకున్న నిర్మాణానికి మరమ్మతులు చేయడానికి ఖజానాను తెరిచినట్లు అధికారులు వెల్లడించారు.

  • 12వ శతాబ్దానికి చెందిన పూరీ జగన్నాథుడి

  • ఖజానాను 46 ఏళ్ల తర్వాత తెరిచిన ఒడిశా ప్రభుత్వం

  • బయటి గదిలోని సంపదను ఆరు చెక్క పెట్టెల్లోకి చేర్చి సీల్‌

  • బహుదా యాత్ర అనంతరం లోపలి గదిలోవి కూడా..

  • స్వర్ణకారులు, నిపుణుల నియామకం తర్వాతే ఆభరణాల లెక్కింపు

పూరీ, జూలై 14: పూరీ క్షేత్రంలోని 12వ శతాబ్దానికి చెందిన జగన్నాథుడి ఖజానా రత్నభాండాగారం 46 ఏళ్ల తర్వాత తిరిగి తెరుచుకుంది. గది లోపల ఉన్న విలువైన వస్తువుల లెక్కింపుతో పాటు శిథిలావస్థకు చేరుకున్న నిర్మాణానికి మరమ్మతులు చేయడానికి ఖజానాను తెరిచినట్లు అధికారులు వెల్లడించారు. చివరిసారిగా ఈ ఖజానాను 1978లో తెరిచి, అందులోని సంపదను లెక్కించారు. అప్పట్లో రూపొందించిన జాబితా ప్రకారం రత్నభాండాగారంలోని రెండు గదుల్లో 128.380 కిలోల బంగారు ఆభరణాలు, 221.530 కిలోల వెండి వస్తువులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సభ్యులు ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజల అనంతరం ఆదివారం మధ్యాహ్నం 1.28 గంటల సమయంలో రహస్య గదిని తెరిచారు. జగన్నాథుడి ఖజానా తలుపులు తెరిచినట్లు ఒడిశా సీఎం కార్యాలయం ‘ఎక్స్‌’లో పోస్టు చేసింది. నలుగురు ఆలయ సేవకులతో పాటు కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ బిశ్వనాథ్‌ రథ్‌, శ్రీ జగన్నాథ టెంపుల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎస్‌జేటీఏ) చీఫ్‌ అడ్మినిస్ట్రేటర్‌ అరబింద పాధీ, అర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎ్‌సఐ) సూపరింటెండెంట్‌ డీబీ గడనాయక్‌, పూరీ రాజు గజపతి మహారాజు ప్రతినిధి సహా మొత్తం 11మంది సభ్యులు గదిలోకి ప్రవేశించారని అధికారులు పేర్కొన్నారు.


రత్నభాండాగారం తలుపులు తెరవనున్న నేపథ్యంలో కమిటీ సభ్యులు ఉదయం గుండిచ మందిరంలో జగన్నాథ స్వామికి, ఆయన తోబుట్టువులకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనుమతి తీసుకున్నారు. పూరీలో రథయాత్ర సాగుతున్నందున జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి విగ్రహాలు ప్రస్తుతం గుండిచ ఆలయంలో ఉన్నాయి. వచ్చేవారం జరిగే బహుదా యాత్ర సందర్భంగా దేవతామూర్తులను తిరిగి శ్రీక్షేత్రానికి తీసుకొస్తారు. రహస్య గదిలో విషసర్పాలు నిధిని కాపలా కాస్తుంటాయన్న అనుమానాలతో ముందు జాగ్రత్తగా పాములు పట్టడంలో నిపుణులతో పాటు సత్వర చికిత్స కోసం వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఆలయం లోపల, బయట రెండు స్నేక్‌ క్యాచర్ల బృందాలను సిద్ధంగా ఉంచామని స్నేక్‌ హెల్ప్‌లైన్‌ సభ్యుడు సుభేందు మల్లిక్‌ తెలిపారు. అంతకుముందు ఎస్‌జేటీఏ చీఫ్‌ అరబింద పాధీ మీడియాతో మాట్లాడుతూ ఒడిశా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఖజానాను తెరిచినప్పటికీ విలువైన వస్తువుల లెక్కింపు ప్రక్రియను ఇప్పటికిప్పుడే చేపట్టబోమని చెప్పారు.


స్వర్ణకారులు, ఇతర నిపుణుల నియామకం తర్వాతే ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. తొలుత రత్నభాండాగారం బయట, లోపలి గదుల్లో ఉన్న ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను చెక్క పెట్టెల్లో భద్రపరిచి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్‌ రూంకు తరలిస్తామని తెలిపారు. ఖజానా నిర్మాణం భద్రతను నిర్ధారించడం తమ తొలి ప్రాధాన్యంగా చెప్పారు. సంపద ఉన్న పెట్టెలు జీర్ణావస్థకు చేరి ఉంటే ఆభరణాలను తరలించడానికి వీలుగా ఇత్తడి పూత పూసిన ఆరు చెక్క బాక్సులను సిద్ధంగా ఉంచారు. ఖజానా బయట గదిలో ఉన్న ఆభరణాలను ఈ కలప పెట్టెల్లోకి మార్చి సీలు వేసినట్లు తెలిపారు. బహుదా యాత్ర అనంతరం లోపలి గదిలోని బంగారం, వెండి సామగ్రిని కూడా తరలిస్తామని పాధీ పేర్కొన్నారు. ఆర్‌బీఐ ప్రతినిధి సమక్షంలో ఆభరణాల లెక్కింపు ప్రక్రియ చేపడతామని ఆ తర్వాత వాటి ఫొటోలు, బరువు, నాణ్యత తదితర వివరాలతో డిజిటల్‌ కేటలాగ్‌ రూపొందిస్తామని ఒడిశా న్యాయశాఖ మంత్రి పృధ్వీరాజ్‌ హరిచందన్‌ తెలిపారు.


రత్నభాండాగారం వద్ద స్పృహ తప్పిన పూరీ ఎస్పీ?

పూరీ పోలీసు సూపరింటెండెంట్‌ పినాక్‌ మిశ్రా శ్రీమందిరంలోని రత్నభాండాగారం తలుపు వద్ద స్పృహ తప్పి పడిపోయారని, ఖజానాలోకి ప్రవేశించిన సభ్యుల్లో ఒకరైన డాక్టర్‌ సీబీకే మొహంతి ఎస్పీకి చికిత్స అందించారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఆలయ భద్రతను పర్యవేక్షిస్తున్న ఎస్పీ మిశ్రా ఖండించారు. ఆలయ సింహద్వారం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు ఎలాంటి అనారోగ్యం లేదని, తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేశారు.

Updated Date - Jul 15 , 2024 | 03:47 AM

Advertising
Advertising
<