ఆర్మీ అంబులెన్స్‌పై ఉగ్రదాడి
ABN, Publish Date - Oct 29 , 2024 | 03:42 AM
జమ్మూకశ్మీర్‌లో వరుస ఉగ్రదాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. భద్రతా సిబ్బంది, వలస కూలీలపై ముష్కరులు గత కొంత కాలంగా కాల్పులకు తెగబడుతూ రెచ్చిపోతున్నారు.
ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరుల హతం
జమ్మూకశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టారులో ఘటన
శ్రీనగర్, అక్టోబరు 28: జమ్మూకశ్మీర్‌లో వరుస ఉగ్రదాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. భద్రతా సిబ్బంది, వలస కూలీలపై ముష్కరులు గత కొంత కాలంగా కాల్పులకు తెగబడుతూ రెచ్చిపోతున్నారు. సోమవారం ఉదయం జమ్మూలోని అఖ్నూర్ సెక్టారు వద్ద ఆర్మీ అంబులెన్స్‌పై ముగ్గురు ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘనటలో జవాన్లు ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ఉగ్రదాడిలో ఓ పోలీసు జాగిలం చనిపోయిందని చెప్పారు. తక్షణమే స్పందించిన భద్రతా సిబ్బంది ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టారు. కనీసం ముగ్గురు ముష్కరులను హతమార్చినట్లు, వారి వద్ద నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. మిగతా వారి కోసం ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులతో కలిసి సంయుక్తంగా గస్తీ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. కాగా, 4 రోజుల క్రితం గుల్మార్గ్ సెక్టారు సమీపంలో సైనిక వాహనంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అక్టోబరు 20న ముష్కరులు జరిపిన కాల్పుల్లో ఓ డాక్టర్‌తో పాటు ఆరుగురు వలసకార్మికులు మృతి చెందారు.
Updated Date - Oct 29 , 2024 | 03:42 AM