Fenjal Cyclone: తమిళనాట ఆగని విధ్వంసం
ABN, Publish Date - Dec 03 , 2024 | 04:48 AM
ఫెంగల్ తుఫాను తీరం దాటిన తర్వాత కూడా తమిళనాడును అతలాకుతలం చేస్తోంది.
తమిళనాట కొనసాగుతున్న తుఫాను బీభత్సం!
కృష్ణగిరి జిల్లాలో 50 సెం.మీ. వర్షం
చెరువు కట్టలు తెగి కొట్టుకుపోయిన వాహనాలు
ధర్మపురి, సేలం, నామక్కల్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు
తిరువణ్ణామలైలో విరిగిపడిన కొండచరియలు
శిథిలాల నుంచి ఆరు మృతదేహాల వెలికితీత
మరొకరి కోసం కొనసాగుతున్న గాలింపు
చెన్నై, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఫెంగల్ తుఫాను తీరం దాటిన తర్వాత కూడా తమిళనాడును అతలాకుతలం చేస్తోంది. కృష్ణగిరి జిల్లా ఊత్తాంగరై ప్రాంతంలో ఆదివారం 50 సెం.మీ.ల వర్షం కురిసింది. దీంతో ఎక్కూరు అమ్మన్ చెరువు కట్టలు తెగి దిగువకు వరద పోటెత్తి, రహదారి పక్కన నిలిపిన వ్యాన్లు, కార్లు కొట్టుకుపోయాయి. ధర్మపురి, సేలం, నామక్కల్ జిల్లాల్లోనూ భారీగా వర్షాలు కురిశాయి. ధర్మపురి జిల్లా అన్నై సత్యానగర్, ఆవిన్ నగర్, నంది నగర్ ప్రాంతాల్లో నివాసాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. విల్లుపురం జిల్లాలో తెన్‌పెన్నై, కోరైయారు వాగులు ఉధృతంగా ప్రవహించి నాలుగు గ్రామాలను దీవులుగా మార్చాయి. వరద బాధిత జిల్లాల్లో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పర్యటించారు. బాధితులకు ఆహారపానీయాలు, దుప్పట్లు, వస్త్రాలు తదితరాలను అందజేశారు. మరోవైపు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి క్రమంగా కోలుకుంటోంది.
సోమవారం సాయంత్రానికి కొన్ని ప్రాంతాల్లో వరదనీరు తగ్గుముఖం పట్టింది. తమిళనాడులోని సుప్రసిద్ధ శైవక్షేత్రం తిరువణ్ణామలైలో కొండచరియలు విరిగి పడడంతో దంపతులు సహా ఏడుగురు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం తిరువణ్ణామలైలో కుండపోతగా వర్షం కురిసింది. సాయంత్రం 4.30 గంటలకు కార్తీక దీపోత్సవం సందర్భంగా అరుణాచలంపై 2,668 అడుగుల ఎత్తున మహాదీపాన్ని వెలిగించే శిఖర భాగం నుంచి హఠాత్తుగా బండరాళ్లు, మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. ఓ ఇంటిపై పెద్ద బండలు, మట్టిపెళ్లలు భారీగా పడ్డాయి. ఆ ఇంట్లో చిక్కుకుపోయిన రాజ్‌కుమార్(32), ఆయన భార్య మీనా(26), పిల్లలు గౌతమ్(9), ఇనియా(7), బంధువుల పిల్లలు మహా(12), వినోదిని(14), రమ్య(12) కోసం అధికారులు గాలింపు చేపట్టి ఆరు మృతదేహాలను వెలికితీశారు. మరొక చిన్నారి కోసం గాలింపు కొనసాగుతోంది.
Updated Date - Dec 03 , 2024 | 04:51 AM