ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వాడివేడిగా మహా సమరం!

ABN, Publish Date - Nov 11 , 2024 | 03:45 AM

మహారాష్ట్రలో మరో పది రోజుల్లో ఎన్నికలు జరగనుండగా అధికార మహాయుతి కూటమి, ప్రతిపక్ష మహారాష్ట్ర వికాస్‌ అఘాఢీ (ఎంవీఏ) కూటమి సమస్త బలగాలను మోహరించి గెలుపుకోసం శ్రమిస్తున్నాయి.

  • సమస్త బలగాలను మోహరించిన మహాయుతి, ఎంవీఏ కూటములు

  • వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌ ప్రచారం

  • పలు రాష్ట్రాల నేతలు రంగంలోకి

  • బీజేపీ వెనుకబాటుతో మోదీ సుడిగాలి ప్రచారం.. ఆయన వెంట షా, ఆదిత్యనాథ్‌

న్యూఢిల్లీ, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రలో మరో పది రోజుల్లో ఎన్నికలు జరగనుండగా అధికార మహాయుతి కూటమి, ప్రతిపక్ష మహారాష్ట్ర వికాస్‌ అఘాఢీ (ఎంవీఏ) కూటమి సమస్త బలగాలను మోహరించి గెలుపుకోసం శ్రమిస్తున్నాయి. ఎంవీఏలో శివసేన(ఠాక్రే), ఎన్సీపీ (పవార్‌), కాంగ్రెస్‌ పార్టీలున్నాయి. ఆ కూటమి తరఫున శరద్‌ పవార్‌, శివసేన అధినేత ఉద్దవ్‌ ఠాక్రేతోపాటు కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇటీవలి హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం త్రుటిలో తప్పిపోవటంతో మహారాష్ట్రను ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోవద్దని కాంగ్రెస్‌ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. దీంట్లో భాగంగానే తమ పార్టీ పాలిత రాష్ట్రాలైన తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటకల నుంచి సీఎంలు, డిప్యూటీ సీఎంను రప్పించి.. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ గ్యారెంటీల అమలు గురించి ప్రజలకు చెప్పిస్తోంది. కాంగ్రెస్‌ రాష్ట్రాల్లో హామీలను అమలు చేయటంలేదన్న ప్రధాని మోదీ తదితర బీజేపీనేతల ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కాంగ్రెస్‌ ఈ వ్యూహరచన చేసింది.

కాగా, ప్రచారపర్వంలో ఎంవీఏకు దీటుగా మహాయుతి నేతలు నితిన్‌ గడ్కరీ, దేవేంద్ర ఫడణవీస్‌, ఏక్‌నాథ్‌ షిండే ప్రచారం చేయలేకపోతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహాయుతిలో బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్‌పవార్‌) పార్టీలున్నాయి. రాష్ట్రంలో బీజేపీకి పెద్ద దిక్కైన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ విదర్భ ప్రాంతంలో తన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుండగా, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌.. తన నియోజకవర్గం నాగ్‌పూర్‌ సౌత్‌ వెస్ట్‌లో విజయం కోసం చెమటోడుస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ తరఫున ప్రచారం చేసే గట్టి స్థానిక నేతలెవరూ లేని పరిస్థితి నెలకొనడంతో ప్రధాని మోదీ శుక్రవారం నుంచి స్వయంగా రంగంలోకి దిగారు. ఆయనతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రచారం నిర్వహిస్తున్నారు.


ఉత్తర మహారాష్ట్రలోని ధులే సభతో ప్రచారానికి శ్రీకారంచుట్టిన మోదీ.. సుడిగాలిలా పలు బహిరంగ సభలు, రోడ్‌ షోలలో పాల్గొనడంతో మహాయుతికి ఊపు వచ్చింది. ఇప్పటి వరకూ నాగ్‌పూర్‌, నాసిక్‌, నాందేడ్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించిన మోదీ.. ఆర్టికల్‌ 370 రద్దును కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తోందని, సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్న ఆ పార్టీ గతంలో అంబేడ్కర్‌ను అవమానించిందన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సైతం కాంగ్రెస్‌ అవమానించిందన్నారు. మరఠ్వాడాలో రైతుల సమస్యలకు గత కాంగ్రెస్‌ ప్రభుత్వాల విధానాలే కారణమన్నారు. మరోవైపు ‘విడిపోతే హతమవుతాం’ అంటూ హిందువులను ఉద్దేశించి యోగి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. లోక్‌సభ ఎన్నికల్లో మహాయుతి ఆశించిన ఫలితాలు సాధించకపోవటానికి కారణం వోట్‌ జిహాద్‌ అంటూ ఫడణవీస్‌ చేసిన వ్యాఖ్యలపైన ఎన్నికల సంఘం సీరియస్‌ అయ్యింది. మరోసారి ఆ విధంగా మాట్లాడితే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించింది.

