అదానీ గ్రూప్ స్విస్ ఖాతాలను జల్లెడ పడుతున్న ఓఏజీ
ABN, Publish Date - Sep 22 , 2024 | 02:46 AM
అదానీ గ్రూప్‌నకు సంబంధించి ఇటీవల స్విట్జర్లాండ్ ఫెడరల్ క్రిమినల్ కోర్టు స్తంభింపచేసిన బ్యాంకు ఖాతాలను స్విస్ అటార్నీ జనరల్ ఆఫీస్ (ఓఏజీ) నిశితంగా పరిశీలిస్తోంది.
అసలు లబ్ధిదారు ఎవరు?
బెర్న్ (స్విట్జర్లాండ్): అదానీ గ్రూప్‌నకు సంబంధించి ఇటీవల స్విట్జర్లాండ్ ఫెడరల్ క్రిమినల్ కోర్టు స్తంభింపచేసిన బ్యాంకు ఖాతాలను స్విస్ అటార్నీ జనరల్ ఆఫీస్ (ఓఏజీ) నిశితంగా పరిశీలిస్తోంది. ఈ వ్యవహారంలో అదానీ సోదరుల్లో ఒకరైన వినోద్ అదానీ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ ఓఏజీ మాత్రం తొందరపడటం లేదు. ఈ కేసు విచారణలో అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట చర్యలు తీసుకోవాలని ఓఏజీ భావిస్తున్నట్లు శుక్రవారం నాటి ది వైర్ ప్రత్యేక కథనం పేర్కొంది. ఈ వ్యవహారంలో మోదీ ప్రభుత్వం, మార్కెట్ నియంత్రణ మండలి సెబీ ఉదాసీనంగా వ్యవహరించినట్లుగా తాము ఉండబోమని ఓఏజీ అధికార వర్గాలు పేర్కొన్నట్లు ది వైర్ కథనం వెల్లడించింది. అంతేకాకుండా ప్రధానంగా ఈ వ్యవహారంలో లబ్ది పొందిన వారి వివరాలను తేల్చే పనిలో సదరు కార్యాలయం విస్తృతంగా పనిచేస్తున్నట్లు తెలిపింది. మరోవైపు ఈ కేసులో నిధుల మళ్లింపునకు సంబంధించి ఆధారాలు లభించినట్లు కూడా తెలిసిందని కథనం పేర్కొంది. అయితే అదానీ ఖాతాలకు సంబంధించి స్విట్జర్లాండ్ క్రిమినల్ కోర్టు తీర్పు వెలువరించిన సమయంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ జెనీవా పర్యటనలో ఉండటం గమనార్హం. గత ఏడాది హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల దందాను బయటపెట్టిన సంగతి తెలిసిందే.
Updated Date - Sep 22 , 2024 | 02:46 AM