ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi High Court : కేజ్రీవాల్‌ బెయిల్‌పై స్టే

ABN, Publish Date - Jun 22 , 2024 | 04:24 AM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు స్థానిక కోర్టు మంజూరు చేసిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. దీంతో శుక్రవారం తిహాడ్‌ జైలు నుంచి విడుదల కావాల్సిన కేజ్రీవాల్‌ జైలులోనే ఉండిపోయారు.

తాత్కాలికంగా నిలిపివేసిన ఢిల్లీ హైకోర్టు.. సాక్ష్యాధారాలు పట్టించుకోలేదు

వాదనలకు విచారణ కోర్టు తగిన సమయం ఇవ్వలేదు: ఈడీ

ఐదు గంటల్లో మూడున్నర గంటలకుపైగా ఈడీ లాయరే వాదించారు

అనుకూల తీర్పు ఇవ్వకపోతే జడ్జినే నిందించటం దారుణం

ఈడీ బావిలో పడ్డ కప్పలా తయారైంది.. కేజ్రీవాల్‌ తరఫు లాయర్ల వాదనలు

2-3 రోజుల్లో నిర్ణయం వెలువరిస్తానన్న న్యాయమూర్తి

తాత్కాలికంగా నిలిపివేసిన ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు స్థానిక కోర్టు మంజూరు చేసిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. దీంతో శుక్రవారం తిహాడ్‌ జైలు నుంచి విడుదల కావాల్సిన కేజ్రీవాల్‌ జైలులోనే ఉండిపోయారు. గురువారం రాత్రి కేజ్రీవాల్‌కు బెయిల్‌ లభించిన నేపథ్యంలో శుక్రవారం ఉదయమే ఈడీ.. విచారణ కోర్టు ఆదేశాలను హైకోర్టులో సవాల్‌ చేసింది. జస్టిస్‌ సుధీర్‌కుమార్‌ జైన్‌ దీనిపై విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఈడీ తరఫున వాదనలు వినిపించిన అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు.. కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేసిన విచారణ కోర్టు న్యాయాధికారి నియయ్‌బిందుపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు పూర్తిగా వాదనలు వినిపించటానికి అవకాశం ఇవ్వలేదన్నారు.

తాము అప్పటికే సమర్పించిన పత్రాలను కూడా న్యాయాధికారి పరిశీలించలేదని, ఆ పత్రాలు చాలా ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించారని చెప్పారు. కేసును త్వరగా ముగించేద్దామన్న ఆదుర్దాతో న్యాయాధికారి వ్యవహరించారని ఆరోపించారు. అహేతుకంగా, ఏకపక్షంగా ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈడీ ప్రత్యక్ష సాక్ష్యాలు సమర్పించలేదన్న కోర్టు అభిప్రాయం సరైనది కాదని, మాగుంట శ్రీనివాసులురెడ్డి కేజ్రీవాల్‌ను కలిసినప్పుడు రూ.వంద కోట్లు డిమాండ్‌ చేశారని, ఈ విషయం మాగుంట వాంగ్మూలంలో ఉందన్నారు.


గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం రూ.45 కోట్లు మళ్లించారని సాక్ష్యాలతో నిరూపించినా క్రింది కోర్టు విస్మరించిందని అన్నారు. ఈ వాదనలను కేజ్రీవాల్‌ తరఫు సీనియర్‌ న్యాయవాదులు అభిషేక్‌ మనుసింఘ్వీ, విక్రమ్‌ చౌదరి ఖండిస్తూ వాదనలు వినిపించారు. విచారణ కోర్టులో ఈ కేసుపై ఐదు గంటల పాటు విచారణ జరిగితే.. అందులో 3 గంటల 45 నిమిషాల సమయం న్యాయాధికారి ఈడీకి ఇచ్చారని చెప్పారు. దేశంలోని పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛ ఈడీకి పట్టదని, బెయిల్‌ గురించి చట్టం స్పష్టంగా చెబుతోందని, కానీ, ఈడీ వ్యవహారం ‘నా మాట వినకుంటే జైలుకే’ అన్నట్లుగా ఉందన్నారు. విచారణ కోర్టు ఇచ్చిన ఆదేశాలను అహేతుకం అని ఈడీ న్యాయవాది అభివర్ణించటాన్ని తప్పుబడుతూ.. బావిలో కప్పలా తయారైన ఈడీకి అలా అనిపిస్తున్నట్టుంది అని ఎద్దేవా చేశారు. ఈ కేసుకు సంబంధించి కేజ్రీవాల్‌కు ఒక్క పైసా లభించినట్లుగా కూడా ఈడీ ఇప్పటివరకూ ఒక్క ఆధారమూ సేకరించలేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్‌ సుధీర్‌ కుమార్‌ జైన్‌.. ఈ కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను పరిశీలించి 2-3 రోజుల్లో నిర్ణయం వెలువరిస్తానని చెప్పారు. అప్పటి వరకూ విచారణ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై స్టే విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 24వ తేదీలోపు ఇరుపక్షాలు లిఖితపూర్వక వాదనలు సమర్పించాలన్నారు. కేసును జూలై 10కి వాయిదా వేశారు.

యెడియూరప్పకు ఎలా?

ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ సీఎం యెడియూరప్పకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ యాంటిసిపేటరీ బెయిల్‌ లభించిందని, కిడ్నాప్‌ కేసు ఎదుర్కొంటున్న హెచ్‌డీ రేవన్నకు బెయిల్‌ లభించిందని.. కానీ, కేజ్రీవాల్‌, హేమంత్‌ సోరేన్‌లకు లభించలేదని సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, ఎంపీ కపిల్‌ సిబల్‌ పేర్కొన్నారు. దేశంలో నియంతృత్వం అన్ని హద్దులనూ దాటిందని కేజ్రీవాల్‌ భార్య సునీత విమర్శించారు.


ఢిల్లీ మంత్రి అతిషి నిరాహార దీక్ష

ఢిల్లీలో రోజురోజుకు నీటి సంక్షోభం ముదురుతోంది. హరియాణా నుంచి దక్కాల్సిన నీటి వాటాను డిమాండ్‌ చేస్తూ ఆ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అతిషి దక్షిణ ఢిల్లీలోని భోగల్‌లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. అంతకుముందు సునీత కేజ్రీవాల్‌, మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌, ఎంపీ సంజయ్‌ సింగ్‌ ఇతర పార్టీ నేతలతో కలసి రాజ్‌ఘాట్‌ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అతిషి దీక్ష ప్రారంభించిన అనంతరం.. కేజ్రీవాల్‌ జైలు నుంచి పంపిన సందేశాన్ని సునీత చదివి వినిపించారు. అతిషి చేపట్టిన దీక్ష విజయవంతమవుతుందని కేజ్రీవాల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - Jun 22 , 2024 | 04:28 AM

Advertising
Advertising