లోక్‌సభ ఎన్నికల్లో ముస్లింలు ఎంవీఏ కూటమికి ఓట్లు వేశారన్న సంగతిని చెప్పటానికి ఫడణవీస్‌ వోట్‌ జిహాద్‌ అనే పదం వాడారు. ముస్లింలకు 10% రిజర్వేషన్‌ కల్పిస్తే ఎంవీఏకు మద్దతిస్తామంటూ ఉలేమా కౌన్సిల్‌ చేసిన ప్రతిపాదననూ బీజేపీ వివాదాస్పద అంశంగా మారుస్తోంది. దీనిపై కాంగ్రెస్‌ రాష్ట్రఅధ్యక్షుడు నానా పటోలే స్పందిస్తూ.. ఇది పచ్చి అబద్ధమని, తాము ఆ డిమాండ్‌కు అంగీకరించలేదన్నారు. ఇక కాంగ్రెస్‌ గ్యారెంటీల పేరుతో ప్రజలకు ఇస్తున్న హామీలను ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయ డంలేదని మోదీ చెప్పగానే.. తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం లు రేవంత్‌రెడ్డి, సుఖ్వీందర్‌సింగ్‌ సుక్కు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లను మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలోకి కాంగ్రెస్‌ తెచ్చింది. హామీలన్నీ నెరవేరుస్తున్నామని, కావాలంటే తమ రాష్ట్రాలకు వచ్చి చూడాలని వీరుముంబైలో విలేకర్ల సమావేశంలో మోదీకి సవాల్‌ విసిరారు.


  • దళితులు, ముస్లింలు కీలకం

లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 స్థానాల్లో ఎంవీఏ కూటమి 31స్థానాల్లో విజయం సాధించింది. ఈ గెలుపునకు ప్రధానంగా సహకరించింది ముస్లిం, దళిత ఓటుబ్యాంకు మద్దతేనన్న విశ్లేషణలువచ్చాయి. గిరిజనులు, మహిళలు, రైతులు, గ్రామీణ యువత, కొన్ని ప్రాంతాల్లో మరాఠాలూ భారీ ఎత్తున ఎంవీఏకు మద్దతిచ్చినట్లు వెల్లడైంది. ఈ కూటమి ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ ఓటుబ్యాంకుపై ఆశలు పెట్టుకుంది. మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం నడుపుతున్న మనోజ్‌ జారాంగే పాటిల్‌..మహాయుతిని ఓడించటమే లక్ష్యంగా తాము పని చేస్తామని తొలుత ప్రకటించినా తర్వాత ఆ వైఖరిని సడలించుకున్నారు. ఎవరికీ మద్దతివ్వటంలేదని, ఎన్నికల బరిలో ఉన్న తమ అభ్యర్థులను ఉపసంహరించుకున్నారు. దీనివల్ల ఎంవీఏకు మేలు జరిగే అవకాశం ఉంది. 30 నియోజకవర్గాల్లో ముస్లింల జనాభా 10-40ు వరకు ఉంది. పలు ముస్లిం సంస్థలు ఎంవీఏను బలపరుస్తున్నాయి. పలువురు ముస్లిం సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛందసంస్థలు ‘మహారాష్ట్ర డెమోక్రటిక్‌ ఫ్రంట్‌’గా ఏర్పాటై ఎంవీఏ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నాయి.

  • రేవంత్‌కు జాతీయస్థాయిలో మంచి భవిష్యత్తు ఉంది!

మహారాష్ట్రలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి జరిపిన ప్రచారంపై కాంగ్రెస్‌ నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. ‘రేవంత్‌ చక్కటి హిందీలో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడైనా పార్టీకి ప్రచారం చేయగలరు. జాతీయ స్థాయిలో టీవీ చర్చల్లో పాల్గొనగలనని ఆయన ఇప్పటికే నిరూపించుకున్నారు. ప్రత్యర్థుల బూటకపు ప్రచారాన్ని తిప్పిగొట్టడంలో రేవంత్‌కు సాటి లేదు. అందుకే ఆయనను మహారాష్ట్ర స్టార్‌ క్యాంపెనయిర్ల జాబితాలో చేర్చాం. జాతీయ స్థాయిలో మంచి భవిష్యత్తున్న నేత రేవంత్‌’ అని ఏఐసీసీ నాయకుడు ఒకరు పేర్కొన్నారు.

Updated Date - Nov 11 , 2024 | 04:03 AM