S Jaishankar: ఉగ్రవాది ఏ భాషలోనైనా ఉగ్రవాదే.. ఉగ్రవాద రక్షణపై నిప్పులు చెరిగిన జైశంకర్
ABN, Publish Date - Mar 24 , 2024 | 09:08 PM
విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆదివారం ఉగ్రవాదంపై ఓ సంచలన ప్రకటన చేశారు. ఏ భాషలో అయినా.. ఉగ్రవాది ఉగ్రవాదేనని అన్నారు. విభిన్న వివరణల ఆధారంగా ఉగ్రవాదాన్ని క్షమించడం లేదా సమర్థించడం చేయకూడదని సూచించారు. సింగపూర్‌లోని భారతీయ కమ్యూనిటీ సభ్యులతో ఇంటరాక్షన్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆదివారం ఉగ్రవాదంపై ఓ సంచలన ప్రకటన చేశారు. ఏ భాషలో అయినా.. ఉగ్రవాది ఉగ్రవాదేనని అన్నారు. విభిన్న వివరణల ఆధారంగా ఉగ్రవాదాన్ని క్షమించడం లేదా సమర్థించడం చేయకూడదని సూచించారు. సింగపూర్‌లోని భారతీయ కమ్యూనిటీ సభ్యులతో ఇంటరాక్షన్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతీయ అధికారులు తమ ప్రపంచ ప్రత్యర్ధులతో సున్నితమైన, భాషాపరంగా విభిన్న అంశాలపై ఎలా సంప్రదిస్తారనే ప్రశ్న ఎదురవ్వగా.. దౌత్యంలో వివిధ దేశాలు తమ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు కొన్నిసార్లు తమ భాష లేదా భావనలను చర్చలోకి తీసుకొస్తాయని చెప్పారు.
విభిన్న దృక్కోణాలు ఉండటం సహజమేనని.. దౌత్యం అంటే దాన్ని పరిష్కరించడానికి, ఒక రకమైన ఏకాభిప్రాయాన్ని చేరుకోవడానికి ఓ మార్గాన్ని కనుగొనడమని జైశంకర్ వివరణ ఇచ్చారు. అయితే.. అప్పుడప్పుడు స్పష్టత, గందరగోళం లేనప్పుడు కూడా కొన్ని సమస్యలు ఉంటాయని తెలిపారు. ఇందుకు ఉగ్రవాదాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. ఏ భాషలోనైనా ఉగ్రవాది ఉగ్రవాదేనని.. విభిన్న భాషల్లో వివరణ ఇస్తున్నంత మాత్రాన దాన్ని సమర్థించకూడదని అన్నారు. రెండు దేశాలు వాస్తవానికి భిన్నంగా దృక్కోణాలు కలిగి ఉన్నప్పుడు.. ఇటువంటి సమస్యలు ఉండొచ్చని చెప్పారు. అలాంటప్పుడు వ్యత్యాసాన్ని గుర్తించి.. దానిని ఎలా ఎదుర్కోవాలనే మార్గాన్ని గుర్తించగలగాలని సలహా ఇచ్చారు.
ఇదే సమయంలో.. సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్‌ని స్థాపించి, ‘ఢిల్లీ చలో’కు పిలుపునిచ్చిన స్వాతంత్య్ర పోరాట కాలం నాటి భారత్, సింగపూర్ సంబంధాలను కూడా జైశంకర్ ప్రస్తావించారు. నేతాజీ మన భారత్ మొత్తానికి కనిపించే స్ఫూర్తిగా మిగిలిపోయారన్నారు. భారత్ ప్రపంచీకరణ చెందడంతో.. లుక్ ఈస్ట్ విధానంతో ప్రారంభమైన రెండు దేశాల మధ్య సంబంధాలు యాక్ట్ ఈస్ట్ విధానంతో ముందుకు సాగింది.. ఇప్పుడు భారత్ ఇండో-పసిఫిక్‌లో పాలుపంచుకుందని అన్నారు. భారతదేశం ఎంత గ్లోబలైజ్ అవుతోందో.. అందులోని ప్రతి అంశంలో సింగపూర్‌తో సంబంధాల తీవ్రత, నాణ్యతలో ప్రతిబింబిస్తుందని నొక్కి చెప్పారు.
భారతదేశం ప్రపంచ మిత్రుడంటూ హైలెట్ చేసిన జైశంకర్.. భారత్ ఎప్పుడూ ఒత్తిడికి గురవ్వదని, తన మనసులోని మాటని ఉన్నది ఉన్నట్టుగా వ్యక్తపరుస్తుందని తెలిపారు. ఒకవేళ ఏదైనా ఓ విషయాన్ని ఎంపిక చేసుకోవాల్సి వస్తే.. భారత పౌరుల సంక్షేమాన్ని ఎంచుకుంటామని చెప్పారు. కాబట్టి.. మరింత సామర్థ్యం, బలమైన దేశంగా తీర్చిదిద్దాలన్నది తమ ఆలోచన అని.. కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఎక్కువ మంది భారతీయులు వివిధ దేశాల్లో స్థిరపడ్డారు కాబట్టి.. వారికి భద్రత కల్పించడం, క్లిష్ట పరిస్థితుల్లో వారిని ఇంటికి తీసుకురావడం తమ బాధ్యత అని చెప్పారు.
సమర్థవంతమైన, దౌత్యపరమైన, సంస్కరించబడిన, రక్షిత, ఇలా అనేక విధాలుగా తమది వినూత్న భారతదేశమని నొక్కి చెప్పిన జైశంకర్.. చంద్రయాన్ ల్యాండింగ్ ద్వారా పొందిన ప్రపంచ గౌరవాన్ని ఎత్తిచూపారు. కోవిడ్ -19 సమయంలో సుమారు 100 దేశాలకు వ్యాక్సిన్‌లను సరఫరా చేశామని చెప్తూ.. ప్రపంచానికి భారత్ ఒక మంచి స్నేహితుడి లాంటి దేశమని అభివర్ణించారు. కష్ట సమయాల్లో ఆదుకోవడానికి తాము ముందుకొస్తామని చెప్తూ.. శ్రీలంక ఆర్థిక సంక్షోభం సమయంలో ఆ దేశానికి భారత్ 4.5 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ఇచ్చిందని గుర్తు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 24 , 2024 | 09:08 PM