Sanjay Roy : నన్ను ఇరికించారు
ABN, Publish Date - Aug 25 , 2024 | 03:26 AM
జూనియర్ వైద్యురాలిపై ఘోర అత్యాచారం ఘటనకు సంబంధించి నేరం చేసింది తానేనని ఒప్పుకొని.. ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా ‘కావాలంటే నన్ను ఉరి తీసుకోండి’ (అమీ ఫాసీ దీయే దీ) అని పోలీసుల విచారణలో చెప్పిన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ఇప్పుడు మాటమార్చేశాడు.
జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం కేసులో నాలుక మడతేసిన ప్రధాన నిందితుడు సంజయ్
కలకత్తా హైకోర్టులో మెజిస్ట్రేట్ ఎదుట కన్నీరు
న్యూఢిల్లీ/పుణె ఆగస్టు 24: జూనియర్ వైద్యురాలిపై ఘోర అత్యాచారం ఘటనకు సంబంధించి నేరం చేసింది తానేనని ఒప్పుకొని.. ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా ‘కావాలంటే నన్ను ఉరి తీసుకోండి’ (అమీ ఫాసీ దీయే దీ) అని పోలీసుల విచారణలో చెప్పిన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ఇప్పుడు మాటమార్చేశాడు.
తనకు ఏ పాపం తెలియిదని.. తాను అమాయకుడినని, తనకు కేసులో ఇరికించారని కోర్టులో న్యాయమూర్తి ఎదుట కన్నీరు పెట్టుకున్నట్లు తెలిసింది. హత్యాచార ఘటన జరిగిన మరుసటి రోజు అంటే ఆగస్టు 10వ తేదీ నుంచి కస్టడీలో ఉన్న సంజయ్ రాయ్‌ను కేసు విచారణలో భాగంగా శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు అతడు సంచలన ఆరోపణలు చేసినట్లు తెలిసింది.
విచారణ సందర్భంగా... లైడిటెక్టర్ (పాలిగ్రఫీ) పరీక్షకు సమ్మతించడంపై న్యాయమూర్తి ప్రశ్నించడంతో సంజయ్ రాయ్ భావోద్వేగానికి గురయ్యాడు. ‘‘నేను ఎలాంటి నేరమూ చేయలేదు. ఈ కేసులో నన్ను ఇరికించారు. బహుశా ఈ పరీక్ష (లైడిటెక్టర్ టెస్ట్)తో నేను తప్పు చేయలేదనే విషయం రుజువవ్వొచ్చు’’ అంటూ సంజయ్ రాయ్ కన్నీరు పెట్టుకున్నట్లు సమాచారం.
మరోవైపు.. ఆర్జీకర్ వైద్యకళాశాల, ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మరింత చిక్కుల్లో పడ్డారు. కాలేజీలో దారుణ అత్యాచారం, హత్యకు గురైన స్థితిలో జూనియర్ వైద్యురాలి మృతదేహం లభించడంతో ఇప్పటికే విచారణను ఎదుర్కొంటున్న ఆయనపై సీబీఐ, ఆర్జీకర్‌లో ఆర్థిక అవకతవకలకు సంబంధించి కేసు నమోదు చేసింది. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ఆగస్టు 13న కేసు సిట్ నుంచి సీబీఐ చేతుల్లోకి వెళ్లింది.
ఈ క్రమంలో ఆర్జీకర్‌లో ఘోష్ హయాంలో ఆర్థిక అవకతవకలు జరిగాయని, ఈడీతో విచారణ జరిపించాలంటూ కాలేజీ మాజీ డెప్యూటీ సూపరింటెండెంట్ అక్తర్ అలీ కలకత్తా హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు సూచనల మేరకు ఘోష్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. హత్యాచార ఘటనకు సంబంధించి ఆయన్ను సీబీఐ ఇప్పటికే 88 గంటలపాటు ప్రశ్నించింది.
పుణెలో బాలికపై లైంగిక వేధింపులు
మహారాష్ట్ర పుణెలోని ఓ పాఠశాలలో 12 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ఓ వ్యాయామ ఉపాధ్యాయుడు సహా ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పుణె పింప్రీ చించ్‌వాడ్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ బడిలో చదువుతున్న 12 ఏళ్ల బాలికను అక్కడ పనిచేసే వ్యాయామ ఉపాధ్యాయుడు రెండేళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడు. మరోవైపు అసోంలో పదో తరగతి బాలికపై ముగ్గురు మృగాళ్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ప్రధాన నిందితుడు తఫ్జుల్ ఇస్లాంను పోలీసులు శనివారం దర్యాప్తులో భాగంగా ఘటనా స్థలికి తీసుకెళ్లారు. అక్కడ అతడు ప్రాణభయంతో తప్పించుకునే ప్రయత్నంలో చెరువులో దూకి మృతి చెందాడు.
ఆరుగురికి పాలిగ్రఫీ టెస్ట్ పూర్తి
కలకత్తా హైకోర్టు అనుమతి మేరకు శనివారం సాయంత్రం ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కి సీబీఐ లైడిటెక్టర్ (పాలిగ్రఫీ) పరీక్ష నిర్వహించింది. ఇదేరోజు మాజీ ప్రిన్సిపల్ ఘోష్, మరో నలుగురికి కూడా లైడిటెక్టర్ పరీక్షను నిర్వహించారు. హత్యాచార ఘటనకు సంబంధించి సుప్రీంకోర్టుకు సెప్టెంబరు 17న సీబీఐ నివేదిక సమర్పించాల్సి ఉంది.
Updated Date - Aug 25 , 2024 | 07:17 AM