ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పీఠికకు బాసట

ABN, Publish Date - Nov 26 , 2024 | 03:40 AM

దేశంలో మంగళవారం రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించనున్న తరుణంలో సుప్రీంకోర్టు సోమవారం ‘పీఠిక’కు సంబంధించి కీలక తీర్పును వెలువరించింది.

సామ్య, లౌకిక వాదాల చేర్పు సరైనదే

అవతారికను సవరించే అధికారం

పార్లమెంటుకు ఉంది.. విచారణ అనవసరం

సామ్యవాదం అంటే సమానత్వం

మతంలోని లోపాల నివారణ కూడా లౌకిక వాదంలో భాగం.. సుప్రీం వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, నవంబరు 25: దేశంలో మంగళవారం రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించనున్న తరుణంలో సుప్రీంకోర్టు సోమవారం ‘పీఠిక’కు సంబంధించి కీలక తీర్పును వెలువరించింది. 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన అంశాలకు ఆమోదం తెలిపింది. రాజ్యాంగం అవతారికలో ‘సామ్యవాదం’, ‘లౌకికవాదం’, ‘సమగ్రత’ అన్న పదాలను చేర్చడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను కొట్టివేసింది. ఈ అంశంపై విచారణ జరపాల్సిన పనిలేదని విస్పష్టంగా తెలిపింది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అత్యయిక పరిస్థితి అమల్లో ఉన్న సమయంలో రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికలో ఈ పదాలను అదనంగా చేర్చారు. దీన్ని సవాలు చేస్తూ తొలిసారిగా 2020లో బలరాం సింగ్‌ అనే వ్యక్తి న్యాయవాది విష్ణు కుమార్‌ జైన్‌ ద్వారా పిటిషన్‌ వేశారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యుడు, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, న్యాయవాది, బీజేపీ నాయకుడు అశ్విన్‌ కుమార్‌ ఉపాధ్యాయలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ పి.వి. సంజయ్‌ కుమార్‌ల ధర్మాసనం శుక్రవారం తీర్పును వాయిదా వేసింది. సోమవారం సీజేఐ జస్టిస్‌ ఖన్నా తీర్పును వెలువరిస్తూ ‘‘ఈ విషయమై మరింత లోతుగా విచారణలు, తీర్పులు అవసరం లేదు. రాజ్యాంగాన్ని సవరించేందుకు పార్లమెంటుకు ఉన్న అధికారం పీఠికకు కూడా వర్తిస్తుంది’’ అంటూ స్పష్టత ఇచ్చారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ సవరణలు చేసేందుకు అడ్డంకి కాబోదని ధర్మాసనం తెలిపింది. ఆ తేదీ సవరణలు చేసేందుకు పార్లమెంటుకు ఉన్న అధికారాలను తగ్గించలేదని పేర్కొంది. ఆర్టికల్‌ 368 ప్రకారం రాజ్యాంగ సవరణలు చేసే అధికారం పార్లమెంటుకు ఉందని తెలిపింది. రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26న ఆమోదించగా అనంతరం ఎప్పుడో 1976లో పీఠికను సవరించి ‘సామ్యవాదం’, ‘లౌకికవాదం’ అన్న పదాలను ఎలా చేర్చుతారంటూ సుబ్రహ్మణ్య స్వామి ప్రశ్నించారు. అలా చేర్చడం ద్వారా మొదటి నుంచే ఈ భావనలు అమల్లో ఉన్నట్టైందని అభ్యంతరం చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పష్టతనిస్తూ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ సవరణలకు అడ్డంకి కాబోదని తెలిపింది. ‘‘రాజ్యాంగ సవరణకు 368 అధికరణం ద్వారా పార్లమెంటుకు సంక్రమించిన అధికారం నిర్వివాదమైనది. ఆ అధికారాన్ని ఇప్పుడు సవాలు చేయలేదు’’ అని పేర్కొంది.

సమానత్వ భావనకు మరో రూపం

పిటిషనర్లు ప్రధానంగా అభ్యంతరం తెలిపిన ‘సామ్యవాదం’, ‘లౌకికవాదం’ అన్న పదాల చేర్పుపై ధర్మాసనం వివరణ ఇచ్చింది. ఇది రాజ్యాంగం మౌలిక సూత్రమైన ‘సమానత్వం’ అన్న భావనను మరో రూపంలో చెప్పడమేనని స్పష్టం చేసింది. పీఠికలో ‘లౌకిక వాదం’ అన్న పదాన్ని ఎందుకు చేర్చాల్సి వచ్చిందన్న దానిపై జస్టిస్‌ ఖన్నా వివరణ ఇస్తూ.. ‘‘సమానత్వానికి, ప్రజా ప్రయోజనానికి అడ్డంకులు కలిగించేలా మత విశ్వాసాలు ఉంటే అందులో రాజ్యం జోక్యం చేసుకుంటుంది. ఈ స్పష్టత కోసమే పీఠికలో ‘సెక్యులర్‌’ అన్న పదాన్ని పొందుపరిచారు’’ అని వివరించారు. లౌకికవాద భావనను దేశ పరిస్థితులకు అనుగుణంగానే అర్థం చేసుకోవాలన్నారు.

భారతీయ నేపథ్యంలోనే భాష్యం

‘సామ్యవాదం’ అన్న భావనకు కూడా భారత దేశ నేపథ్యంలోనే భాష్యం చెప్పాల్సి ఉంటుందని పేర్కొంది. ఆర్థిక విధానాలకు అడ్డంకి అని భావించకూడదని తెలిపింది. ‘‘రాజ్యాంగంగానీ, పీఠికగానీ ఏదో ప్రత్యేక ఆర్థిక విధానాన్ని అనుసరించాలని ఎక్కడా చెప్పలేదు. ‘సామ్యవాదం’ అంటే ‘సంక్షేమ రాజ్యా’నికి కట్టుబడి ఉండడం. సమాన అవకాశాలకు భరోసా ఇవ్వడం. ‘సామ్యవాదం’ అనే పదం ఆర్థిక, సామాజిక ఉన్నతి కోసం పెట్టుకున్న లక్ష్యాలను ప్రతిబింబించేది. అంతేతప్ప ప్రయివేటు రంగాన్ని, వ్యాపార, వాణిజ్యాలు చేసుకునే హక్కును నియంత్రించేది మాత్రం కాదు’’ అని వివరణ ఇచ్చింది. అయినా 42వ రాజ్యాంగ సవరణ జరిగి 44 ఏళ్లు గడవగా (పిటిషన్‌ దాఖలు చేసిన 2020నాటికి) ఇప్పుడు ఈ సమస్యను ఎందుకు లేవనెత్తారంటూ పిటిషనర్ల ఉద్దేశాలను ప్రశ్నించింది. ‘‘ఈ రెండు పదాలను చేర్చడం వల్ల ఎన్నికైన ప్రభుత్వాలు అనుసరించిన విధానాలకుగానీ, చట్టాలకుగానీ ఆటంకం కలగలేదు. ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ హక్కులు, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విఘాతం కలిగించలేదు. ఈ పదాలకు ప్రజామోదం లభించింది’’ అని పేర్కొంది. తగిన చట్టబద్ధమైన కారణాన్ని చూపకుండా, అస్పష్టంగా ఉన్న ఈ పిటిషన్లను కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది.

Updated Date - Nov 26 , 2024 | 03:54 AM