Priest Acharya Satyendra : అయోధ్య రామాలయం పైకప్పు లీక్
ABN, Publish Date - Jun 25 , 2024 | 05:41 AM
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన అయోధ్య రామాలయం గర్భగుడి పైకప్పు.. ఆర్నెల్లయినా కాకముందే.. కురిసిన తొలి భారీ వర్షానికే లీక్ అవుతోంది! శనివారం అర్ధరాత్రి అయోధ్యలో కురిసిన కుండపోత కారణంగా నీరు కారుతోందని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ సోమవారం తెలిపారు.
సీజన్‌లో తొలి భారీవర్షానికే గర్భగుడిలోకి నీరు
రామ్ లల్లా ఎదుట.. పూజారి కూర్చునే చోట లీక్
ఆలయ ప్రాంగణంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు
అందుకే నీరు నిలుస్తోంది..: ప్రధాన పూజారి
గుడికి వెళ్లే పదమూడు రోడ్లూ జలదిగ్బంధంలోనే
ఆ రహదారుల్లోని ఇళ్లలోకి చేరిన మురుగునీరు
అయోధ్యను ‘అవినీతిహబ్’గా మార్చిన బీజేపీ
అధికార పార్టీపై మండిపడ్డ యూపీ కాంగ్రెస్
అయోధ్య, జూన్ 24: అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన అయోధ్య రామాలయం గర్భగుడి పైకప్పు.. ఆర్నెల్లయినా కాకముందే.. కురిసిన తొలి భారీ వర్షానికే లీక్ అవుతోంది! శనివారం అర్ధరాత్రి అయోధ్యలో కురిసిన కుండపోత కారణంగా నీరు కారుతోందని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ సోమవారం తెలిపారు. రామ్‌లల్లా ముందు పూజారి కూర్చునే స్థలంలో, వీఐపీలు దర్శనం చేసుకునే స్థలంలో నీరు లీక్ అవుతున్నట్టు ఆయన వివరించారు. వానలు ఇలాగే భారీగా కురుస్తుంటే లోపల కూర్చుని పూజ చేయడం కూడా కష్టమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. దేశం నలుమూలల నుంచీ ఇంజనీర్లు వచ్చి రామాలయాన్ని నిర్మిస్తున్నారు.
జనవరి 22న ఆలయాన్ని ప్రారంభించేశారు. కానీ.. భారీ వర్షం కురిస్తే పైకప్పు కారుతుందని ఎవరికీ తెలియదు. ప్రపంచప్రఖ్యాతి గాంచిన ఒక ఆలయం పైకప్పు లీక్ అవడం చాలా ఆశ్చర్యకరం. ఇలా ఎందుకు జరుగుతోంది?’’ అని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. అంతమంది పెద్ద ఇంజనీర్ల సమక్షంలో ఇలా జరగడమేంటని నిలదీశారు. ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. గుడి ప్రాంగణంలోకి చేరిన నీరు బయటకు వెళ్లే మార్గం కూడా లేకుండా నిర్మించారని సత్యేంద్రదాస్ ఆరోపించారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆలయ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
ఈ విషయం తెలియగానే.. అయోధ్య రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా అక్కడికి చేరుకున్నారు. కారుతున్న పైకప్పును పరిశీలించి.. వెంటనే మరమ్మతులు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘మొదటి అంతస్తు నుంచి నీరు కారుతోంది. పైనున్న గురుమండపానికి ఎలాంటి ఆచ్ఛాదనా లేకపోవడమే దీనికి కారణం. రెండో అంతస్తు, శిఖర నిర్మాణం పూర్తయితే గురు మండపంలోకి వర్షపు నీరు రాదు’’ అని ఆయన వివరించారు.
ఆలయ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని, మొదటి అంతస్తు నిర్మాణం కొనసాగుతోందని.. జూలై నాటికి మొదటి అంతస్తు, డిసెంబరు నాటికి మొత్తం నిర్మాణం పూర్తవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా.. ఆలయంలోనే కాదు, శనివారం రాత్రి కురిసిన భారీ వానతో.. రామాలయానికి వెళ్లే 13 రహదారుల్లో నీరు నిలిచిపోయింది. దీంతో ఆ ప్రాంతంలోని ఇళ్లల్లోకి మురుగునీరు ప్రవేశించింది.
మోదీ సర్కారు ఎంతో గొప్పగా చెప్పుకొంటున్న అయోధ్య రామాలయం ఒక్క వర్షానికే లీక్ కావడంపై కాంగ్రెస్ స్పందించింది. అధికారంలో ఉన్న బీజేపీ.. ఆలయ నిర్మాణంలో అవినీతికి పాల్పడడమే ఇందుకు కారణమని ఆరోపించింది. ఎన్నికల్లో ప్రయోజనం కోసం నాసిరకంగా కట్టిన కట్టడాలతో అయోధ్యను బీజేపీ ‘అవినీతి హబ్’గా మార్చిందని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్‌రాయ్ మండిపడ్డారు.
Updated Date - Jun 25 , 2024 | 05:42 AM