Loksabha Elections: ఎన్నికల బరిలో రాబర్ట్ వాద్రా
ABN, Publish Date - Apr 04 , 2024 | 07:11 PM
రాజకీయాల్లోకి వస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా వెల్లడించారు. తాను రాజకీయాల్లోకి రావాలని అమేథి నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నారని తెలిపారు. అమేథి ప్రస్తుత ఎంపీ స్మృతీ ఇరానీ వల్ల నియోజకవర్గ ప్రజలు బాగా నిరాశకు గురయ్యారని చెప్పారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 04: రాజకీయాల్లోకి వస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా వెల్లడించారు. తాను రాజకీయాల్లోకి రావాలని అమేథి నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నారని తెలిపారు. అమేథి ప్రస్తుత ఎంపీ స్మృతీ ఇరానీ వల్ల నియోజకవర్గ ప్రజలు బాగా నిరాశకు గురయ్యారని చెప్పారు. అందుకే గాంధీ కుటుంబ సభ్యుడిని నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. స్మృతీ ఇరానీని ఎంపీగా గెలిపించి తప్పు చేశామనే భావన ఇప్పటికే ఈ నియోజకవర్గలో ఉందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, అమేథి నియోజకవర్గ ఎంపీగా స్మృతీ ఇరానీ.. ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటు పడలేదని.. కేవలం గాంధీ కుటుంబంపై ఆరోపణలు చేయడానికి, వారిని కించ పరచడం కోసమే ఆమె పని చేశారని రాబర్ట్ వాద్రా వివరించారు.
అలాగే స్మృతీ ఇరానీని గెలిపించి తప్పు చేశామని నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారని.. అందుకే గాంధీ కుటుంబ సభ్యుడు రావాలని వారు ఆకాంక్షిస్తున్నారన్నారు. రాయబరేలి లేదా అమేథి నుంచి ఎన్నికల బరిలో దిగి.. ఆయా నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు. అలాగే వారి భద్రత కోసం పాటు పడతానని చెప్పారు. ఇప్పటికే అమేథి, రాయబరేలి, సుల్తాన్‌పూర్, జగదీష్‌పూర్ ప్రజల కోసం గాంధీ కుటుంబం చాలా పాటుపడిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
మరోవైపు రాయబరేలి లేదా అమేథి నుంచి ప్రియాంకా గాంధీ బరిలో దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకోసం ఆమె అభ్యర్థిత్వంపై పరిశీలన జరుగుతోన్నట్లు సమాచారం. ఇక అమేథి నుంచి మళ్లీ రాహుల్ గాంధీ పోటీ చేయాలని నియోజకవర్గ పార్టీ శ్రేణులు చాలా బలంగా కోరుకుంటున్నారు. అయితే గత ఎన్నికల్లో అమేథి నుంచి బీజేపీ అభ్యర్థిగా స్మృతీ ఇరానీ బరిలో దిగారు. ఆమె చేతిలో రాహుల్ గాంధీ ఓటమి పాలయ్యారు. మరోవైపు కేరళలోని వాయునాడు నుంచి కూడా రాహుల్ గాంధీ బరిలో దిగారు. దీంతో ఆయన వాయునాడు ఎంపీగా కొనసాగారు.
ఇక ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్ర రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. గతంలో అంటే 2022, జులైలో నాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, అత్త సోనియా గాంధీని నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో ఈడీ ప్రశ్నించింది. ఆ సమయంలో సైతం తాను రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తానని రాబర్ట్ వాద్రా ప్రకటించిన సంగతి తెలిసిందే.
మరిన్నీ జాతీయ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
PM Modi: బెంగాల్‌లో అఘాయిత్యాలను బీజేపీ మాత్రమే ఆపగలదు: ప్రధాని మోదీ
Sandeshkhali: సందేశ్‌ఖాళి ఘటన నిజమైతే సిగ్గు చేటు: కోల్ కతా హైకోర్టు
Updated Date - Apr 04 , 2024 | 07:16 PM